ఆంధ్రప్రదేశ్ కు ఏమైంది అనేది రాష్ట్రంలోనే కాదు, దేశవిదేశాల్లో ప్రతిఒక్కరి ఆవేదన. ప్రజల ధనమాన ప్రాణాలకే కాదు, ప్రతిపక్ష నాయకులకే భద్రత లేకుండా పోయింది, పార్టీల కార్యాలయాలకు రక్షణ లేకుండా పోయింది. మొన్న గన్నవరంలో ఏం జరిగిందో చూశాం, రౌడీలు, గుండాలు ఎలా చెలరేగి హింసా విధ్వంసాలు సృష్టించారో..? అడ్డుకోవాల్సిన పోలీసులే ఈ మాఫియా గ్యాంగ్ లను అలా వదిలేస్తే.. పోలీసుల్ని వెంటేసుకుని అరాచకశక్తులిలా హింసా విధ్వంసాలకు పాల్పడితే.. ఇక చట్టానికి దిక్కెవరు..? న్యాయాన్ని కాపాడేదెవరు, రాజ్యాంగాన్ని రక్షించేదెవరు..?
పట్టపగలు హైవే పై తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తుంటే, టీడీపీ నేతల ఇళ్లపై రాళ్ల దాడులు జరుగుతుంటే, వాహనాలకు నిప్పు పెడుతుంటే, రక్తమోడేట్లు కొడుతుంటే, బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులు, రౌడీలకు రక్షణ కవచంగా ఉంటారా..? ఇదేమని ప్రశ్నించిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సహా 30 మంది బాధితులపైనే తప్పుడు కేసులు బనాయిస్తారా..? దీనికి ముందు అనపర్తిలో ఏం జరిగిందో చూశాం..మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో ఏం చేశారో ప్రపంచం మొత్తం చూసింది. మొదటి 2 రోజులు ప్రశాంతంగా జరిగిన పర్యటనలో 3వరోజు ఉద్రిక్తత తలెత్తుతుందా..? అక్కడో చట్టం, ఇక్కడో చట్టమా..? ప్రజాస్వామ్యాన్ని పోలీసులే చెరబట్టడమా..? మాజీ సీఎం పర్యటనకు పర్మిషన్ ఇచ్చి, క్యాన్సిల్ ఎలా చేస్తారు..? శాంతిభద్రతలను కాపాడాల్సిన వాళ్లే దానిని భగ్నం చేయడం ఏమిటి..?
రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్చను కాలరాస్తారా..? సభ జరుపుకునే హక్కును అడ్డుకుంటారా..? ప్రాధమిక హక్కులకే గండికొడ్తారా..? శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడటం ఏమిటి..? ఉల్లంఘనలన్నీ పోలీసులే చేస్తూ విపక్షాలపై కేసులేంటి..? దురాగతాలన్నీ ప్రభుత్వమే చేస్తూ ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమేంటి..? పోలీసులేంటి, రోడ్డుకు అడ్డంగా కూర్చోడమేంటి..? రోడ్డుకు అడ్డంగా పోలీసులే బైఠాయించడం ఎక్కడైనా ఉందా, చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా..? మాజీ సీఎం పర్యటనకు అడ్డంగా బస్సులు పెడతారా..? రోడ్డుకు అడ్డంగా పోలీసులే కూర్చుంటారా..? ఇదేమి పోలీసింగ్..? ఇలాంటి పోలీసింగ్ ఏ రాష్ట్రంలోనైనా ఉందా..? దేశంలోనే కాదు, ప్రపంచంలో ఇలాంటి పోలీసింగ్ ఎవరైనా కన్నారా, విన్నారా..?
ఇలాంటి చర్యలను ఏమనాలి?
ఒక జడ్ ప్లస్ భద్రతలో ఉన్న, 14ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన నాయకుడి పట్ల ఇలాంటి దుష్ప్రవర్తనకు పోలీసులే పాల్పడితే ఏమనాలో, ఎవరిని అనాలో అర్ధం కావడంలేదు.. అంటే కేంద్ర పోలీసు భద్రతను, రాష్ట్ర పోలీసు భగ్నం చేస్తుందా..? కేంద్రపోలీసుకు అడ్డంగా రాష్ట్ర పోలీసు బస్సులడ్డం పెడుతుందా..? ఒక మాజీ సీఎం 7కిమీ కాలినడకన వెళ్లే దుస్థితి కల్పిస్తారా..? ఆ చీకట్లో, ఆ గుంతల్లో ఆయనకేమైనా జరిగితే ఎవరిది బాధ్యత..? అతను 14ఏళ్లు ముఖ్యమంత్రిగా సేవలందించిన నాయకుడు, 14ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వ్యక్తి.. వేరే రాష్ట్రానికెళ్లినా ఆయననెంతో గౌరవ మర్యాదలతో చూస్తారు, అలాంటి వ్యక్తికి సొంత రాష్ట్ర పోలీసుల ప్రవర్తన ఇది.. ఇక నారా లోకేశ్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులే..అనేక ఆంక్షలు, ఎన్నో షరతులు, ఏదోలా పాదయాత్ర భగ్నం చేయాలన్నదే టార్గెట్ గా పెట్టుకున్నారు..అతనొక మాజీమంత్రి.. ఏపీలో ఒక ప్రధాన పార్టీ తెలుగుదేశంకు జాతీయ ప్రధాన కార్యదర్శి.. శాసనసభకు పోటీచేశాడు. 6ఏళ్లు శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. రెండేళ్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశాడు.
సమాజం పట్ల బాధ్యతతో ‘‘యువగళం’’ పేరుతో పాదయాత్ర చేస్తుంటే అడుగడుగునా ఆటంకాలా..? పేపర్ పై 14 రకాల షరతులా..? ఫీల్డ్ లో 140 ఆంక్షలా..? పోలీసులతో అడ్డగింతలా..? రాజ్యాంగం చేతిలో పెట్టుకుని నడవాల్సి రావడమా..? అడ్డుకున్న వాళ్లకల్లా ఆర్టికల్స్ చదివి చెప్పాల్నా..? అంబేద్కర్ తనకిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అడ్డుకోవడమా..? మీటింగ్ పెట్టుకోనీయరా..? మైకులో మాట్లాడనీయరా..? డయాస్ ఎక్కనీయరా..? చివరికేదో బిల్డింగ్ బాల్కనీలో నుంచి ప్రసంగించేలా చేస్తారా..? మరుసటి రోజు ఆ బిల్డింగులనూ పోలీసుల అధీనం చేసుకుంటారా..? మైకు పెట్టేవాడిపై కూడా దౌర్జన్యమా..? స్టూల్ పైకెక్కి కూడా మాట్లాడనీయరా..? ఇదెక్కడి రాజ్యం..? ఇదెక్కడి పాలన..? ఇలాంటి పోలీసింగ్ ఎక్కడైనా ఉందా..? పోలీసులనూ మీ ఫాక్షన్ పాలనకు పావులు చేస్తారా..? పోలీసులను ముందుపెట్టి మీ పైశాచికత్వం చాటుకుంటారా..?
సామాన్యుడి పరిస్థితి ఏంటి?
ఒక మాజీ ముఖ్యమంత్రికి, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి, ఒక మాజీ మంత్రికి, ఒక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శినే ఇలా చేస్తే.. ఇక సామాన్యుల పరిస్థితేంటి..? ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం ఉన్నట్లా…? రాజ్యాంగబద్ద పాలన జరుగుతున్నట్లా..? జగన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపి ఇంత అధ్వానంగా మారుతుందని, అశాంతి-అభద్రత నెలకొంటుందని, జన జీవనమే దుర్భరంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు, భావించలేదు. గత 4ఏళ్లలో పౌరుల ప్రాధమిక హక్కులనే కాలరాశారు, స్వేచ్చా స్వాతంత్ర్యాలను తొక్కేశారు. ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. ప్రశ్నించే హక్కే కాదు, చివరికి పోస్టు పెట్టే హక్కును మింగేశారు.
మన ఇంట్లో మనం ఉండాలంటే కప్పం కట్టాల్సిందే. మన భూమి మనం దున్నుకోవాలంటే మామూళ్లు ఇవ్వాల్సిందే.. నా ఉద్యోగం నేను చేసుకోవాలంటే కమిషన్లు ఇవ్వాల్సిందే.. జీవించే హక్కునే కబళించే దుర్మార్గ పరిస్థితులున్న రాష్ట్రంగా ఏపి ని చేశారు.. బీసి, ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనార్టీల ధన, మాన, ప్రాణాలు గాలిలో దీపాలుగా మారాయి.
ఈ రోజున్న ఇల్లు రేపు ఉంటుందా, కూలగొడతారా..? నా పొలానికి ఇవాళెల్లినట్లే రేపెళ్లగలనా..? మరెవరైనా కబ్జా చేస్తారా..? అనే భయాందోళనల్లో బతుకీడ్చాల్సి వచ్చింది. ఏమంటే, ఎటునుండెవడొచ్చి దాడిచేస్తాడో..? హతమారుస్తారో, ఆగం చేస్తారో, కబ్జాచేస్తారో, దోచుకుంటారో అనే భీతావహంలో దినం గడవడం కాదు, పూట గడవడమే ప్రశ్నార్ధకమైంది.. ఇది ప్రజల దుస్థితే కాదు ప్రతిపక్షాల పరిస్థితీ అంతే..14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, 14ఏళ్లు ప్రధాన ప్రతిపక్ష నేత భద్రతే ప్రశ్నార్ధకమైంది.. జడ్ ప్లస్ భద్రతలో ఉన్న వ్యక్తిని రాత్రివేళ చీకట్లో, గుంతల్లో 7కిమీ కాలినడకన వెళ్లే అగత్యం కల్పించారంటే ఆంధ్రప్రదేశ్ లో ఎంతటి అశాంతి-అభద్రత రాజ్యమేలుతున్నాయో అద్దం పడుతోంది. గుంటూరులో వైసీపీ బాధితుల పునరావాస శిబిరానికి వెళ్లకుండా చంద్రబాబు ఇంటి గేటుకు తాళ్లు కట్టినప్పుడే ఏపీ పోలీసింగ్ వ్యవస్థ భ్రష్టు పట్టింది. అమరావతిలో బిల్డింగులను చూసేందుకెళ్లిన చంద్రబాబుపై రాళ్లు వేస్తే అదో నిరసన మాత్రమేనని డిజిపి అన్నప్పుడే పోలీసింగ్ గాడి తప్పింది.
అమరావతిలో చంద్రబాబు ఇంటిపైకి దాడికెళ్లిన వైసిపి రౌడీగ్యాంగ్ లపై ఏం చర్యలు తీసుకున్నారు..? టిడిపి ప్రధాన కార్యాలయంలో విధ్వంసకాండ సృష్టించి, అక్కడి సిబ్బంది తలలు పగులగొట్టిన గుండాలపై ఏం చర్యలు చేపట్టారు..? అనేక గ్రామాల్లో టిడిపి సానుభూతిపరులను వెంటబడి తరిమి, గ్రామాలనుంచి బహిష్కరించిన వైసిపి ఫాక్షనిస్టులపై ఏం చర్యలు తీసుకున్నారు..? గత 46నెలల్లో 30మందిపైగా టిడిపి కార్యకర్తలను హత్యచేసిన వారిపై చర్యలేవి, కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ధ్వంసం చేసినవారిపై,భూములు కబ్జాచేసిన వారిపై, అసైన్డ్ భూములు లాక్కున్నవారిపై ఏం చర్యలు తీసుకున్నారు..? అదేమని ప్రశ్నించినవారిపై, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినవారిపై, వేలాదిమందిపై తప్పుడు కేసులు బనాయించి, అక్రమంగా జైళ్లకు పంపడమేనా ఏపి పోలీసింగ్..?
బాధితులపైనే ఎదురు తప్పుడు కేసులు బనాయించే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉందంటే అదే ఆంధ్రప్రదేశ్..ఎస్సీలపైనే, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టే రాష్ట్రం ఏదైనా ఉందంటే అదే ఆంధ్రప్రదేశ్.. మొక్కులు చెల్లించేందుకు వెళ్లే మహిళాభక్తులపై లాఠీ ఛార్జి చేయడమా పోలీసింగ్, అమ్మవారి ప్రసాదాలను, పొంగళ్లను నేలపాల్జేయడమా పోలీసింగ్ అంటే..బాలింత మహిళ కడుపులో బూటుకాలితో తొక్కడమా పోలీసింగ్ అంటే..
ఒకప్పుడు ఏపి పోలీసింగ్ అంటే దేశంలోనే ప్రతిష్టాకమైనది. అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకమైనది. అందరికీ ఆదర్శప్రాయమైనది.. వరద బీభత్సంతో చెల్లాచెదురైన ఒడిశాలో బాధిత ప్రజానీకానికి ఇదే ఏపి పోలీసింగ్, ఇదే నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అందించిన సేవలు చిరస్మరణీయం..ఆడబిడ్డకు రక్షగా కదిలినప్పుడు ఇదే ఏపీ పోలీసింగ్ కు బ్రహ్మరథం పట్టారు..జాతీయస్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందిన రాష్ట్ర పోలీసువ్యవస్థ ఇప్పుడిలా చెడ్డపేరు మూట కట్టుకోవడం బాధాకరం.. ‘‘రాజ్యాంగం మంచిదైనా దానిని అమలు చేసేవాడు చెడ్డవాడైతే చెడ్డ ఫలితాలే వస్తాయి. రాజ్యాంగం చెడ్డదైనా దానిని అమలుచేసేవాడు మంచివాడైతే సత్ఫలితాలే వస్తాయన్న’’ డా బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యాఖ్యలు అక్షర సత్యాలు. ఆంధ్రప్రదేశ్ లో ఈ అణిచివేతకు భారీమూల్యాన్ని పాలకపక్షం చెల్లించక తప్పదు.. ప్రజల గొంతు ప్రతిపక్షం అంటే..తమ కోసం గొంతెత్తే ప్రతిపక్షమంటే ప్రజలకెప్పుడూ సానుభూతే.. విపక్షం బంతిలాంటిది, ఎంత అణిచేయాలంటే అంతగా పైకి లేస్తుంది..మీరెంత అణిచేయాలని చూస్తే జనం అంతగా అక్కన చేర్చుకుంటారు ప్రతిపక్షాన్ని.. ఇది చరిత్ర చెప్పిన సత్యం.