సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు సంబంధించిన కాంబినేషన్ల విషయంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక కాంబినేషన్‌లో సినిమా అనుకుంటే అది అనుకోకుండా ఆగిపోవడం, మరో కాంబినేషన్‌లో సినిమా స్టార్ట్ అవడం వంటివి సినిమా పుట్టిన దగ్గర నుంచీ జరుగుతూనే ఉన్నాయి. ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో వేరే హీరో సినిమా చేస్తే అది సూపర్‌హిట్ అయి ఆ హీరో రేంజ్‌ని మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒక డైరెక్టర్‌తో సినిమా కమిట్ అయి, ఆ తర్వాత ఆ డైరెక్టర్‌ని పక్కన పెట్టి మరో డైరెక్టర్‌తో సినిమా ఎనౌన్స్ చేసిన దాఖలాలు కూడా చాలా ఉన్నాయి.
ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయంలో అదే జరుగుతోందని అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఓ ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి ఫైటర్ అనీ, లైగర్ అని రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే.. నిన్నుకోరి, మజిలీ వంటి సూపర్‌హిట్ సినిమాలను రూపొందించిన శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తాడని, ఆ సినిమాను దిల్‌రాజు నిర్మిస్తాడని ప్రకటించారు. పూరి జగన్నాథ్ సినిమా తర్వాత శివ నిర్వాణ సినిమా సెట్సపైకి వెళ్తుందని అంతా అనుకున్నారు. కానీ, ఇప్పుడు సీన్ మారింది. సడన్‌గా విజయ్ బాలీవుడ్‌లో ఓ స్ట్రయిట్ సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.
దేశభక్తుడు అభినవ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందే సినిమాలో విజయ్ దేవరకొండ నటించబోతున్నాడని తెలిసింది. పూరి జగన్నాథ్‌తో చేస్తున్న సినిమా తర్వాత విజయ్ ఈ బయోపిక్ షూటింగ్ పాల్గొంటాడని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న శివ నిర్వాణ టీమ్.. ఆ బయోపిక్ తర్వాత తమ సినిమా చేస్తాడని భావించారు. కానీ, దిల్‌రాజుకు, శివ నిర్వాణకు మరో షాక్ ఇచ్చాడు విజయ్. సుకుమార్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇది సినీవర్గాలు కూడా ఊహించని వార్త. ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ ఇది.
ఒక్కసారిగా ఈ సినిమా తెరపైకి రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇప్పడు శివ నిర్వాణ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. అతనితో సినిమా అనుకున్న తర్వాత రెండు సినిమాలను లైన్‌లోకి తెచ్చాడు విజయ్. దీన్నిబట్టి చూస్తే శివ నిర్వాణతో అనుకున్న సినిమాను విజయ్ పక్కన పెట్టేసాడని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్తలపై శివ నిర్వాణ, దిల్‌రాజు, విజయ్ దేవరకొండ ఎలా స్పందిస్తారో చూడాలి.











