(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
ఒకనాడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిచిన విజయనగరం జిల్లాలో ప్రస్తుతం ఆ పార్టీలో నిస్తేజం నెలకొంది. ఆ పార్టీ జిల్లా పెద్దదిక్కు పూసపాటి ఆశోక్ గజపతిరాజు కరోనా పేరుతో తన బంగ్లా గేటుకు తాళం వేసుకోగా, ఫోర్టీ ఇయర్సు ఇండస్ట్రీగా చెప్పొకుంటున్న టీడీపీ జిల్లా రథసారథి మహంతి చిన్నంనాయుడు ఇల్లు దాటి బయటకు రావడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అమాత్యులుగా ‘రాజ’వైభవాలు అనుభవించిన నాయకుల ఆచూకి కానరావడం లేదు.
టీడీపీ హయాంలో ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా చలామణి అయిన నాయకులు పార్టీని పూర్తిగా విస్మరించారు. ఒకరిద్దరు పక్క పార్టీల వైపు తొంగిచూస్తున్నారు. ఆయా పార్టీల నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే గోడ దూకేందుకు సిద్దంగా ఉన్నారు. దీంతో ఆ పార్టీని దశాబ్దాలుగా అంటిపెట్టుకున్న ద్వితీయ శ్రేణి వర్గం , ఆ పార్టీ జెండాయే తమ అజెండాగా భావించి , ఏళ్లతరబడి ఆ కండువాను తమ మెడల్లో దరించిన కార్యకర్తలు దిక్కుతోచక భిక్కటిల్లుతున్నారు.
తమకు ఏ కష్టం వచ్చినా, నష్టం వాటిల్లినా ఎవరితో చెప్పుకోవాలో అర్ధంకాని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ పార్టీ అధినేత జూమ్ యాప్తో సమావేశాలు నిర్వహిస్తూ మార్గదర్శనం చేస్తుంటే , స్థానిక నాయకులు పత్రికా ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నారు.
2014 సాధారణ ఎన్నికల్లో విజయనగరం జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ స్థానాల్లో ఆరింట విజయనగరం, చీపురుపల్లి, శృంగవరపుకోట, గజపతినగరం, నెల్లిమర్ల, బొబ్బిలిలో తెలుగుదేశం విజయకేతనం ఎగురవేసింది. విజయనగరం పార్లమెంట్ స్థానం కూడా సొంతం చేసుకుంది. కేంద్రంలోను , రాష్ట్రంలోను అమాత్య పదవులను కైవసం చేసుకుంది. కాలక్రమంలో బొబ్బిలి నుండి వైసీపీ తరపున ఎమ్మల్యేగా గెలుపొందిన సుజయకృష్ణ టీడీపీలో కలవడంతో రెండు రిజర్వుడు నియోజకవర్గాలు సాలూరు, కురుపాం తప్ప జిల్లా అంతటా తన హవా కొనసాగించింది.
పార్వతీపురం నుండి ద్వారపురెడ్డి జగదీష్, సాలూరు నుండి సంధ్యారాణి ఎమ్మెల్సీలుగా ఎంపికయ్యారు. జిల్లాలో తిరుగులేని ప్రాబల్యంతో, పటిష్టమైన కేడర్‌తో, తమ సర్వస్వం పార్టీకి అర్పించే కార్యకర్తలతో పచ్చగా కళకళలాడుతున్న పార్టీ- అధినాయకుల నిర్లక్ష్యం, అమాత్యుల స్వార్థం, ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీల స్వార్థ ప్రయోజనాల మూలంగా కునారిల్లింది. 2019 సాధారణ ఎన్నికల్లో తీవ్ర భంగపాటుకు గురైంది.
ప్రత్యర్థిగా బరిలోకి దిగిన వైసీపీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు , ఎంపీ స్థానం కూడా సొంతం చేసుకుని తన జెండా ఎగురవేసింది. ఈ పరిస్థితుల్లో తమ పొరపాట్లుపై సమీక్షించుకొని , తప్పులను సవరించుకుని , తమ కేడర్కు అండగా , ప్రజలకు బాసటగా నిలవాల్సిన నాయకులు గేట్లకు తాళాలు , కాళ్లకు బంధనాలు వేసుకోవడం పట్ల సొంత కేడర్ లోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్న సంఘటనలు అందుకు ఊతమిస్తున్నాయి.
జిల్లాలో కొద్దిరోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు స్వర్గస్తులయ్యారు. కరోనా కాబట్టి అంతిమ సంస్కారాలకు ఎవరూ ఎవర్నీ పిలవరు, ఎవరూ వెళ్ళరు కూడా. రాలేదని కూడా ఎవరూ అనుకోరు. కానీ సరైన సమయంలో మాట వరసకి ఓ ముక్క అంటే బావుండేదని అనుకుంటారు . ఇది సహజం కూడా . అంతా అయిపోయాక , ఎవరెన్ని చెప్పినా చెప్పిన వాళ్ళకి బావుంటుందేమో గానీ వినే వాళ్ళకి, చూసే వాళ్ళకి మాత్రం చిర్రెత్తుకొస్తుంది . ఇప్పుడు కూడా అదే జరిగింది . జిల్లా కేంద్రంలో పసగాడ రామకృష్ణ , నెల్లిమర్ల మండలంలో ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు నాయుడు మృతి చెందితే జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మహంతికి నోట మాట రాలేదు. ఓ ప్రెస్ నోట్ విడుదల కూడా విడుదల చేయలేదు.
మూడు రాజధానుల విషయమై గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మాత్రం వెంటనే ఓ ప్రెస్ నోట్ వదిలి చేతులు దులిపేసుకున్నారు. జిల్లా పార్టీ పెద్దగా ఇలా చేస్తారా? చెయ్యొచ్చా? జిల్లా పార్టీ పెద్దగా క్యాడర్ కి దన్నుగా ఉంటూ వాళ్ళకి ధైర్యం చెప్పాల్సింది పోయి, రాజకీయంగా బిక్క చచ్చిపోయినా భౌతికంగా చచ్చిపోతున్నా ఉలక్కుండా పలక్కుండా రాష్ట్ర స్థాయిలో జరిగే పరిణామాలకు స్పందించడమేంటి? ఇలాంటి చర్యలు దేనికి సంకేతం? ఈయనే ఇలా ఉన్నాడనుకుంటే విజయనగరం నియోజకవర్గం ఇంచార్జ్ అదితి గజపతి స్టయిల్ మరీ విడ్డూరం . ఎక్కడో ఉన్న లోకేష్ ట్విట్టర్లో సంతాపం చెప్పగలిగాడు గానీ లోకల్ గా ఉన్న ఆవిడకి మాత్రం తీరిక చిక్కలేదు.
మనిషి చచ్చిపోయిన తర్వాత, 24 గంటలు గడిచిపోయాక తాపీగా ఓ ప్రెస్ నోట్ సంతాపంతో చేతులు కడిగేసుకున్నారు. అలానే టీడీపీలో కీలకభూమిక పోషిస్తున్న మాజీమంత్రి, శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టుపై పక్క జిల్లా అయిన విజయనగరం నుండి సరైన తీరులో స్పందించకపోవడం జిల్లా ప్రజలను ఆశ్చారినికి గురిచేసింది. అదేసమయంలో మీడియా సమావేశం నిర్వహించిన అశోకగజపతి రాజు భోగాపురం విమానాశ్రయంపై మాటాడారు తప్ప అచ్చెన్నాయుడు విషయంపై మాటవరుసకైనా స్పందించలేదు.
ఈ విషయంపై మీడియా ప్రశ్నించినప్పటికీ అది అప్రస్తుతం అనడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటనలు నిశితంగా పరిశీలిస్తున్న రాజకీయ పరిశీలకులు విజయనగరం జిల్లాలో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందనే వ్యాఖ్యానిస్తున్నారు. పూర్వవైభవం సాధించడంపై నాయకులకు శ్రద్ధ ఉన్నదో లేదో కూడా కనిపించడం లేదు.