కౌంటింగ్‌కు సమయం దగ్గరపడుతుండటం టీఆర్ఎస్, బీజేపీ నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరు గెలుస్తారు? అనే చర్చ మొదటి నుంచి జరుగుతోంది. ఏకంగా పెన్నులు, పేపర్లు పట్టుకుని ఏ మండలంలో ఎన్ని ఓట్ల మెజారిటీ మనకు వస్తుందోనని లెక్కలు వేసుకుంటూ జుట్టు పీక్కుంటున్నారట. అయితే టీఆర్ఎస్ పార్టీ మాత్రం సెంటిమెంట్‌నే నమ్ముకుందట. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన మూడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలించింది. దుబ్బాక ఎన్నికలో కూడా ఇదే సీన్ రిపీటవుతుందని లెక్కలు వేసుకుంటున్నారట. దానికితోడూ దుబ్బాకలో రామలింగారెడ్డి సతీమణికి సానుభూతి సెంటిమెంట్ తమ గెలుపునకు అదనపు బలంగా కలసివస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అలాగే హరీష్ రావు రంగంలోకి దిగి అమలు చేసిన వ్యూహాలు తమ అభ్యర్థి గెలుపుకు బాగా కలసి వస్తాయని కూడా అనుకుంటున్నారట.
బీజేపీ మాత్రం తమ లెక్కలపైనే ఆశలుపెట్టుకుంది. పోలింగ్ జరిగిన సరళి, 80 శాతం వరకు పోలింగ్ జరగడం, అధికార, బీజేపీ పార్టీ మధ్య జరిగిన సవాళ్ల పర్వం, హైడ్రామా, ప్రభుత్వ వ్యతిరేకత ఓటు లాంటి అంశాలపైనే ఆశలు పెట్టుకుంది. పైగా బూతు కేంద్రాల వారీగా తమకు పడిన ఓట్లను ఏజెంట్ల నుంచి లెక్కలు తెప్పించుకుని ఎంత మెజార్టీ వస్తుంది? ఏ ఏ బూతులో ఎన్ని ఓట్లు పోలయ్యాయనే ఫీడ్ బ్యాక్‌ను తెప్పించుకుని లెక్కలు వేసుకుంటున్నారు. అలాగే ఉప ఎన్నికల సెంటిమెంట్ తమకు కూడా కలిసివస్తుందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గతంలో మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరణించడంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఆ పోరులో టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోరు జరిగి బీజేపీ అభ్యర్థి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి గెలుపొందారు. ఇప్పుడు కూడా దుబ్బాక ఎన్నికల్లో ఇదే సీన్ పునరావృతం అవుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. పోలింగ్ భారీ స్థాయిలో జరగడం తమ గెలుపు అవకాశాలకు మరింత బలం చేకూరుతుందంటున్నారు.
మరోపక్క దుబ్బాక ఎన్నికలపై జోరుగా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏ పార్టీ ఎంత మెజార్టీతో గెలుస్తుంది? టీఆర్ఎస్‌కు లక్ష మెజార్టీ వస్తుందా? లేదా? ఒకేళ రఘునందన్‌రావు గెలిస్తే ఎన్ని ఓట్ల తేడాతో గెలుస్తడు? అనే అంశాల వారీగా బెట్టింగ్‌లు కట్టేస్తున్నారట. తమకున్న పరిచయాలతో పార్టీ నేతలతో సమాచారం తెసుకుని, పోలింగ్ సరళిని దృష్టిలో పెట్టుకుని తమకున్న నాలెడ్జ్ ప్రకారం లక్షల్లో బెట్టింగ్ కాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
దుబ్బాక ఎన్నికల్లో అధికారపార్టీ సెంటిమెంట్ ఫలిస్తుందో.. లేక బీజేపీ ఆశలు చిగురిస్తాయో చూడాలంటే ఫలితాలు వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే.