అమెరికా అధ్యక్ష ఎన్నికలను రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థుల మధ్య పోరు.. కౌంటింగ్ మొదటి నుంచి హోరాహోరిగా సాగుతోంది. మొదటి నుంచి ఎలక్టరోల్ ఓట్ల లెక్కింపులోడెమోక్రటిక్ అభ్యర్థి జోబైడెన్ దూసుకుపోతున్నారు. రాష్ట్రాల్లో పోలైన ఓట్లల్లో ట్రంప్ ముందంజలో ఉంటూ వచ్చారు. కానీ 11 గంటల వరకు అందుబాటులో ఉన్న ఫలితాల ప్రకారం డెమోక్రటిక్ అభ్యర్థి అయిన బైడెన్‌కు మొత్తం 223 ఎలక్టోరల్ ఓట్లు పోలవగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్‌కు 174 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
అధ్యక్షుని పీఠం ఎవరనేది దాంట్లో ఈ ఫలితాలు కీలకం కానున్నాయి. 2016లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఈ ఎలక్టోరల్ ఓట్లల్లో ఆధిక్యత సాధించే అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. బైడెన్‌కు ఇప్పటి వరకు పోలైన ఓట్లు పరిశీలిస్తే 6,18,95,095 (49.8శాతం), ట్రంప్‌కు పోలైనవి 6,04,30,868(48.6శాతం) పోలయ్యాయి. ఇంకా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతునే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్ ముందంజలో ఉంటే మరికొన్ని చోట్లల్లో బైడెన్ గట్టి పోటీ ఇస్తున్నారు.
అత్యధికంగా ఎలక్టోరల్ ఓట్లు ఉన్న టెక్సాన్, ఫ్లోరిడా, కాలిఫోర్నియా, న్యూయార్క్ రాష్ట్రాలు కీలకంగా మారనున్నాయి. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ ఓట్లు ఉంటే అందులో 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించుకున్న వారే అధ్యక్ష పీఠం దక్కించుకోనున్నారు. అధ్యక్ష ఎంపికలో ఈ ఓట్లు కీలక పాత్రపోషించనున్నాయి.
ఫలితాలపై ట్రంప్ వ్యాఖ్యలు..
అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై ట్రంప్ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో గెలుస్తామన్న విశ్వాసం తనకుందని వ్యాఖ్యానిస్తూ ఓ ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ తమ పార్టే ముందుందని, అందరికీ కృతజ్ఞతలు అని ట్వీట్‌లో తెలిపారు. అంతకుముందు చేసిన మరో ట్వీట్‌లో అమెరికాను గొప్పగా మార్చే ట్రంప్‌కు ఓటేయండని తెలిపారు. అలాగే ఫలితాలపై బైడెన్ కూడా తనకే అనుకూలంగా ఫలితాలు రానున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నువ్వానేనా అన్నట్లుగా బైడెన్, ట్రంప్ ఎన్నికల ఫలితాలలో పోటీ పడుతున్నారు. ఇంకా కొంత సమయం గడిస్తేగానీ ఫలితాలపై పూర్తి స్పష్టత రాదు.











