రాబోయే సంక్రాంతికి సినిమా బరిలోకి దిగే పుంజులేవి అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది. ఇప్పటిదాకా అధికారికంగా రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమా ప్రభాస్ హీరోగా రూపొందిన ఆదిపురుష్ మాత్రమే. అది జనవరి 12న విడుదలవుతుంది. ఈ సినిమా మోషన్ క్యాప్చర్ కాబట్టి అది వేరే కేటగిరీకి చెందుతుందని అనుకోవచ్చు. ఇక డైరెక్ట్ పోటీ మెగాస్టార్ చిరంజీవి, నట సింహం నందమూరి బాలకృష్ణ మధ్య ఉంటుందన్న చర్చ నడుస్తోంది. గాడ్ ఫాదర్ తర్వాత చిరు కూడా వేగం పెంచారు. బాబి దర్శకత్వంలో రూపొందే వాల్తేరు వీరయ్య చిత్రాన్ని సంక్రాంతి బరిలోకి దించేందుకు ఆయన సిద్ధపడినట్టు సమాచారం.
దసరా, సంక్రాంతి టార్గెట్ గానే చిరు అడుగులు వేస్తున్నారు. దసరాకి గాడ్ ఫాదర్ తో హిట్ కొట్టారు. కానీ కలెక్షన్ల పరంగా రికార్డు వచ్చే అవకాశం కనిపించడం లేదు. అది కొట్టాలంటే సంక్రాంతి సీజనే. బాలయ్య హీరోగా మలినేని గోపీచంద్ షూటింగ్ విషయంలో కొంత ఆలస్యం కావడంతో డిసెంబరులో విడుదలవుతుందనుకున్న ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దాంతో చిరు, బాలయ్యల మధ్య పోటీ తప్పేలా లేదు. గతంలో వీరిద్దరి సినిమాలు పోటీ పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
ఈసారి అదే జరిగితే సంక్రాంతి పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఈ సినిమా పేర్లు ఇంకా ఖరారు కాలేదు. చిరంజీవి సినిమాకి వాల్తేరు వీరయ్య అనే పేరు పెట్ట బోతున్నట్టు ప్రచారంలో ఉంది. బాలయ్య సినిమాకి ఇంతకుముందు అన్నగారు, జైబాలయ్య అనే పేర్లు పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో కొత్త పేర్లు వచ్చి చేరాయి. రెడ్డి గారు, వీరసింహారెడ్డి అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. వీటిలో ఒకదాన్ని ఈ వారంలోనే ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. బాలయ్య సినిమా సంక్రాంతికి రావాలని ఆయన అభిమానలు కోరుకుంటున్నారు. కాకపోతే ఈ రెండు సినిమాలనూ మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది కాబట్టి ఏదో ఒకదాన్ని వెనక్కి జరిపే అవకాశం ఉంది.
వీరయ్యను పక్కకు జరిపి బాలయ్యను బరిలోకి దించే అవకాశం లేకపోలేదు. ఇవి కాక విజయ్ వారసుడు కూడా బరిలోకి దిగుతోంది. దీన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. బాలయ్య సినిమాకు ఇంకా 26 రోజుల వర్క్ ఉన్నట్టు సమాచారం. పైగా రెండు సినిమాల్లోనూ శ్రుతిహాసన్ నటిస్తోంది. ఆమె వాల్తేరు వీరయ్యను పక్కనబెట్టి బాలయ్య సినిమాకు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం చిరంజీవి మాత్రం వాల్తేరు వీరయ్య షూటింగులో బిజీగా ఉన్నారు. బాలయ్య ఓ పక్క అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎపిసోడ్స్ చేస్తూనే గోపీచంద్ సినిమాకు కూడా టైమ్ కేటాయించారు. ఈ ఇద్దరు మెగా హీరోలూ తమ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి సంక్రాంతి విజేతగా నిలిచేది ఎవరో చూడాలి.











