నవ్యాంధ్ర నూతన రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన చంద్రబాబు సర్కారు.. అందులో భూముల కొనుగోలుకు సంబంధించి ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడిందన్న జగన్ సర్కారు ఆరోపణలు, అవన్నీ నిరాధారమైనవేనంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులు, హైకోర్టు ఉత్తర్వులు సవరించాలంటూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శుక్రవారం కీలక విచారణ చేపట్టింది. ఈ విచారణ సందర్భంగా ఏపీ ప్రభుత్వ న్యాయవాది దుష్యంత్ దవేకు జస్టిస్ వినీత్ శరణ్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. అసలు అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ ఎక్కడ జరిగింది? అన్నట్లుగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలతో ఒకానొక దశలో దవే ఖంగు తిన్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కేసు దర్యాప్తును నిలుపుదల చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు సవ్యంగానే ఉందంటూ ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. వెరసి హైకోర్టులో మాదిరిగానే.. సుప్రీంకోర్టులోనూ జగన్ సర్కారుకు ఎదరు దెబ్బే తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
దవే నోట మళ్లీ పాత మాటే..
విచారణ ఎలా సాగిందన్న విషయానికి వస్తే.. తొలుత ఏపీ ప్రభుత్వ వాదనలు వినిపించిన దవే పలు కీలక అంశాలను లేవనెత్తారు. రాజధాని ఎక్కడ వస్తుందో ముందే సొంత మనుషులకు చెప్పుకుని ఇన్ సైడర్ ట్రేడింగ్ కు పాల్పడ్డారని నాటి చంద్రబాబు సర్కారుపై దవే ఆరోపణలు చేశారు. ఈ విషయంలో దర్యాప్తు ప్రాథమిక దశలో ఉండగానే హైకోర్టు ఎలా జోక్యం చేసుకుంటుందని కూడా ఆయన ప్రశ్నించారు. ప్రాథమిక దర్యాప్తును నిలిపివేసే అధికారం హైకోర్టుకు లేదని కూడా ఆయన వాదించారు. అమరావతి పరిధిలో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి అధికారులు, నేతలు.. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇలా పలు కీలక అంశాలను ప్రస్తావించిన దవే.. ఈ విషయంలో కేసు దర్యాప్తును హైకోర్టు నిలుపుదల చేయడం సరికాదని, హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
సుప్రీంకోర్టు ఏమన్నదంటే..?
అయితే దుష్యంత్ దవే వాదనలు పూర్తి కాకుండానే సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుంది. దవే వాదనలు వినిపిస్తుండగానే.. మధ్యలోనే జోక్యం చేసుకున్న ధర్మాసనం.. హైకోర్టు తీర్పులో తప్పేముందని సూటిగానే నిలదీసింది. ఇన్ సైడర్ ట్రేడింగ్ వర్తించదని హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ లో తప్పేముందని ప్రశ్నించిన ధర్మాసనం.. హైకోర్టు సరైన దిశలోనే విచారణ జరిపిందని వ్యాఖ్యానించింది. అన్ని కోణాలను పరిశీలించిన మీదటే హైకోర్టు తుది తీర్పు చెప్పిందని చెప్పిన సుప్రీంకోర్టు.. రాజధాని అంశం బహిరంగ రహస్యమని హైకోర్టు చెప్పడంలో తప్పేముందని నిలదీసింది. భూములు అమ్మిన వాళ్లు తాము మోసపోయినట్లు ఎక్కడైనా ఫిర్యాదు చేశారా? అని ప్రశ్నించిన ధర్మాసనం.. నష్టం వచ్చిన వాళ్లే కోర్టును ఆశ్రయించాలి గానీ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటి? కాస్తంత ఘాటు ప్రశ్నలనే సంధించింది.ఈ నేపథ్యంలో మరిన్ని వాదనలు వినిపించేందుకు తనకు సమయం కావాలని దవే కోరగా… అందుకు సమ్మతించిన ధర్మాసనం.. విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. అంతేకాకుండా ఇరువర్గాల వాదనలను ఆ రోజు లోగా లిఖితపూర్వకంగా అందజేయాలని, అదే రోజున తీర్పు వెలువరించనున్నట్లుగా కూడా కోర్టు చెప్పింది. దవే పేలవ వాదనలు, కోర్టు సూటి ప్రశ్నలను చూస్తుంటే.. సుప్రీంకోర్టులోనూ జగన్ సర్కారుకు ఎదురు దెబ్బ తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- విశాఖ నుంచి పాలన అంత వీజీ కాదు