రానున్న ఏప్రిల్, మే నెలలో పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 294 స్థానాలకు జరిగే ఎన్నికల్లో బీజేపీ, మమతాబెనర్జీ సారధ్యంలోని తృణమూల్ కాంగ్రెస్(TMC) మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ, టీఎంసీల మధ్య ఘర్షణలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఓ వైపు సభలూ, సమావేశాలు ఏర్పాటు చేస్తూనే.. ఆపరేషన్ కమలం అమలు చేస్తోంది బీజేపీ. టీఎంసీలోని కీలక లీడర్లను తమ పార్టీలో చేర్చుకుంటోంది. దీంతో మమతాబెనర్జీ గతంలో ఎన్నడూ లేని రీతిలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పవచ్చు. రాష్ట్రంలోనూ హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి.

దీదీ.. నందిగ్రమ్ నుంచి పోటీ
పరిస్థితులు ఇలా ఉంటే.. సోమవారం మమత బెనర్జీ కీలక ప్రకటన చేశారు. బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలకు కౌంటర్‌గా సంచలనాలకు తెర లేపుతున్నారు. తాను రెండుసార్లు పోటీచేసి గెలిచిన భభానీనగర్ నుంచి ఈ సారి బరిలోకి దిగడం లేదు. ఉద్యమాలకు పుట్టినిల్లు, వామపక్షాల నుంచి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఉపయోగపడిన నందిగ్రమ్ నుంచి పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కారణం కూడా ఉంది. తాము అధికారంలోకి రావడానికి వచ్చిన ప్రాంతం నందిగ్రమ్. మొన్నటి వరకు టీఎంసీలో ఉన్న, మమతకు నమ్మిన బంటులా పేరున్న సువేందు అధికారి బీజేపీలో చేరడం, మమతపై విమర్శలు చేయడంతో మమత ఈ నిర్ణయం తీసుకున్నారు. సువేందు అధికారి ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తే మమత వర్సెస్ సువేందు అధికారి పోరు నడుస్తోంది. సహజంగానే మమత ఆధిపత్యం ఉంటుంది. సో బీజేపీకి ఫస్ట్ గోల్ కొట్టే చాన్స్ ఇవ్వకూడదని మమత నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది.
సీఎం అభ్యర్థిపై చర్చ.. తెరపైకి మళ్లీ ఆ స్వామి..
టీఎంసీ నేతలు ఇప్పటికే బీజేపీకి సవాళ్లు విసురుతున్నారు. తాజాగా మా సీఎం అభ్యర్థి మమత బెనర్జీ… మీ సీఎం అభ్యర్థి పేరు ముందు చెప్పండి అని TMC నేతలు సవాలు చేశారు. వారు చేసిన సవాల్‌కి కారణం కూడా ఉంది. మమతకు సరితూగే అభ్యర్థి లేదా ఢీ అంటే ఢీ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో లేరు. ఒకవేళ తయారయ్యే అవకాశం ఉంటే.. మమత ఉండనిచ్చే పరిస్థితి కూడా లేదని ఆ పార్టీ నాయకులే కామెంట్లు చేస్తున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థిత్వం విషయానికి వస్తే..రెండు మూడు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. వాటిలో ఒక పేరు మాత్రం ఆసక్తికరంగా మారింది. బీజేపీ సీనియర్ నేత సౌమిత్రా ఖాన్ ఇటీవల మాట్లాడుతూ.. బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. ఆయన బెంగాలీయేతర వ్యక్తి కావడం, ఈ కోణంలోనూ విమర్శలు రావడం జరిగింది. దీనిపై పార్టీ మళ్లీ బెంగాల్‌కు చెందిన వ్యక్తి మాత్రమే సీఎంగా ఉంటారని ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. మాజీ క్రికెటర్ సౌరభ్ గంగూలీ పేరును పరిశీలించినా రాజకీయాల్లో అనుభవం లేకపోవడంపై చర్చ నడిచింది. ఇటీవలే టీఎంసీని వీడి భాజపాలోకి వచ్చిన కీలకనేత ముకుల్ రాయ్ ప్రస్తుతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన ఆర్థికంగా బలవంతుడైనా.. బ్యాంకు కుంభకోణాల కేసులు, ఆర్థిక నేరాల ఆరోపణలు ఉండడం ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలోనే వేలూర్ రామకృష్ణ మఠంలోని ఆర్యోగ విభాగాధిపతి కృపాకరానంద మహరాజ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.ఈయన అసలు పేరు డెబాతోష్ చక్రవర్తి. బెంగాల్ మెడికల్ ఎంట్రెన్స్ టాప్ ర్యాంకర్. NRS కళాశాలలో మెడిసిన్ చేశారు. ఎయిమ్స్‌లో ఎంఎస్ చేశారు. అమెరికాలోనూ కార్డియాలజీపై ప్రత్యేక కోర్సులు నేర్చుకున్నారు. సంగీతంలోనూ ప్రావీణ్యం ఉంది. అమెరికా నుంచి వచ్చాక..కొన్నాళ్లకు ఇక్కడ చేరారు. బెంగాల్‌కు చెందిన వ్యక్తి కావడం, ఉన్నత విద్యావంతుడు, బీజేపీ సైద్ధాంతిక అంశానికి సరిపడడం, రానున్న కాలంలో దేశ వ్యాప్తంగా ఈ అంశం తమకు అనుకూలంగా మారే అవకాశం ఉండడం నేపథ్యంలో బీజేపీ ఈయన వైపే మొగ్గు చూపుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సంచలనాలు, బీజేపీ సహజ వైఖరికి విరుద్ధమైన నిర్ణయాలు ఏమీ జరగకుంటే.. ఈ పేరు ఖరారు కావడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా, గోరఖ్ పూర్ ఆశ్రమ అధిపతిగా ఉన్న యోగి ఆదిత్యనాథ్.. ఉత్తర్ ప్రదేశ్ సీఎం అయిన విషయం తెలిసిందే.
గతంలోనూ ప్రచారం..
వాస్తవానికి రామకృష్ణ మఠం రాజకీయాలకు దూరంగా ఉంటుంది. గతంలోనూ ఈ ప్రచారం జరిగినా కృపాకరానంద ఖండించారు. తనకు ఆ ఆలోచనే లేదని, తాను స్వామి వివేకానంద మార్గంలో ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. రాజకీయాలపైనా తనకు ఇంట్రెస్ట్ లేదన్నారు. అయితే, ఆర్ఎస్ఎస్ ఈయనవైపే మొగ్గుచూపుతోందన్న ప్రచారం కూడా ఉంది. ఏబీవీపీ శ్రేణుల్లోనూ ఈయన పేరు చెబితే ఉత్సాహం వ్యక్తమవుతోంది.











