నటసింహం నందమూరి బాలకృష్ణ తన బావ, వియ్యంకుడు చంద్రబాబు నాయుడినే ఆటపట్టించారు. దీని ప్రోమోను నిన్న విడుదల చేశారు. గతంలో చంద్రబాబు నాయుడుపై వచ్చిన విమర్శలే అస్త్రాలుగా బాలయ్య సంధించారు. మరి చంద్రబాబు ఏం సమాధానం చెప్పారన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. పైగా తన మామ హోస్ట్ స్థానాన్ని అల్లుడు లోకేష్ ఆక్రమించారు. తన తండ్రి, మామలపై ప్రశ్నల వర్షం కురిపించారు. సరదా సరదాగా అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ నెల 14 నుంచి ఆహా ఓటీటీలో ఇది ప్రసారమవుతుంది. తనదైన మాటలతో పంచ్ లతో వచ్చిన గెస్ట్ లను ఆటాడుకునే బాలయ్య ఈసారి తన ఇంటి మనుషులనే గెస్ట్ లుగా ఆహ్వానించడంలో ఆంతర్యం ఏమిటో. సీజన్ 1లో మొదటి గెస్ట్ మోహన్ బాబు అయితే ఈసారి అందుకు భిన్నంగా రాజకీయ నాయకులతో ఈ ఎపిసోడ్ జరిగింది. బహుశా చంద్రబాబుకు ఉన్న సినిమా నేపథ్యం వల్లనే ఆయనను గెస్ట్ గా ఆహ్వానించి ఉండొచ్చు. ఈ సీజన్ లో వీరు కాకుండా ఇంకెవరెవరు గెస్ట్ లుగా రాబోతున్నారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. రెండో ఎపిసోడ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి రావచ్చన్న ఊహాగానాలు ఉన్నాయిగానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. బాబి దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వీరయ్య చిత్రం షూటింగులో చిరంజీవి బిజీగా ఉన్నారు.
గాడ్ ఫాదర్ చిత్రం విడుదలైన వెంటనే వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ పై చిరంజీవి దృష్టి పెట్టారు. బాలయ్య తన బావను ఆహ్వానించినట్టుగానే అల్లు అరవింద్ తన బావను ఈ వేదికపైకి ఆహ్వానిస్తారా లేదా అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. బావ బామ్మర్దుల సందడిగా ఈసారి టాక్ షో ప్రారంభమైంది. బాలయ్య మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి చెప్పండి అని చంద్రబాబు ను అడిగితే ఎవరూ ఊహించని విధంగా తను రాజశేఖర్ రెడ్డి కలిసి బాగా తిరిగామని మాత్రం సమాధానం ఇచ్చారు చంద్రబాబు. మోటార్ సైకిల్ సైలెన్సర్ లు పీకి ఎలాంటి సందడి చేశారో పూర్తి ఎపిసోడ్ చూస్తేనేగాని అర్థం కాదు. బాలయ్య తన బావను ఆటపట్టిస్తే అల్లుడు లోకేష్ తన మామను ఆటపట్టించడం కూడా బాగుంది. ఆహాలో ఈ నెల 14వ తేదీ వీరి సందడి చూసి తీరాల్సిందే.