(విజయనగరం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం కొండపై గల కోదండరామ స్వామి దేవాలయంను ఎస్పీ రాజకుమారి శుక్రవారం మరోమారు సందర్శించారు. కొండపై గల నేర స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రామతీర్థంలో జరిగిన సంఘటనపై పలువురు రాజకీయ పార్టీలు లబ్ది పొందేందుకు ధర్నాలు చేస్తుండడం వలన ఈ కేసులో పోలీసుల దర్యాప్తునకు విఘాతం ఏర్పడుతుందన్నారు. ఇటువంటి సెన్సిటివ్ విషయాలతో ప్రజలను రెచ్చగొట్టే చర్యలు వలన పోలీసు విధులకు, కేసు దర్యాప్తునకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ఎవరో ఉద్దేశ్య పూర్వకంగా చేసిన ఈ చర్యను పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించిందని, ఈ సంఘటనపై సమగ్రమైన దర్యాప్తు ఇప్పటికే చేపట్టామన్నారు.
ఐదు ప్రత్యేక బృందాలు
ఈ కేసును ఛేదించేందుకు ఐదు ప్రత్యేక బృందాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిరంతరం పని చేస్తున్నాయని అన్నారు. ఈ కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. వివిధ పార్టీలు చేస్తున్న ధర్నాలు, నిరసనల కారణంగా పోలీసులు బందోబస్తుల నిర్వహణలో విలువైన సమయాన్ని వెచ్చించాల్సి వస్తోందన్నారు. అలా కాకుండా దర్యాప్తు చేసేందుకు కొంత సమయాన్ని పోలీసులకు కల్పించినట్లయితే కేసును త్వరితగతిన ఛేదించే అవకాశం ఉంటుందన్నారు. కావున, అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, ప్రజాసంఘాలు సంయమనం పాటించాలని, పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు