ప్రేమ ఓ మైకం. ప్రేమ ఎన్నో భావోద్వేగాల కలయిక. హృదయాల వేదికగా సాగే జ్ఞాపకాల మజిలీ. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఓ సందర్భంలో ప్రేమ సాగరంలో విహరించని వారుండరేమో! ఏదో ఓ సమయంలో ప్రేమ మైకం పొందని వారుండరేమో!! ఆ ప్రేమ సాగరంలో మన రహానె విహారం ఎలా సాగిందో మీకు తెలుసా? రహానె జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా?
ఇండియన్ క్రికెట్‌లోనే కాదు.. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు అజింక్య రహానె. భారత టెస్టు క్రికెట్ చరిత్రలోనే మరో ఘోర పరాజయం పాలైన.. కష్టకాలంలో ఉన్న జట్టుకు ప్రాణం పోశాడీ కెప్టెన్. టీమిండియాను భారత్ ఏ స్థాయిలో దెబ్బతీసిందో.. అందుకు ప్రతీకారం తీర్చుకున్నాడు. స్టేడియంలో కూల్.. అండ్ కామ్‌గా ఉంటూనే… జట్టును విజయ తీరాలకు చేర్చాడు. అయితే.. పర్సనల్ లైఫ్ లో మాత్రం రహానె అంత కూల్ కాదట! అతని ప్రేమ కథ తెలిసిన వారెవ్వరైనా.. అమ్మో.. మనోడు ఇంత కథ నడిపించాడా..? అనాల్సిందే..
తూనీగ.. తూనీగ…
‘మనసంతా నువ్వే’ సినిమా కథను తలపించేలా ఉంటుంది రహానె ప్రేక కథ. మనోడే తూనీగ.. తూనీగ.. స్టేజీలోనే ప్రేమలో పడిపోయాడట. ఇంటిపక్కనే ఉండే రాధికా అనే అమ్మాయితో స్నేహం కుదిరింది. చిన్నతనంలోనే ఒకరిపై ఒకరికి అభిమానం ఏర్పడింది. ఇంట్లో వాళ్లు సైతం వీరి ఆప్యాయతకు అడ్డు చెప్పలేదట! అయితే.. రహానె, రాధికలతోపాటు వాళ్ల బంధం కూడా బలపడింది. అది కాస్తా ప్రేమగా చిగురించింది.
కలిసే కాలేజీకి…
రహానె, రాధికల జీవితంలో గుర్తుండిపోయే మధుర జ్ఞాపకాలెన్నో ఉన్నాయట! చిన్నతనం నుంచే ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో.. ఇళ్లు కూడా పక్క పక్కనే ఉడడంతో.. ఒకే కాలేజీలో చేర్పించారు తల్లిదండ్రులు. రోజూ కాలేజీకి కలిసి వెళ్లి వస్తుండేవాళ్లు… వీరి స్నేహం గురించి పెద్దలకు తెలుసు కానీ అది ప్రేమగా మారిన సంగతి మాత్రం వారికి తెలీదు. దీనితో వాళ్లను పెద్దగా పట్టించుకునే వారు కాదట!
ఆ భయంతో ఆటోను ఢీకొట్టేశాడట!
అందరి ప్రేమ కథల్లో లాగానే వీరి కథలోనే ఎన్నో ఆసక్తికర సంఘటనలు ఉన్నాయట! అందులో ఓ సరదా విషయాన్ని రహానె ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. కాలేజీకని చెప్పి ఇంట్లో నుంచి బయలుదేరి, బయట ఎంచక్కా సినిమాలు, పార్కులు అంటూ తిరుగుతూ ఎంజాయ్ చేసేవాళ్లు రాధికా, రహానే. ఓ రోజు ఈ ప్రేమ పక్షులు కాలేజీ డుమ్మా కొట్టి… సినిమాకి వెళ్లారు. తిరిగి వస్తుండగా ఇద్దరినీ రోడ్డు మీదే చూసింది రాధికా తల్లి. అమె నుంచి తప్పించుకునే ప్రయత్నంలో రహానే ఓ ఆటోను కూడా ఢీకొట్టాడు. అది గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుందంటాడు రహానె.
ప్రేమించి.. పెద్దలను ఒప్పించి…
ఏ విషయమైనా ఎంతకాలం దాగుతుంది! రహానె, రాధికాల ప్రేమి విషయం కూడా అంతే. ఆ నోట ఈనోట… చివరికి పెద్దలకు తెలిసిపోయింది. ఆవేశంతో అందరిలా ఆలోచించలేదు ఇద్దరూ. ఓపిగ్గా ఉన్నారు. పెద్దలను ఒప్పించారు. ప్రేమకు పెద్దలు పచ్చజండా ఊపేశారు. సెప్టెంబర్ 26, 2014న అజింక్యా రహానే.. రాధికా దొపావ్కర్ దంపతులయ్యారు.
పెళ్లి తర్వాత తన జీవితంలో బెస్ట్ ఫ్రెండ్ అంటూ రాధికా గురించి చెప్పుకొచ్చాడు అజింకా రహానే. తన ఫస్ట్ లవ్ కూడా ఆమే అంటూ రాసుకొచ్చాడు. కూల్ అండ్ కామ్ యాటిట్యూడ్‌తో అందర్నీ ఆకట్టుకునే రహానే, భార్య రాధికాలకు పాప ఉంది. ఆమెకు ఆర్య అని పేరు పెట్టారు రహానే అండ్ ఫ్యామిలీ. ప్రేమించిన వారినే.. జీవితభాగస్వామిగా పొందే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి.. అందుకే రహానె ఆల్వేస్ లక్కీయెస్ట్ పర్సన్!