మా ఎన్నికల ఫలితాలు ఊహించిన విధంగానే వస్తున్నాయి. అధ్యక్ష పదవికి పోటీ చేసిన మంచు విష్ణు పోస్టల్ బ్యాలెట్ల విషయంలో ముందంజలో ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ జరిగింది. ఎన్నికల లెక్కింపు ప్రక్రియ ఉదయం 5 గంటలకు ప్రారంభమైంది. ముందుగా బ్యాలెట్ పత్రాలను కట్టలు కట్టి లెక్కింపు చేపట్టారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 905 ఓట్లు ఉండగా అర్హత ఉన్న ఓటర్లు 883 మంది ఉన్నారు. బూత్ లలో 605 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లు 60 ఉన్నాయి. ఆ ప్రకారం చూస్తే మొత్తం 665 ఓట్లను లెక్కించాల్సి ఉంది. ప్రస్తుతం ఈసీ మెంబర్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. పోస్టల్ బ్యాలెట్లలో 50 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. నరాలు తెగే ఉత్కంఠ కౌంటింగ్ కేంద్రాల్లో ఉంది. సభ్యుల మొహాల్లో ఉత్కంఠ నెలకొంది. పూర్తి ఫలితాలు వెలువడటానికి మూడు గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది.
క్రాస్ ఓటింగ్ జరిగిందా?
మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగింది. ఒక్క అధ్యక్ష పదవికి మాత్రం మంచు విష్ణు గెలుపు దిశగా ఉండగా, మిగిలిన ప్యానల్ లో మాత్రం ప్రకాష్ రాజ్ ప్యానల్ లీడింగ్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ ఓడిపోతే మాత్రం లోకల్, నాన్ లోకల్ అంశం పనిచేసినట్టుగానే భావించాలి. దీంతో పాటు మంచు విష్ణు పోల్ మేనేజ్ మెంట్ ను కూడా మెచ్చుకోవాలి. ఓటు వేయడానికి ఆసక్తి చూపనివారిని సైతం బూత్ కు రప్పించి ఓటు వేయించినట్టు స్పష్టమవుతోంది. పూర్తి ఫలితాలు వస్తేగానీ ఏ విషయం చెప్పలేం.











