తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుందా… బీజేపీ రూపంలో ఆ పార్టీలో భారీ కుదుపు రాబోతోందా. అంటే అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అస్తవ్యస్తం చేయాలని బీజేపీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ పార్టీలో చాలా మంది నేతలు ఇతర పార్టీల నుండి వచ్చిన వారే . వచ్చిన వారికి వచ్చినట్టు ఏదో ఓ పదవితో కేసీఆర్ సర్దుబాటు చేశారు. అయితే వీరంతా శాశ్వతంగా పార్టీని పట్టుకుని ఉంటారా అన్నదానిపై ఆ పార్టీ నేతలే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో మొదటి నుండి ఉండి.. ఉద్యమంలో కేసీఆర్ ఆడుగులో అడుగు వేసిన వారిని పక్కన పెట్టి.. ఉద్యమకారులపై దాడులు చేసిన వారిని… ఉద్యమాన్ని వీక్ చేయాలని చూసిన వారిని అందలం ఎక్కించ్చి తమ ప్రాధాన్యం పూర్తిగా తగ్గించి వేశారని టీఆర్ఎస్‌లోని ఉద్యమ తెలంగాణ బ్యాచ్ ఆవేదన వ్యక్తం చేస్తోంది . ఇప్పుడు వారే బీజేపీ టార్గెట్‌గా తెలుస్తోంది. ఇప్పటికే ఆ నేతలను కలిసి మంతనాలు సాగించినట్టు తెలుస్తోంది.
బలపడుతోన్న బీజేపీ..
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎన్నికల్లో వరుస ఓటములు ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెడుతున్నాయని చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటోంది. దీంతో కొందరు రాజకీయ నేతలు టీఆర్ఎస్ పార్టీ కంటే బీజేపీనే బెటర్ అన్న ఆలోచన చేస్తున్నారు. చాలా నియోజక వర్గాల్లో అన్ని పార్టీల నుండి బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు జరుపుతుండటంతో … గ్రామీణ స్థాయిలో బీజేపీ వేగంగా బలపడుతున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఉద్యమంలో కీలకంగా పని చేసి కేసీఆర్‌కు సన్నిహితంగా ఉండి సైలెంట్ అయిపోయన వారిని చేరదీసే పనిలో పడింది బీజేపీ. స్వామీగౌడ్, విజయ శాంతి, మాజీ మంత్రి చంద్రశేఖర్ , సోమారపు సత్యనారాయణ ఇలా అనేక మంది నేతలను ఇప్పటికే తమ పార్టీలో చేర్చుకుంది బీజేపీ అధిష్టానం. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.
ఆ 30 మంది ఎవరు…
టీఆర్ఎస్ పార్టీపై సర్జికల్ స్ట్రైక్స్ చేసేందుకు బీజేపీ అస్త్రాలను సిద్ధం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున తమ టచ్‌లోకి వచ్చారని బీజేపీ వారు చెబుతున్నారు. దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను చావుదెబ్బ తీసామని భావిస్తున్న ఆ పార్టీ నేతలు ఇక పై నేరుగా టీఆర్ఎస్ పార్టీపైనే ఫోకస్ చేశారు. ఆ పార్టీలో అసంతృప్తిగా ఉన్న వారితో బీజేపీ నాయకులు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వారంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం 30 మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీ నుండి పోటీ చేయబోతున్నట్టు ఓ బీజేపీ నేత బాంబు పేల్చారు . అయితే ఆ 30 మంది ఎవరు.. వారు బీజేపీ టచ్‌లోకి ఎలా వెళ్ళారు.. నిజంగానే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపారా.. మైండ్ గేమ్‌లో భాగంగా బీజేపీ ఇలా లీకులు చేస్తోందా అన్నది తేలాంలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.