టాలీవుడ్ లో మళ్ళీ మల్టీస్టారర్స్ కు ఊపు తెచ్చిన సినిమా ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’. పెద్దోడు, చిన్నోడుగా వెంకటేశ్, మహేశ్ బాబు నటించిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రూపొందిన ఆ సినిమా .. మరిన్ని మల్టీస్టారర్స్ కు ప్రేరణ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి చిన్నోణ్ణి, పెద్దోణ్ణి తెరమీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిల్మ్ నగర్ టాక్.
అయితే ఇందులో మరో ఆసక్తికరమైన అంశమేంటంటే.. వారిద్దిరినీ ఈసారి తీసుకొచ్చే బాధ్యతను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తీసుకున్నాడట. ఈ ఇద్దరి తోనూ ఓ కామెడీ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించే ఉద్దేశంతో త్రివిక్రమ్ ఉన్నాడట. త్రివిక్రమ్ కి ఇది మొట్టమొదటి మల్టీస్టారర్ కానుంది. వెంకీ, మహేశ్ తో అనుకుంటున్న ప్రాజెక్ట్ కు అప్పుడే త్రివిక్రమ్ స్ర్కిప్ట్ వర్క్ పూర్తి చేశాడట. కామెడీ ప్లస్ ఎమోషన్స్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ప్రస్తుతం త్రివిక్రమ్ యన్టీఆర్ తో సినిమా తెరకెక్కించే పనుల్లో బిజీగా ఉండడం, అలాగే.. వెంకీ నారప్ప సినిమాతో బిజీగా ఉన్నాడు, మహేశ్ బాబు సర్కార్ వారి పాట మూవీ హడావిడిలో ఉన్నాడు. ఈ ముగ్గురి ప్రాజెక్ట్స్ , ఇతర కమిట్ మెంట్స్ పూర్తయ్యాకా వెంకీ, మహేశ్ మల్టీస్టారర్ పనులు ప్రారంభమవుతాయట. అంతవరకూ వెయిట్ చేయక తప్పదు. మరి త్రివిక్రమ్ ఏ స్థాయిలో ఈ మల్టీస్టారర్ ను మలుస్తాడో చూడాలి.