కాప్ స్టోరీలకు టాలీవుడ్ లో మంచి వెయిట్ ఉంది. కొన్ని సినిమాలు పరాజయం పాలైనప్పటికీ.. ఆ పాత్రలోని పవర్ .. మాస్ అప్పీలింగ్ .. ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడు మెప్పిస్తూనే ఉంటాయి. స్టార్ హీరోలు సైతం పోలీస్ యూనిఫామ్ తొడగడానికి ఏమాత్రం సందేహించరు. మిగతా హీరోల సంగతి ఎలా ఉన్నా.. మెగా ఫ్యామిలీ హీరోలు మాత్రం దాదాపు అందరూ ఆ ముచ్చట తీర్చేసుకున్నారు.
మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో .. ‘యమకింకరుడు’మూవీతో మొట్టమొదటిసారిగా పోలీస్ యూనిఫామ్ తొడిగారు.. చిరు ఖాకీ యూనిఫామ్ తొడిగిన మొదటి సినిమాగా అది విశేషాన్ని సంతరించుకుంది. ఆ తర్వాత ఆయన కాప్ గా నటించిన పలు సినిమాలు మంచి విజయం సాధించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్‘ ఏ రేంజ్ లో హిట్టయిందో తెలిసిందే. ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్’లోనూ కాప్ గా మెరిశారు. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘జంజీర్’హిందీ మూవీలో కాప్ గా నటించాడు. అదే సినిమా ‘తుఫాన్’ గా తెలుగులోనూ విడుదలైంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం ‘రేసు గుర్రం’లో.. మేకే విష్ లో భాగంగా ఒకరోజు పోలీస్ గా రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ సైతం కృష్ణవంశీ ‘నక్షత్రం’లో పోలీస్ గా అలరించాడు.
ఇక ఈ లిస్ట్ లో పోలీస్ గా నటించనిది ఒక్క వరుణ్ తేజనే. ఇప్పుడు అతడు కూడా పోలీస్ డ్రెస్ తొడుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇటీవలే 14 రీల్స్ బ్యానర్ లో సాగర్ చంద్ర దర్శకత్వంలో వరుణ్ ఒక సినిమాను చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన మరో లీక్ ఇప్పుడు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
‘ఎఫ్ 3’ చిత్రం తర్వాత వరుణ్ చేయబోతున్న సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడని టాక్. ‘అయ్యారే, అప్పట్లో ఒక్కడుండేవాడు’ అనే విభిన్నమైన సినిమాలు తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న దర్శకుడు సాగర్ చంద్ర ఈసారి వరుణ్ కోసం మంచి కమర్షియల్ ఎంటర్ టైన్ మెంట్ కమ్ పోలీస్ యాక్షన్ డ్రామా స్ర్కిప్ట్ ను రెడీ చేశాడట. వచ్చే ఏడాది ఈ సినిమాను పట్టాలెక్కిస్తారని తెలుస్తోంది. మరి వరుణ్ తేజ పోలీస్ గా ఎలా మెప్పిస్తాడో చూడాలి.











