తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మిటీ (టీపీసీసీ)కి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మరుక్షణమే రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ ను గంపగుత్తగా టార్గెట్ చేసేశారు. టీఆర్ఎస్‌తో పాటు నేరుగా సీఎం కేసీఆర్ నే ఇబ్బంది పెట్టేలా జంపింగ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న డిమాండ్ తో బరిలోకి దిగనున్న రేవంత్ త్వరలోనే సరికొత్త పోరాటాన్ని సాగిస్తున్నారు. ఈ మేరకు అనర్హత వేటు వేదికగా తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. వెరసి ఈ కొత్త చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి రాజేసింది. ఇప్పటికే ఈ దిశగా ఇటు కాంగ్రెస్ నేతలతో పాటు అటు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల మధ్యన మాటల యుద్ధం నడుస్తోంది.
2018లో ముందస్తు ఎన్నికలు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఐదేళ్ల పాటు సీఎంగా కొనసాగకుండానే 2018 డిసెంబర్ లోనే ఎన్నికలకు వెళ్లారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను ముందే పసిగట్టిన కేసీఆర్.. పరిస్థితులను తనకు అనుకూలంగా మలచుకుని ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. వెరసి ప్రతిపక్షాలకు వ్యూహాలు రచించుకునే అవకాశం కూడా కేసీఆర్ ఇవ్వలేదన్న వాదనలు వినిపించాయి. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు 88 సీట్లు రాగా.. దాని తర్వాత అత్యధిక సంఖ్యలో సీట్లను సాధించిన పార్టీగా నిలిచిన కాంగ్రెస్ 19 సీట్లను కైవసం చేసుకుంది. అయితే 2014 ఎన్నికల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలను ఎలాగైతే గుంజేశారో… 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను లాగే వ్యూహానికి కేసీఆర్ పదును పెట్టారు.
పార్టీ మారినా ఎమ్మెల్యేలుగానే జంపింగ్ లు
కేసీఆర్ కొనసాగించిన ఆపరేషన్ ఆకర్ష్ కు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరిపోయారు. పార్టీ మారినా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండానే ఈ ఏడుగురు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కొత్తగా టీపీసీసీ చీఫ్ గా ఎన్నికైన రేవంత్ రెడ్డి… ఇదే అంశాన్ని ఆసరా చేసుకుని కేసీఆర్ సర్కారుపై పోరు సాగించేందుకు సిద్ధపడిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఇప్పటికే కార్యరంగాన్ని కూడా రేవంత్ సిద్ధం చేసుకున్నారన్న వార్తలు కూడా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
అనర్హత వేటు ఎందుకు వేయరు?
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీఆర్ఎస్ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ చేరిన సంగతి తెలిసిందే కదా. నాడు వారిని రాళ్లతో కొట్టాలంటూ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీ మారిన రాములు నాయక్ తో పాటు కొండా మురళిపైనా కేసీఆర్ సర్కారు వేటు వేసింది. అయితే టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఇతర పార్టీల నేతలపై మాత్రం ఎందుకు వేటు వేయరు? అన్న విషయాన్ని అస్త్రంగా మలచుకున్న రేవంత్.. ఈ అంశంపైనే టీఆర్ఎస్ ను ప్రత్యేకించి కేసీఆర్ ను జనం బోనులో నిలిపే దిశగా పకడ్బందీ వ్యూహాన్నే అమలు చేస్తున్నారు. ఈ వ్యూహానికి మరింత బలం చేకూర్చేలా ఇటీవల టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిపోయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాకే పార్టీ మారిన వైనాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావించేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధపడుతున్నారు. మొత్తంగా పార్టీ మారిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూనే.., ఈ విషయంలో కేసీఆర్ వ్యవహరించిన తీరును ప్రజల ముందు పెట్టి రేవంత్ పోరు సాగించనున్నారట. రేవంత్ ఆధ్వర్యంలో త్వరలోనే తెర మీదకు వచ్చే ఈ పోరు తెలంగాణ రాజకీయాల్లో కాక పుట్టించడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- రేవంత్ డేరింగ్.. నీళ్లపై నిప్పులెందుకంటే?