సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎన్.వి.రమణ మీద ఫిర్యాదు చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖ ఎంత వివాదాస్పదం అవుతోందో అందరికీ తెలిసిందే. చాలామంది న్యాయవాదులు, న్యాయమూర్తులు, న్యాయకోవిదులు ఈ లేఖను ఖండిస్తున్నారు. అదే తరహాలో ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ వారు కూడా ఈ లేఖను ఖండించారు. అయితే ఈ బార్ అసోసియేషన్ కార్యదర్శికి ఇప్పుడు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.
తనను తూలనాడుతూ, తీవ్రమైన పదజాలంతో తిడుతూ ఫోన్ కాల్స్ వస్తున్నట్టు బార్ కార్యదర్శి అభిజత్ స్వయంగా ప్రకటించారు. బార్ ప్రెసిడెంట్ మోహిత్ మాథుర్ కు కూడా ఇలాంటి కాల్స్ వస్తున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.
ఈ బెదిరింపు కాల్స్ అన్నీ జగన్ లేఖను ఖండిస్తూ బార్ తీర్మానం చేసిన తర్వాతనే వస్తున్నాయని వెల్లడించారు. ఆ తీర్మానంలో.. జగన్ లేఖ అనేది న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసేలా ఉందని, ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని తీర్మానించారు.
ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ది యునైటెడ్ కింగ్‌డమ్ సభ్యుడిగా చెప్పుకున్న ఒక వ్యక్తి అసభ్య పదజాలం వాడుతూ హిందీలో తనను దూషించి, బెదిరించినట్లు అభిజత్ ప్రకటించారు. ఒకే మొబైల్ నెంబరు నుంచి అనేక కాల్స్ వచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. తనను, తన కుటుంబాన్ని అంతం చేస్తామనే బెదిరింపులు వచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు. ఈ కాల్స్.. తన వ్యక్తిగత స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు కూడా విఘాతం అని ఆయన పేర్కొన్నారు.
ఇలా జగన్ లేఖను ఖండించిన వారికి బెదిరింపు కాల్స్ రావడం అనేది.. జగన్మోహన్ రెడ్డి లేఖ వివాదాన్ని మరింత ముదిరిపోయేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన లేఖ పూర్తిపాఠం.. (ఇక్కడ చూడండి)