శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ కోలీవుడ్ లో సినిమాగా రానున్న సంగతి తెలిసిందే. మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ‘800’ టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమాను శ్రీపతి డైరెక్ట్ చేయబోతున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసి రికార్డు సృష్టించిన స్పిన్ బౌలర్ గా ముత్తయ్య మురళీ ధరన్ ప్రసిద్ధి. అందుకే సినిమాకి ఈ టైటిల్ నిర్ణయించారు.
తన క్రికెట్ జీవితంలో మురళీధరన్ బౌలింగ్ పై ఆరోపణలు వచ్చాయి. అతడు చెకింగ్ చేస్తున్నాడనే సందేహాలు తలెత్తాయి. దాంతో అతడి బౌలింగ్ పై క్లీన్ చిట్ వచ్చేవరకూ అతడ్ని ఆడించకూడదని ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత క్లీన్ చిట్ వచ్చాకా మురళీధరన్ విజృంభించాడనుకోండి. ఎన్నో సార్లు తన వైవిధ్యమైన బౌలింగ్ తో మ్యాచ్ ను గెలిపించిన సందర్భాలున్నాయి.
అందుకే ఆ లెజెండరీ బౌలర్ పై సినిమా తీయడానికి తమిళ మేకర్స్ ముందుకొచ్చారు. అతడి పాత్రను విజయ్ సేతుపతి చేయనుండడంతో సినిమా మీద అంచనాలు పీక్స్ కు చేరాయి. ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి .. మురళీ ధరన్ బౌలింగ్ స్టైల్ ను అబ్జర్వ్ చేయడంతో పాటు.. అతడి బాడీ లాంగ్వేజ్ ను కూడా ఫాలో అవుతున్నాడట. ఇక ఇందులో హీరోయిన్ గా మలయాళ బ్యూటీ రజిషా విజయన్ ను ఎంపికచేశారట. ఈ నెల 13న 800 టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు.. సినిమాను కూడా లాంచ్ చేయబోతుండడం విశేషంగా మారింది. మరి విజయ్ సేతుపతి .. ముత్తయ్య మురళీధరన్ ను ఏ మేరకు మ్యాచ్ చేస్తాడో చూడాలి.











