టీడీపీ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించిన ‘యువగళం నవశకం’ భారీ బహిరంగ సభ సాక్షిగా ఉత్తరాంధ్ర ప్రజలు తాము ఏం కోరుకుంటున్నారో తేల్చి చెప్పేశారు. ఈ సందేశంతో వైఎస్ఆర్ సీపీ వ్యూహం పూర్తిగా తలకిందులు అవడంతో జగన్ అవాక్కవుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల్ని ఆకట్టుకోవడానికి అనేక రకాల తాయిలాలు చూపుతున్నారు. విశాఖపట్నంలో రాజధాని పెడతానని ఎప్పటి నుంచో అంటున్నారు. ఇటీవలే ఉద్దానంలో కిడ్నీ సెంటర్ ను ప్రారంభించారు. గత ఏప్రిల్ లో శ్రీకాకుళం జిల్లాలో భావనపాడు పోర్టుకు శంకుస్థాపన చేశారు. భోగాపురంలో ఎయిర పోర్టు నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. మరోవైపు, విజయనగరంలో మెడికల్ కాలేజీ, గిరిజన యూనివర్సిటీ రాబోతున్నాయని జగన్ ప్రకటించారు. అవన్నీ కాక, తాను కూడా కాపురాన్ని ఉత్తరాంధ్రకు మార్చుతున్నానంటూ పలు వేదికలపై నొక్కి చెప్పారు. అందుకు అనుగుణంగా రుషికొండకు బోడిగుండు కొట్టి పెద్ద ప్యాలెస్ కూడా కట్టుకున్నారు.
ఇలా ఉత్తరాంధ్రను తాము డెవలప్ చేస్తామంటూ జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు చెప్పారు. అయితే, వీటిలో ఇప్పటిదాకా ఒక్క ఉద్దానం కిడ్నీ సెంటర్ తప్ప.. మిగతావన్నీ అందనంత దూరంలోనే ఉన్నాయి. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ తీరును అంచనా వేసేసిన ఉత్తరాంధ్ర ప్రజలు.. జగన్ ను నమ్మడం ఎప్పుడో మానేశారు. ఎందుకంటే నాలుగున్నేళ్ల నాడు అసెంబ్లీలో ప్రకటించిన రాజధానినే ఇప్పటిదాకా తరలించలేదు. అయితే, అది తుగ్లక్ నిర్ణయమే కావచ్చు. కానీ, వీలు కాని అంశాన్ని లేవనెత్తి తొలుత అక్కడి ప్రజల్లో ఆశలు రేకెత్తించి.. చివరికి చేతగానివాడిలా మిగిలిపోయాడు. ఇలా మిగతా విషయాల్లో కూడా జగన్ హామీలు ఏ మేరకు నెరవేరతాయనే సందేహం ప్రజల్లో ఎక్కువగా ఉంది.
మొత్తానికి ప్రస్తుత రాజకీయ వాతావరణం ప్రకారం.. విశాఖ వాసులు తమకు రాజధాని అక్కడ పెట్టాలని కోరుకోవడం లేదనే స్పష్టంగా అర్థం అవుతోంది. కేవలం విశాఖ వాసులే కాక, ఉత్తరాంధ్ర వాసులు కూడా అదే భావిస్తున్నారు. ఎందుకంటే.. ఒకవేళ ఆ రాజధాని సెంటిమెంట్ ఉంటే.. ఆ సున్నితమైన విషయాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తవు. కానీ, స్థానిక టీడీపీ నేతలు అమరావతే రాజధాని అంటూ అక్కడ పదేపదే చెబుతూ వస్తున్నారు. అసలు విశాఖలో 90 శాతం ప్రజలు రాజధానిని కోరుకోవడం లేదని ఇటీవల గంటా శ్రీనివాసరావు అన్నారు. ఒకవేళ ప్రజల్లో రాజధాని సెంటిమెంట్ ఉంటే.. ఇలా బహిరంగంగా అనే సాహసం ఏ పార్టీ చేయదు.
దీంతో జగన్ వైఖరి ఏంటో స్పష్టంగా అర్థమైపోయిన ఉత్తరాంధ్ర ప్రజలు తమకు.. తాయిలాలతో ఆశచూపడం కంటే.. డెవలప్ మెంట్ ముఖ్యమని భావిస్తున్నారు. అందుకే ఉత్తరాంధ్ర వేదికగా జరిగిన టీడీపీ యువగళం – నవశకం సభకు ఏనాడూ లేనంత జనవాహిని తరలివచ్చింది. వైసీపీ తరహాలో బీర్లు, బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి బలవంతంగా తీసుకురాకుండా.. స్వచ్ఛంగా వచ్చిన జనం వారంతా. ఈ విషయం తెలిసి ఉత్తరాంధ్ర వాసులు తమకు రాజధాని కంటే కూడా.. అన్ని సౌలభ్యాలు, మౌలిక సదుపాయాలు ఉండే అభివృద్ధే ముఖ్యమనే అభిప్రాయానికి వచ్చేశారు.