ఏపీలో సినిమా టిక్కెట్ల ధర వివాదానికి ఈరోజుతో ఫుల్ స్టాప్ పడనుంది. తెలుగు చలన చిత్ర ప్రముఖుల బృందం సీఎం జగన్ ను కలవడానికి బయలుదేరి వెళ్లింది. టిక్కెట్ ధర ఎంత ఉండాలనే విషయంలో అధ్యయనం చేసిన కమిటీ సిఫార్సులు కూడా ప్రభుత్వానికి అందాయి. ఎయిర్ కూల్ థియేటర్లకు కనీస ధర రూ. 40, గరిష్ఠ ధర రూ. 120గా ఉండాలని కమిటీ సూచించింది. నాన్ ఏసీ థియేటర్లలో కనీస ధర రూ. 30, గరిష్ఠ ధర రూ. 70గా ఉండాలని నివేదికలో పేర్కొన్నారు. మరో పక్క ఈ ధరలపై నేడు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ కూడా జరగనుంది.
ధరల విషయంలో ఈ సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒక్క ధరల విషయమే కాకుండా చిత్ర పరిశ్రమకు రాయితీలు, కళాకారులకు ప్రోత్సాహకాలు తదితర అంశాలపై టాలీవుడ్ ప్రముఖులు సీఎం జగన్ తో చర్చించనున్నారు. ఈ మధ్యాహ్నం సీఎంతో భేటీ అయ్యేందుకు మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, అల్లు అరవింద్త, పోసాని కృష్ణ మురళి, అలీ, ఆర్. నారాయణ మూర్తి తదితరులు బయలుదేరి వెళ్లారు.
ఈ భేటీపై అంతటా ఆసక్తి నెలకొంది. తమ కుటుంబం తరఫున చిరంజీవి వెళుతున్నారని, చిత్ర పరిశ్రమ సమస్యలు ఈరోజుతో సమసిపోతాయని తాను భావిస్తున్నట్లు అల్లు అరవింద్ పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఎవరెవరు వస్తున్నారో తనకు తెలియదని, తనకు ఆహ్వానం అందడంతో బయలుదేరి వెళుతున్నట్లు చిరంజీవి పేర్కొన్నారు.











