మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పాలకవర్గంలోని వైసీపీ బలహీనం అయిపోయింది. ఒకేసారి పలువురు కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి వైసీపీ హైకమాండ్ వారందరినీ సస్పెండ్ చేసింది. వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు ఒకరి తర్వాత ఒకరు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని ఇద్దరు కార్పొరేటర్లు ఇప్పటికే వైసీపీని వీడి జనసేనలో చేరిపోయారు. తాజాగా అదే నియోజకవర్గానికి చెందిన మరో నలుగురు కూడా పార్టీని వదిలి మరో పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.
స్థానిక ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహార శైలిని కొంత మంది కార్పొరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. ఈ వ్యతిరేకించే వారిలో విశాఖలోని 29వ వార్డులో ఉరుకూటి నారాయణరావు, 31వ వార్డు బిపిన్ జైన్, 35వ వార్డు భాస్కర రావు, 37వ వార్డు జానకి రామ్ తదితరులు ఉన్నారు. వీరినే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గానికే చెందిన మరో నలుగురు కార్పొరేటర్లు కూడా పార్టీని వీడాలని దాదాపు నిర్ణయించుకున్నారు.
బుధవారం (జనవరి 17) మరో నలుగురు కార్పొరేటర్లు నగరంలోని దసపల్లా హోటల్‌లో ప్రెస్ మీట్ పెట్టి.. తమ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు కూడా పార్టీని వీడిపోవడం స్పష్టం అయింది. వీరితోపాటు విశాఖ దక్షిణ నియోజకవర్గానికి చెందిన మరో నలుగురు కార్పొరేటర్లు, విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఒకరు, పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఇంకొకరు, గాజువాకలోని నలుగురు కూడా పార్టీని వదలాలని భావిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. వీరంతా వైసీపీని వీడితే జీవీఎంసీ కౌన్సిల్‌లో వైసీపీ బలం పడిపోతుంది. దీంతో కౌన్సిల్‌లో పెట్టే అంశాలను ఆమోదించడానికి వీల్లేని పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో జీవీఎంసీలో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది.
మూడేళ్ల కిందట జరిగిన జీవీఎంసీ ఎన్నికలు జరిగితే వాటిలో 58 వార్డులను వైసీపీ గెల్చుకుంది. టీడీపీ 30 వార్డుల్లో విజయం సాధించింది. జనసేన 3, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కో వార్డు చొప్పున దక్కించుకున్నాయి. నాలుగు చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. మెజారిటీ ఉన్నందున వైసీపీకి చెందిన 11వ వార్డు కార్పొరేటర్ గొలగాని హరి వెంకట కుమారిని మేయర్‌గా ఎంపిక చేసుకున్నారు. ఇన్నాళ్లు ఏ ఇబ్బంది లేకుండా పాలన సాగగా.. తాజాగా ఈ అలజడి మొదలైంది. వైసీపీ కార్పొరేటర్లలో చాలామంది ప్రభుత్వ విధానాలు, ముఖ్యంగా జీవీఎంసీ విధానాలపై అసంతృప్తితో ఉన్నప్పటికీ అధికార పార్టీ కాబట్టి ఇన్నాళ్లు సర్దుకుపోయారు. కానీ, ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యేలే పార్టీని వదలడం.. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కార్పొరేటర్లలో కూడా అసంతృప్తులు బయటికి వస్తున్నాయి. దీంతో తాము పార్టీలో ఇమడలేమంటూ టీడీపీ, జనసేన పార్టీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.