అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ త్వరలో `ఆచార్య’ చిత్రం సెట్లోకి అడుగు పెట్టబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. గతంలో చిరంజీవి నటించిన `ఖైదీ నెంబర్ 150’లో కాజలే నటించింది. ఆ చిత్రం ఘన విజయం సాధించిన నేపథ్యంలో మళ్లీ చిరంజీవి సరసన నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. కాగా ఆచార్య చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమై, శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని కోకాపేటలో చిత్రీకరణ జరుపుతున్నారు.
చిరంజీవి, సోనూసూద్ తదితర తారలు పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. హీరోయిన్ కాజల్ ఎంట్రీ ఎప్పుడు? అని అనుకుంటున్న తరుణంలో అతి త్వరలో షూటింగులోకి ఆమె ప్రవేశించనున్నట్లు సమాచారం. నెల రోజుల క్రితం ఆమె వివాహం జరిగిన విషయం, తన భర్త గౌతమ్ తో కలసి ఆమె హనీమూన్ కు మాల్దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. హనీమూన్ నుంచి తిరిగి ముంబైకి చేరుకున్న నూతన దంపతులు అక్కడి నుంచి చెన్నైకి కలిసి వెళ్లారు. కాజల్ ఇక షూటింగులలో తిరిగి పాల్గొనేందుకు సమాయత్తమవుతోంది.
ప్రస్తుతం ఆమె ఆచార్య సినిమాతో పాటు భారతీయుడు-2, మోసగాళ్లు, ముంబై సగ చిత్రాలలో నటిస్తోంది. ఏ చిత్రాలన్నీ వివిధ దశలలో ఉన్నాయి. ఇదిలావుండగా..తమిళంలో ఓ కొత్త చిత్రాన్ని కాజల్ అంగీకరించింది. తమిళ దర్శకుడు డీకే దర్శకత్వంలో ఆమె నటించనుంది. నాలుగేళ్ళ క్రితం డీకే దర్శకత్వంలో ఆమె ఓ తమిళ చిత్రం చేసింది కూడా. తాజాగా డీకీ చెప్పిన కథ కాజల్ కు ఎంతగానో నచ్చిందట. చెన్నైకి తన భర్త గౌతమ్ తో కలసి వెళ్లి ఆ చిత్రాన్ని ఆమె అంగీకరించింది.