Is PK Joining In Congress Party :
పీకే.. ఈ పేరు వింటే గతంలో అయితే ఠక్కున పవన్ కల్యాణ్ అని గుర్తుకు వచ్చేది. ఇప్పుడైతే పవన్ కు బదులుగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేరే గుర్తుకు వస్తోంది. అంటే.. రాజకీయాల్లో లేకున్నా.. రాజకీయ పార్టీలకు వ్యూహాలు రచించడంతోనే అటు పొలిటికల్ లీడర్లు, ఇటు సినిమా స్టార్ల కంటే కూడా పీకే తనదైన శైలి గుర్తింపు సంపాదించుకుంటున్నారు. రాజకీయ వ్యూహాల్లో దిట్టగా గుర్తింపు సంపాదించిన పీకే.. ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం ఫెయిల్యూర్ నేతగానే ముద్ర పడిపోయారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే.. రాజకీయ వ్యూహకర్తగానే కాకుండా సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గానూ నిరూపించుకునే దిశగా పీకే సాగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల పలువురు కీలక రాజకీయ నేతలతో భేటీ అవుతున్న పీకే.. మంగళవారం నాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో పాటు ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కూతురు ప్రియాంకా గాంధీ వాద్రాలతో భేటీ అయ్యారు. రాహుల్ ఇంటిలో జరిగిన ఈ భేటీలో తొలుత రాహుల్, ప్రియాంకలు మాత్రమే పాల్గొన్నారని వార్తలు వచ్చినా.. సోనియా కూడా ఈ భేటీలో పాలుపంచుకున్నారని తెలుస్తోంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో కీలకమైన ముగ్గురు నేతలతో పీకే భేటీ అనగానే పీకే ఏదో పెద్ద వ్యూహమే రచిస్తున్నారన్న కోణంలో ఆసక్తికర విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
వ్యూహాల్లో దిట్ట.. పాలిటిక్స్ లో దెబ్బ
2014 ఎన్నికల్లో బీజేపీకి స్ట్రాటజిస్ట్ గా వ్యవహరించిన పీకే.. మోదీ ప్రచారాన్ని ఓ రేంజికి తీసుకెళ్లారు. ఆ ఎన్నికల్లో మోదీ విజయంతో ఒక్కసారిగా పీకే పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత అప్పటికే అధికారం కోసం ఆబగా ఎదురుచూస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు కూడా పీకే వ్యూహాలు రచించారు. ఈ వ్యూహాలతోనే జగన్ ఏపీకి సీఎం అయ్యారన్న వాదనలు లేకపోలేదు. మరిన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ తనదైన శైలిలో సత్తా చాటిన పీకే.. తాను పనిచేసిన పార్టీలకు విజయాలనే అందించారు. తాజాగా పశ్చిమ బెంగాల్ లో మమతకు, తమిళనాడులో స్టాలిన్ కు కూడా అధికారం దక్కేలా పీకే వ్యూహాలు రచించారు. ఈ క్రమంలో తన సొంత రాష్ట్రం బీహార్ లో అధికార పార్టీ జేడీయూలో చేరిన పీకేకు ఆ పార్టీ ఉపాధ్యక్ష పదవి కూడా దక్కింది. అయితే వ్యూహాలు రచించి ఇచ్చినంత ఈజీగా రాజకీయ పార్టీలో మనగలగడం కష్టమని గుర్తించిన పీకే.. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు.
హస్తం పార్టీ వ్యూహమేంటో..?
తాజాగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తో వరుస భేటీలు వేస్తున్న పీకే.. మంగళవారం నాడు ఏకంగా సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతేకాకుండా వీరితో పీకేకు ఇదే తొలి భేటీ కాదని, ఇప్పటికే వారితో ఆయన చాలా సార్లే సమావేశాలు నిర్వహించారని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. మోదీపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకత, అధికారానికి దూరంగా పదేళ్ల ప్రస్థానం తదితర అంశాలను బేరీజు వేసుకుంటున్న హస్తం పార్టీ.. ఈ దపా మోదీని ఎలాగైనా అధికారం నుంచి దించేయాలనే దిశగా పకడ్బందీగానే ప్లాన్ వేస్తోంది. ఈ ప్లానింగ్ లో పీకే కీలక భూమిక పోషించడం ఖాయమనే చెప్పాలి. అయితే ఆ పాత్ర స్ట్రాటజిస్ట్ గానా, లేదంటే నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరి మోదీపైకి దండెత్తడమా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తన వ్యూహాలతో గెలిచిన మోదీ నిర్ణయాలను పీకే పలుమార్లు తీవ్రంగానే వ్యతిరేకించారు. ఈ క్రమంలో ప్రత్యక్షంగానే కాంగ్రెస్ పార్టీలో చేరి మోదీని ఓడించాలన్న పట్లుదలతో పీకే ఉన్నట్లుగా కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. మరి దీనికి సంబంధించి ఫుల్ క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Must Read ;- దీదీ ఫార్ములాతో బీజేపీతో ఢీ.. పీకే కొత్త వ్యూహం