తమిళంలో విడుదలై అనేక అవార్డులు, రివార్డులు పొందిన విక్రమ్ వేద చిత్రాన్ని హిందీలో హృతిక్ రోషన్, సయీఫ్ అలీఖాన్ హీరోలుగా పునర్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే పాత్రల్ని తమిళంలో మాధవన్, విజయ్ సేతుపతి పోషించారు. భార్యా భర్తలైన పుష్కర్ – గాయత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 2017లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఇప్పుడీ చిత్రం హిందీలో షూటింగ్ పూర్తిచేసుకుని సెప్టెంబరు 30న విడుదలకు సిద్ధంగా ఉంది. హిందీ వెర్షన్ కు కూడా పుష్కర్, గాయత్రి దర్శకత్వం వహించారు. ఈ హిందీ చిత్రం ప్రచార కార్యక్రమానికి హీరోలు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా టీజర్ కూడా విడుదలైంది. ‘మీకో కథ చెప్పమంటారా సార్’ అంటూ హృతిక్ పలికి డైలాగ్ తో ఈ టీజర్ ఉంది. టీజర్ కు మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాకి హృతిక్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తాడట.
సెప్టెంబరు 9న భారీ అంచనాలతో బ్రహ్మస్త్ర విడుదల కాబోతోంది. సెప్టెంబరు 30న విక్రమ్ వేద విడుదలవుతుంది. ఈ రెండు సినిమాల మీద బాలీవుడ్ ఎంతో ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తాపడ్డాయి. ఒకప్పుడు ఎంతో జనాదరణ పొందిన విక్రమార్కుడి భేతాళ కథల ప్రేరణతో రూపొందిన చిత్రం ఇది. తమిళ సినిమాలో మాధవన్ పోలీస్ అధికారిగా నటించారు. గ్యాంగ్ స్టర్ గా విజయ్ సేతుపతి నటించారు. మంచి చెడుల మధ్య పోరాటంగా సినిమా తెరకెక్కింది. మూడు విభిన్నమైన కథలతో మైండ్ గేమ్ గా ఇది రూపొందింది.
హిందీ వెర్షన్ లో గ్యాంగ్ స్టర్ గా హృతిక్ నటిస్తున్నారు. సయీఫ్ నిజాయితీ గల పోలీస్ అధికారి విక్రమ్ పాత్రను పోషించారు. వీరిద్దరూ కలిసి గతంలో కూడా కలిసి నటించారు. 2002లో రొమాంటిక్ డ్రామా ‘న తుమ్ జానో న హమ్’లో కలిసి నటించారు. అసలు ఈ సినిమాలో వేద పాత్ర కోసం మొదట ఆమిర్ ఖాను సంప్రదించారు. కానీ మధ్యలోనే అమీర్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత షారుఖ్ పేరు తెరపైకి వచ్చింది. చివరికి హృతిక్ ఈ పాత్రను చేయాల్సి వచ్చింది. మరి సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్ హిందీలో ఎలా ఉంటుందో చూడాలి.