సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఇండియాకు పనిచేస్తున్న కీలక వ్యక్తి బాధ్యతల నుండి తప్పుకున్నారు. 2015 నుండి పబ్లిక్ పాలసీ డైరెక్టర్ గా ఉన్న మహిమా కౌల్ రాజీనామా చేసినట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ కథనాన్ని ప్రచురించింది. కానీ ఇప్పుడే ఎందుకు రాజీనామా చేసినట్లు అన్న అంశం చర్చకు దారితీసింది.
ట్విట్టర్ పై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులిచ్చింది. ముఖ్యంగా రైతు ఉద్యమం నేపథ్యంలో కొందరు రైతు నాయకుల ట్విట్టర్ ఖాతాలను డౌన్ చేయాల్సిందిగా కేంద్రం ఆదేశించింది. దాదాపు 250 అకౌంట్లను డౌన్ చేయాలని చేసిన సూచనతో ట్విట్టర్ రిపబ్లిక్ డే రోజున డౌన్ చేసింది. కానీ ఆ తర్వాత యధావిధిగా పునరుద్దరించింది. దీనిపై కేంద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులిచ్చింది. తమ ఆదేశాలను ధిక్కరించారని, భారత చట్టాలను ఉల్లంఘించారని నోటీసుల్లో పేర్కొంది.
అయితే, తను కాస్త బ్రేక్ తీసుకునేందుకే ఈ నిర్ణయం తప్పా ఇందులో ఇతర అంశాలేమీ లేవని, 2015 నుండి తను ఎన్నో సేవలందించారని ట్విట్టర్ పబ్లిక్ పాలసీ హెడ్ ప్రకటన విడుదల చేశారు. కానీ, ఇందులో కేంద్ర పెద్దల జోక్యం ఎక్కువైందని, అందుకే తనను రాజీనామా చేయించినట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.