తాంబూలమిచ్చాం తన్నుకు చావండి అంటూ పెద్దలు చెప్పిన మాట గుర్తుంది కదా. అయితే అందుకు విరుద్ధంగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ముందుగా తమతో తాము తన్నుకుని.. తర్వాత రెండూ కలిసి కేంద్ర ప్రభుత్వానికి తమపై పెత్తనాన్ని కట్టబెట్టేసిన తీరు నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు.. ప్రత్యేకించి కృష్ణా జలాల వివాదం.. అందులోనూ మరీ ప్రత్యేకించి జగన్ సర్కారు మొదలుపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వివాదాలు ఓ రేంజిలో సాగుతున్నాయి. ఈ వివాదాలపై ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా కేంద్రానికి ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. కోర్టులనూ ఆశ్రయిస్తున్నాయి. ఇక రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికార పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలాంటి తరుణంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. ఇరు రాష్ట్రాలకు షాకిస్తూ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరు రాష్ట్రాల మధ్య నీటి వాటాలను పర్యవేక్షించడంతో పాటు ఆయా నదులపై ఉన్న ప్రాజెక్టులపై బోర్డులకు సంపూర్ణ అధికారాలను కట్టబెడుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతటితో ఆగని కేంద్రం.. ఆ బోర్డుల ఖర్చులను మాత్రం రెండు రాష్ట్రాలే భరించాలంటూ ఓ సరికొత్త మెలిక పెట్టేసింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేయగా.. ఏపీలోని జగన్ సర్కారు చాలా ఆలస్యంగా స్పందించిన వైనం కలకలం రేపుతోంది.
పర్యవేక్షణ కేంద్రానికి.. ఖర్చు మనదట
కేంద్రం విడుదల చేసిన తాజా గెజిట్ లో కృష్ణా నదీ జలాలకు సంబంధించి అన్ని వ్యవహారాలు ఇకపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఈఆర్ఎంబీ) పరిధిలోకి వస్తాయి. ఆ నదిపై ఉన్న 36 ప్రాజెక్టుల పర్యవేక్షణ కూడా బోర్డు పరిధిలోకి వస్తుంది. అంతేకాకుండా ఆ నదిపై కొత్తగా కట్టాల్సిన ప్రాజెక్టులు ఏమిటి? ఏఏ అవసరాల మేరకు వాటిని నిర్మించాలి? ఎక్కడ నిర్మించాలి? అన్న విషయాలను బోర్డే నిర్ణయిస్తుంది. ఇక రెండు రాష్ట్రాల మధ్య ఉండే ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో బోర్డే పర్యవేక్షణ సాగిస్తుంది. ఇక ఈ నదిపై ప్రస్తుతం కడుతున్న ప్రాజెక్టులకు అనుమతులు ఉంటే ఓకే గానీ.. లేదంటే ఆరు నెలల్లోగా అనుమతులు తీసుకోవాలి. ఇదంతా బాగానే ఉన్నా.. బోర్డు నిర్వహణ, ఆయా ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాలతో రక్షణ తదితర అంశాలకు భారీగా ఖర్చు కానుంది కదా. ఈ ఖర్చును రెండు తెలుగు రాష్ట్రాలే భరించాలి. అంతేకాకుండా ఇదే తరహా నిబంధనలు గోదావరి నదీ జలాల విషయంలోనూ గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు వర్తిస్తాయి.
తెలంగాణ రియాక్షన్.. జగన్ లేటు స్పందన
ఈ లెక్కన మొత్తంగా రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులన్నీ బోర్డుల పరిధిలోకి.. అంతిమంగా కేంద్రం పరిధిలోకి వెళ్లిపోతాయన్న మాట. మన రాష్ట్రాల పరిధిలోని ప్రాజెక్టుల వద్ద కేంద్ర బలగాల పర్యవేక్షణ అంటే.. కేంద్రం చేతిలో బాధ్యతలు పెట్టినట్టే కదా. మన నీటి అవసరాలు మన రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుస్తాయి గానీ.. కేంద్రానికి, అది ఏర్పాటు చేసే బోర్డులకు ఏపాటి అవగాహన ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ రెండు నదుల నీటిపై పెత్తనం చేసే కేంద్రం.. అందుకు అయ్యే ఖర్చును మాత్రం ఇరు రాష్ట్రాలు భరించాలని చెప్పడం మరింత విడ్డూరమనే చెప్పాలి. ఈ తరహా నిబంధనలపై ఇప్పటికే తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. మోదీని కలిసి తన నిరసనను తెలిపేందుకు కేసీఆర్ సమాయత్తమవుతున్నారు. దీనిపై ఎలాంటి వ్యూహంతో ముందకెళ్లాలన్న దానిపై ఆయన శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే ఏపీ నుంచి దీనిపై చాలా ఆలస్యంగా స్పందన వచ్చింది. ఈ స్పందనలోనూ ఎలా వెళ్లాలన్న దానిపై ఏపీకి స్పష్టత ఉన్నట్లు కనిపించలేదు.
Must Read ;- దిమాక్ ఉన్నోడు జగన్ వద్ద ఒక్కడూ లేడు











