విజయవాడ రాజకీయాల్లో వంగవీటి రంగా చెరగని ముద్ర వేశారు. ఆయన తనయుడు రాధా మాత్రం రాజకీయాల్లో ఇంకా నిలదొక్కుకోలేదనే చెప్పాలి. మొదటి నుంచీ కాంగ్రెస్ లో కొనసాగిన వీరి కుటుంబం విజయవాడలోనే కాదు కాపు వర్గాల్లో మంచి పట్టు సాధించింది. ఆ క్రమంలో వంగవీటి రాధా కాంగ్రెస్ నుంచి మొదటి సారి ఎమ్మెల్యే అయ్యారు. ఇక అదే చివరి సారిగా మిగులుతుందని అనుకోలేదు.
ఆ తరవాత 2009లో ప్రజారాజ్యంలో చేరిన రాధా, విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరవాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో రాధా వైసీపీలో చేరిపోయారు. కానీ ఆ పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం, విజయవాడ సెంట్రల్ సీటు కూడా దక్కకపోవడంతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొదటి నుంచీ వారి కుటుంబం ఏ పార్టీపై పోరాడుతుందో చివరకు ఆ పార్టీలోనే రాధా చేరాల్సి వచ్చింది.
గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనలోనే రాధా తండ్రి రంగా హత్యకు గురయ్యారు. ఇవన్నీ పక్కన బెట్టి టీడీపీలో చేరినా ఆయనకు గత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎక్కడా సీటు దక్కలేదు. టీడీపీకి స్టార్ క్యాంపెయినర్ గా పనిచేశారు. నేడు ఆయనకు చంద్రబాబు మంచి అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది.
అవనిగడ్డ టీడీపీ ఇంఛార్జిగా వంగవీటి రాధా పేరు….
అవనిగడ్డలో మండలి బుద్ద ప్రసాద్ చురుగ్గా ఉండటం లేదని టీడీపీ అధిష్ఠానం భావిస్తోంది. దీంతో అవనిగడ్డ బాధ్యతలు యువనేత వంగవీటి రాధాకు అప్పగించాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబునాయుడు నిర్ణయించినట్టు తెలుస్తోంది. అవనిగడ్డ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గం కూడా ఎక్కువే. దీంతో కాపు యువనేత వంగవీటి రాధాకు అవనిగడ్డ టీడీపీ బాధ్యలు అప్పగించడంతోపాటు, వచ్చే ఎన్నికల్లో ఆ సీటు ఆయనకు ఖరారు చేస్తారని తెలుస్తోంది.
వంగవీటి రాధా సుముఖమేనా?
వంగవీటి కుటుంబానికి మొదటి నుంచీ విజయవాడ సెంట్రల్ లో మంచి పట్టుంది. అయితే ఏపీలో కాపులు అధికంగా వంగవీటి రాధా కుటుంబాన్ని ఆరాధిస్తారు. దీంతో కాపులు అధికంగా ఉండే నియోజకవర్గాలను వడబోసి చివరకు వంగవీటి రాధాకు అవనిగడ్డ అప్పగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు గుంటూరు జిల్లా సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జిగా వంగవీటి రాధాకు బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుంది అనే దానిపై టీడీపీ ఓ సర్వే కూడా నిర్వహించిందట.
సత్తెనపల్లిలో రెండు మండలాల్లో కాపులు అధికంగా ఉన్నారు. ఆయా ప్రాంతాల్లో వంగవీటి రాధాకు అనుకూలంగా సర్వే ఫలితాలు వచ్చాయని తెలిసింది. అయితే సత్తెనపల్లికి రాధా నాన్ లోకల్ కావడం పార్టీకి మైనస్ అవుతుందని భావించారు. అందుకే సత్తెనపల్లి కన్నా కృష్ణా జిల్లా అవనిగడ్డ అయితే మంచి ఫలితాలు సాధించవచ్చని టీడీపీ అధినేత నిర్ణయించారని తెలుస్తోంది.
వంగవీటి రాధా జనసేనతో టచ్ లో ఉన్నారా…
వంగవీటి రాధా ఇటీవల అమరావతి రాజధాని ఉద్యమంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. రాజధాని రైతులకు అండగా నిలుస్తున్నారు. అవకాశం దొరకినప్పుడల్లా రాజధాని రైతుల వద్దకు వెళ్లి వారి పోరాటాలకు మద్దతు పలుకుతున్నారు. అయితే ఎక్కడా టీడీపీ ప్రస్తావన తీసుకురావడం లేదు. దీంతో వంగవీటి రాధా జనసేనతో టచ్ లో ఉన్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఇటీవల జనసేన అగ్రనేతలతో రాధా కలసినట్టు వార్తలు వచ్చాయి. దీంతో రాధా మరోసారి పార్టీ మారే అవకాశం ఉందంటూ ప్రచారం జోరందుకుంది. అయితే ప్రజారాజ్యం అనుభవాలు, రాధాను జనసేనలోకి వెళ్లకుండా ఆపుతున్నాయని తెలుస్తోంది. ఏది ఏమైనా టీడీపీలో రాధాకు కూడా ఒక నియోజకవర్గం దొరికినట్టేనని భావించవచ్చు.