పెరిగిన పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ శుక్రవారం ఛలో రాజ్ భవన్కు పిలుపు ఇచ్చింది. ఈ సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులను బయటకు రాకుండా గృహ నిర్భంధం చేశారని, ఈ రకమైన అరెస్టులు చేసి పోలీసులతో పరిపాలన చేయాలని సీఎం కేసీఆర్ అనుకుంటే.. తీవ్రమైన పరిణామలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అధికారులు ముఖ్యమంత్రి ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తే.. ఎవరినీ వదిలిపెట్టమని అంటూ ఐజీ ఇంటిలిజెన్స్ ప్రభాకరరావు తీరుపై రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అబద్ధాలతోనే రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన పాలనలో ఏఒక్కరూ సంతోషంగా లేరని అన్నారు. కేసీఆర్, మోదీలు ప్రజలను పీడించి పన్నులు వసూలు చేస్తున్నారని, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన ఇద్దరికీ గుణపాఠం చెప్పాలని అన్నారు.
అరెస్టు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు వెంటనే విడిచిపెట్టాలని రేవంత్ రెడ్డి అన్నారు. శాంతియుత నిరసనలను ఇలా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే లక్షలాది మంది రోడ్డుపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తారని హెచ్చరించారు. ఎంత మందిని అరెస్టు చేయించినప్పటికీ తమ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రత్యేక తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో అధికారంలో కోల్పోయిందని, తెలంగాణ కోసం రక్తం ధారగా పోసిందని గుర్తుచేశారు. మోదీ, కేసీఆర్ కు తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
Must Read ;- కాంగ్రెస్ లోకి పీకే?.. మోదీకి కష్టమేనా?











