ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పన్నిన జిల్లా విభజన రగడ ప్రకాశం జిల్లాలో ప్రజల్లో అసంతృప్తిని రగిలిస్తోంది. ఓ సిద్ధాంతం ప్రాతిపదిక లేకుండా… ప్రజాప్రయోజనాన్ని పట్టించుకోకుండా.. లోక్ సభ స్థానాల ప్రాతిపదికన జిల్లాలను విభజిస్తే.., ప్రకాశం జిల్లా ప్రజల బతుకుల్ని సముద్రంలో కలిపినట్లేనని ఆవేదన వ్యక్తమవుతోంది.
అన్నమో రామచంద్రా అని వలస బతుకుల పశ్చిమ ప్రకాశాన్ని ఏం చేస్తారో చెప్పకుండా… సముద్రం తప్ప ఇంకేమీ లేని తూర్పు ప్రకాశాన్ని ఏ గోదాట్లో కలుపుతారో అర్థంగాక.. గుంటూరు, నెల్లూరు జిల్లా మధ్య ఇరుక్కుపోయి విలవిలలాడుతున్న ఉత్తర, దక్షిణ ప్రకాశం జిల్లా ప్రాంతాల బతుకేంటో చెప్పకుండా ఎలా విభజిస్తారు అనే ప్రశ్న ప్రజల్లో తలెత్తుతోంది.
ప్రకాశం జిల్లా బతుకు 1,2, 3 నంబర్లాటేనా…?
1970 పిబ్రవరి 2న నెల్లూరు, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోని 70 శాతం పనికిరాని కరవు ప్రాంతాలు, 30 శాతం పంటలు పండే భూములతో ఒంగోలు జిల్లాను ఏర్పాటు చేశారు. 1972వ డిసెంబర్ 5 న ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్ధం ప్రకాశం జిల్లాగా పేరు మార్చారు. కానీ, ప్రకాశం జిల్లాలోని 12 నియోజకవర్గాలను కలిపి ఓ పార్లమెంట్ స్థానంగా ఏ రోజూ చేయలేదు.
గ్రానైట్, డ్యాములు, నీటి సదుపాయం, సముద్రతీరం ఉన్న చీరాల, పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాలను బాపట్ల ఎంపీ స్థానంలో కలిపారు. కరవు ప్రాంతాలైన యర్రగొండపాలెం, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, ఒంగోలు, కొండపిని కలిపి ఒంగోలు ఎంపీ స్థానంగా ఏర్పాటు చేశారు. ఎవరికి కావాల్సి వచ్చిందో గానీ, జిల్లాలోనే ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకెల్లి అనాథలా నెల్లూరు జిల్లాలో కలిపారు. పేరుకు ప్రకాశం జిల్లా బతుకేమో 3 ముక్కలు అన్నట్లు మూడు భాగాలైంది.
ఇప్పుడు లోక్ సభ జిల్లాలో విభజనలోనూ అదే మూడు ముక్కలాటలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఇప్పుడు ప్రకాశం జిల్లాను రెండు చేస్తారా? మూడు చేస్తారా? ఎప్పటి నుంచో ఉన్న మార్కాపురం జిల్లా ప్రతిపాదన బతుకేంటి..? అనేదానిపై విస్తృతంగా చర్చసాగుతోంది.
ప్రజల భవిష్యత్తుకు భరోసా ఉందా…?
వైఎస్ జగన్ ఆలోచన ప్రకారం ప్రకాశం జిల్లా లోక్ సభ స్థానాల ప్రాతిపదికన బాపట్ల జిల్లా, ఒంగోలు జిల్లాగా ఖాయమైంది. కందుకూరు నియోజకవర్గాన్ని తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో కలపడం కూడా దాదాపు ఖరారైంది. కానీ, ప్రకాశం జిల్లా ప్రజల బతుకులేంటి అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారాయి. లోక్ సభ స్థానాల ప్రాతిపదికన బాపట్ల జిల్లాను ఏర్పాటు చేస్తే.. చీరాలలోని జీడిపప్పు, ఆక్వా పరిశ్రమలు.., అద్దంకిలోని సింగరాయకొండ వంటి పుణ్యక్షేత్రాలు, గుండ్లకమ్మ, రామతీర్థం వంటి జల ప్రాజెక్టులు, సంతనూతలపాడు నియోజకవర్గంలో గ్రానైట్ పరిశ్రమ ప్రకాశం జిల్లా నుంచి దూరం అవుతాయి.
ప్రపంచ ప్రసిద్ధి పొందిన గ్రానైట్ పరిశ్రమ చీమకుర్తి మండలంలో విస్తరించి ఉంది. ఈ ప్రాంతం సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉంది. భౌగోళికంగా గ్రానైట్ పరిశ్రమ అంతా ఒంగోలు జిల్లా కేంద్రానికి కేవలం 20 కి.మీ ఉంటే.., బాపట్ల కేంద్రానికి 80-90 కి.మీ దూరంలో ఉంది. దీనిని అయినా ప్రకాశం జిల్లాలో ఉంచాలని.., మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కోరితే.., జగన్ తిరస్కరించడంతో ఆయన కూడా సైలంట్ అయ్యారు.
దీనికి తోడు.. గోరుచుట్టుపై రోకలిపోటులా ఏపీ విభజన చట్టంలో కేటాయించిన రామాయపట్నం పోర్టు ఏర్పాటు చేయబోయే కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో కలసిపోతోంది. ఆఖరికి ఎవరి పేరు మీద అయితే ప్రకాశం జిల్లా అని ఏర్పాటు చేశారో… ఆ టంగుటూరి ప్రకాశం పంతులు స్వగ్రామం వినోదరాయుని పాలెం కూడా ప్రకాశం జిల్లా నుంచి బాపట్ల జిల్లాలోకి వెళుతోంది. ఇక ప్రకాశం జిల్లాకు మిగిలేది ఏంటి అంటే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు, కరవు ప్రాంతాలైన యర్రగొండపాలెం, కనిగిరి, గిద్దలూరు, మార్కాపురం, దర్శి మిగులుతాయి.
ఇక ఒంగోలు ఉంది కదా అంటే అక్కడ సముద్రం, కలెక్టర్ కార్యాలయం, ఇంకేమీ ఉంది అని వెతుక్కోవాల్సిన దుస్థితి. ఆదాయం లేని నిరుద్యోగులతో కూడిన నీళ్లు లేని జిల్లాగా ప్రకాశం జిల్లా అనే కొత్త జిల్లా మిగులుతోంది. దీనికి సరిపోయేటట్లు అధికారులు కూడా మండలాల వారీగా ఉన్న ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి.. పరిశ్రమలు.. జనాభా.. ప్రభుత్వ కార్యాలయాలు ఏమున్నాయి.. అనే అంశాలతో పాటు, ఏ మండలంలో ఏ కులం, మతం ఓట్లు ఉన్నాయి.. అనేది కూడా అంతర్గతంగా సేకరిస్తున్నారు. దీనిని వేగవంతం చేయడానికే ఇంత వరకూ ఎప్పుడూ లేనట్లు ముగ్రురు జాయింట్ కలెక్టర్లను వ్యూహాత్మకంగా ప్రతి జిల్లాలోనూ నియమించారు.
మార్కాపురం జిల్లా దారెటు…!
ప్రజా శ్రేయస్సు, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రధానమైతే మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం ఉన్న ప్రకాశం జిల్లాకు సుదూరంగా ఉన్న పశ్చిమ ప్రకాశం ప్రాంతంలోని ఉయ్యాలవాడ గ్రామం ఇప్పుడున్న జిల్లా కేంద్రం ఒంగోలుకు 240 కి.మీ, కొత్తపల్లి 196, రోళ్లపెంట 161, మర్రివేముల 131 కి.మీ ఉన్నాయి. ఇవే గ్రామాలు మార్కాపురం కేంద్రం జిల్లాను ఏర్పాటు చేస్తే.., జిల్లా కేంద్రానికి దూరం సగం తగ్గుతోంది. ఈ దిశగా మాత్రం వైసీపీ ప్రభుత్వం ఆలోచించడం లేదు. గుడ్డెద్దు చేలో పడినట్లు ప్రకాశం జిల్లాను విభజిస్తుండటంతో.., మార్కాపురం కేంద్రంగా జిల్లా అనే న్యాయమైన డిమాండ్.., సమాధి అయిన పలకల పరిశ్రమలో కలసిపోబోతోంది.
ప్రతిపక్షాల గొంతులు ఎందుకు పెగలడం లేదు…?
వేసిన రోడ్డు మీద రోడ్డు వేసినట్లు బిల్లులు చేసుకుని.. నీరు-చెట్టులో పొట్టలు నింపుకుని టీడీపీ ద్వితియశ్రేణి నేతలు నిద్రపోతున్నారు. అవినీతి సొమ్ము దాచుకోవడం కోసం గ్రానైట్ పరిశ్రమలు, క్వారీలపై దాడులు జరగగానే కీలకమైన శిద్ధా రాఘవరావు, కరణం బలరాం, బాలకృష్ణ ఆప్తమిత్రుడు కదిరి బాబూరావు.., ఫ్యాను గూట్లో పడుకుని నోళ్లు కట్టేసుకున్నారు.
ఇక మిగిలిన నేతలు ఏమన్నా మాట్లాడితే తమ మీద పడతారేమో అనే భయంతో బిక్కు బిక్కుమని బతుకుతున్నారు. ఇక అంతో ఇంతో ప్రజల పక్షాన పోరాడే వామపక్షాలు కలెక్టరేట్ ముందు ధర్నాలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతున్నాయి. దీంతో ప్రకాశం జిల్లాను విభజిస్తున్న విధానం అశాస్త్రీయం.., ఏమీ లేని కరవు ప్రాంతం చేతిలో అడుక్కోమని చిప్ప పెట్టినట్లు విభజించకండి అని ప్రశ్నించే గొంతులు కూడా లేకుండా పోయాయి..
చూడాలి.. తుది నిర్ణయం వచ్చిన తర్వాత శవం మీద పేలాలు వేరుకున్నట్లు ప్రతి పక్షాలు ఉద్యమాన్ని లేవదీస్తాయో… లేక వైసీపీ ప్రభుత్వమే ప్రజా సంక్షేమం దిశగా నిర్ణయం తీసుకుంటుందో అంటే…, 2021 మార్చి వరకూ వేచి చూడాల్సిందే.