తెలంగాణ రాష్ట్ర సాధనలో యువత ప్రధాన పాత్ర పోషించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలకు సైతం తెగించారు. ధర్నాలు, రాస్తారోకోలు, రైల్ రోకోలకు లాంటి ఎన్నో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ వస్తేనే.. తాము బతుకులు బాగుపడ్తాయనే లక్ష్యంతో ప్రత్యేక రాష్ట్ర సాధనకు నడుంబిగించారు. ఎన్నో ఆశలు.. ఎన్నో కలలతో ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నారు. బంగారు తెలంగాణలో తమ బతుకులు బాగుపడ్తాయని భావించినా నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఏళ్లకు ఏళ్లు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడకపోవడంతో.. ఆత్మహత్యలే శరణ్యం అనుకున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మొండిచెయ్యి చూపడంతో కూలీ, నాలీ చేసుకుంటూ జీవితాలు వెళ్లదీస్తున్నారు.
నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి ఫోకస్
టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన రేవంత్ రెడ్డి జెట్ స్పీడుతో దూసుకుపోతున్నారు. ఆయనపై ఎంపికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. వ్యతిరేకులను, పార్టీ సీనియర్లను కలుపుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే వరుసగా కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, వీహెచ్ తో పాటు సీతక్క, రాజనర్సింహ, కొండా సురేఖలతో భేటీ అయి.. తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి.. ప్రధానంగా యువతపై ఫోకస్ చేశారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన విద్యార్థులను తనవైపు తిప్పుకునే మాస్టర్ ప్లాన్ తయారుచేస్తున్నాడు. ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల నియామకం చేపట్టకపోవడంతో నిరుద్యోగులు పెరిగిపోయారు. ఈ ఇష్యూనే బేస్ గా చేసుకొని రేవంత్ రెడ్డి చక్రం తిప్పాలని చూస్తున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం ఎందుకు లభించలేదు? నిరుద్యోగులను మభ్యపెడుతూ కేసీఆర్ ఎలా మోసం చేశారు? అనే అంశాలను తెలంగాణ యువతకు వివరించి, తనవైపు తప్పికునే ప్రణాళికలను రచిస్తున్నారు. అయితే తెలంగాణలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోయే వైఎస్ షర్మిల నిరుద్యోగుల సమస్యలపై దీక్షలు చేసినప్పటికీ, ఆమె అంతగా ప్రభావం చూపలేదనే ఆరోపణలున్నాయి. ఇక తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ మాత్రం నిరుద్యోగుల సమస్యలపై కేసీఆర్ సర్కార్ తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో ప్రధాన పార్టీలు అధికారం కైవసం చేసుకునేందుకు పాదయాత్రల వైపు మొగ్గు చూపాయి. రేవంత్ రెడ్డి కూడా త్వరలో పాదయాత్ర చేపట్టి, తద్వారా నిరుద్యోగులను, జనాలను కలుసుకొని, కాంగ్రెస్ కు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకతరం నష్టపోయింది
టీపీసీసీ చీఫ్ గా ఎంపికైన రేవంత్ రెడ్డి బుధవారం తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో మీటింగ్ జరిపారు. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా నిరుద్యోగుల సమస్యలపై ప్రస్తావించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడంతో ఒక తరానికి తీరని నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో 90 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఏడేళ్లుగా ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ పోతానే.. తెలంగాణలో అన్ని సమస్యలు పోతాయని తనదైన స్టైయిల్ లో విమర్శించారు.
Must Read ;- రేవంత్ స్టైలే వేరు.. అన్నీ చూసే అప్పగించారు పగ్గాలు











