సుప్రీం కోర్టు సీజేకు రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాశారు. ‘ఏపీలో ప్రజా ప్రతినిధులకు సంబంధమున్న కేసులను వర్చువల్ కోర్టుల్లో విచారణ జరపడం వలన ప్రజలకు కూడా అసలు ఏమి జరుగుతుంది అనే దాని మీద స్పష్టత వస్తుంద’ని ఆయన పేర్కొన్నారు. అలాగే రాజకీయ నాయకులపై, ప్రముఖులపై కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు లైవ్ ఇవ్వాలన్నారు.
ఇదేమీ కొత్త కాదు కదా…
కోర్టులపై ముఖ్యమంత్రి లేఖ రాయడం ఇదేమీ కొత్త కాదు. గతంలో ముఖ్యమంత్రి సంజీవయ్య కూడా కోర్టులపై లేఖ రాశారని గుర్తు చేశారు. జగన్ అన్ని విషయాలలో మొండిగా వెళ్తారన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ విషయంలో ఆరోపణలు వ్యక్తిగతంగా తాను నమ్మను అన్నారు. భూములు కొనుగోలు చేయకూడదా అదేమన్న తప్పా అంటూ ఆయన ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థలో లోపాలను రాజకీయ వ్యవస్థలు సరిదిద్దాలని చట్టం ముందు జడ్జీలు అతీతులు కాదన్నారు. న్యాయ వ్యవస్థలపై ఆరోపణలు విషయంలో చర్చ గౌరవంగా జరగాలి.. న్యాయ వ్యవస్థకు ప్రభుత్వానికి మద్య విభేదాలు వస్తే ప్రజలకు నష్టం. ప్రభుత్వం ఏ పని అయినా చట్టబద్దంగా చేయాలి అన్నారు.
జగన్ రాసిన లేఖ ప్రజల్లోకి వెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రచారం చేశారన్నారు మాజీ ఎంపీ. కేంద్రం ఈ అంశాన్ని కట్టడి చేయాలనుకుంటే చేయొచ్చన్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా ప్రజాసేవకు కోర్టులు అడ్డుపడుతున్నాయని భావించారని.. ఆ తర్వాత కోర్టుల తీర్పుకు లోబడి ఎన్టీఆర్ ప్రజాసేవ చేశారన్నారు. సుప్రీంకోర్టు సీజేకు ఏపీ ప్రజా ప్రతినిధుల కేసుల విచారణపై ఉండవల్లి అరుణ్ కుమార్ లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది.











