ఛాయ్.. భారతీయ జీవనశైలిలో ఒక భాగంలా కలిసిపోయింది. కొందరికైతే.. టీ తాగకుండా రోజు మొదలవదు. కానీ, నేటి తరం వాళ్లు సరికొత్త టీ రుచులను ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతున్నారు. అందులో ముఖ్యంగా, ఆరోగ్యానందించే టీలు తాగడానికి మహా ఆసక్తి చూపుతున్నారు. అలాంటి ఆరోగ్యకరమైన టీలలో ‘లెమన్ టీ’ ఒకటి. ఈ టీ కేవలం ఆరోగ్యదాయిని మాత్రమే అనుకునేరు.. అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతూ.. మీ అందం కూడా ఇనుమడించేలా చేస్తుంది ఈ పుల్లటి.. కమ్మట.. టీ. మరి ఓ సారి మీరు ట్రై చేసి చూడండి..!
అనారోగ్యాలకు చెక్..

అసలే కరోనా కాలం.. ఇంకా చలి పూర్తిగా తగ్గలేదు కూడానూ.. ఇలాంటి సమయాల్లో జలుబు, దగ్గు, ఊరికే నలతగా అనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి చిన్న చిన్న అనారోగ్యాలకు చెక్ పెట్టాలంటే మీ రోజును లెమన్ టీతో మొదలుపెడితే సరి. ఎండాకాలంలో చాలామంది టీలు తాగడానికి వెనకాడతారు.. వాటి వల్ల అనారోగ్యాలు వస్తాయని. కానీ అలాంటి సీజన్‌లో కూడా లెమన్ టీ ఓ చిన్నపాటి కప్పు తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు.
ఆరోగ్య ప్రదాయిని..

నిమ్మకాయ సహజమైన యాంటిబయాటిక్, యాంటి వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. అందువల్ల ప్రతిరోజూ ఓ కప్పు నిమ్మకాయ టీ తాగడం వల్ల ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు దరిచేరవు. అంతేకాదు లెమన్ టీ శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. దాని వల్ల సీజనల్, అంటువ్యాధులు వంటి వాటి నుంచి రక్షణ లభిస్తుంది.
అందాన్ని ఇనుమడిస్తుంది..

మచ్చలేని ముఖ సౌందర్యం కోరుకోని అమ్మాయి ఉండదు. కానీ, పొల్యూషన్, పని ఒత్తిడిలు కారణంగా ముఖంపై మచ్చలు ఏర్పడడం, ముఖంపై ముడతుల, నిస్సారంగా తయారవడం లాంటివి ఏర్పడుతాయి. వీటికి చెక్ పెట్టాలంటే నిమ్మకాయ టీ మంచి పరిష్కార మార్గమంటున్నారు నిపుణులు. నిమ్మకాయలో పుష్కలంగా దొరికే విటమిన్ సి కారణంగా మీ ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. అంతేకాదు, శరీరానికి తేమను అందించి వయసు ఛాయలను నివారించడంతోపాటూ.. నవయవ్వనంగా మెరుపులీనేలా చేస్తుంది నిమ్మకాయ పానీయం.
బరువు తగ్గుతారు..

బరువు తగ్గాలనుకునే వారు తమ రోజును నిమ్మకాయ టీతో మొదలుపెడితే మంచిది. మీ శరీరంలోని మలినాలను బయటకు తరమేస్తుంది ఈ నిమ్మకాయ టీ.. ఇది బరువు తగ్గే ప్రక్రియలో ముఖ్యమైన భాగమనే చెప్పాలి. నిమ్మకాయ టీ మీ శరీరానికి అందే క్యాలరీలు చాలా తక్కువ. అలా క్రమంగా మీ బరువు తగ్గడం ప్రారంభమవుతుంది. వీటితో పాట్లు వ్యాయామం, సరైన ఆహారం తీసుకోవాలని మరవకండి.
రోగనిరోధక శక్తి పెరగుతుంది..

ఎలాంటి వ్యాధైనా మన శరీరాన్ని కుంగదీయకుండా ఉండాలంటే.. మన వద్ద ఉండే అతిపెద్ద ఆయుధం రోగనిరోధకర శక్తి. ఇది మన శరీరంలో ప్రవేశించే బ్యాక్టీరియా, వైరస్ వంటి వాటిని నశింపజేస్తుంది. అవి మన శరీరంపై ప్రభావం చూపకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తి పెరగడంలో విటమిన్ సి పాత్ర ముఖ్యమైనది. అందుకే రోజుకో కప్పు నిమ్మకాయ టీతో ఎన్నో రోగాలను మన దరిచేరకుండా నివారించవచ్చు.










