ప్రస్తుతం వాట్సప్ పరిస్థితి చూస్తంటే.. ‘చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం’ అనే సామెత గుర్తొస్తుంది. కాకపోతే, ఇది కాస్త మేలు.. పూర్తిగా కాలక ముందే ఆకులు పట్టుకుంది వాట్సప్. ఎట్టకేలకు అప్‌డేట్ నుంచి వెనక్కు తగ్గింది. మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. కనీసం ఇప్పటికైనా కళ్లు తెరిచి కొంత డ్యామెజ్‌తో తప్పించుకుంది వాట్సప్. ఇంకాస్త ఆలస్యం అయ్యుంటే వాట్సప్ వాడేవాళ్లం అనేవాళ్లు జనాలు. ఇప్పటికే చాలా మంది వాట్సప్ ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడ్డారు. మొత్తానికి నష్టం వాటిల్లకముందే కాస్త తప్పించుకుంది.
స్పష్టత లేని వైఖరి
వాట్సప్ వివరాలను ఫేస్ బుక్‌తో పంచుకోబోతుంది.. దానికి అప్ డేట్ ప్రవేశపెట్టిన క్షణం నుండి విమర్శలు వెల్లువెత్తాయి. అగ్నికి అజ్యం అన్నట్టు.. ప్రపంచ కుబేరుడిగా మారిన రోజునే ఎలాన్ మస్క్, వాట్సప్ ఎందుకు దండగా.. సిగ్నల్ ఉండగా అన్నట్లుగా ఒక ట్వీట్ చేయగానే.. యువత బాగానే స్పందించారు. కేవలం ఒక్కరోజులోనే ఇండియాలో ఫ్రీ యాప్ విభాగంలో రెండో స్థానానికి పడిపోయింది వాట్సప్. మొదటి స్థానం ఎవరంటే మళ్లీ చెప్పేదేముంది.. మస్క్ ఓటేసిన సిగ్నల్‌దే.
ఏంటీ ట్వీట్?
ఇది చూసిన వాట్సప్ సిఇఓ వాట్సప్ అప్‌డేట్‌పై వివరణ ఇస్తూ సుదీర్ఘమైన ట్వీట్ కూడా చేశారు. కానీ అందులో ఏ డేటా షేర్ చేయరో చెప్పారే గానీ.. ఏ సమాచారం ఫేస్ బుక్‌కి అందించబోతున్నారనే విషయాన్ని ఆయన చెప్పకపోవడం మరో గందరగోళానికి తెర లేపింది. తన ట్వీట్‌కి చాలా మంది ఇదే ప్రశ్నను సమాధానంగా పెట్టడంలోనే తెలుస్తుంది, వాట్సప్ వాడుతున్న వారు ఎంత గందరగోళ పరిస్థితిలో ఉన్నారో.. ఇదంతా మనకెందుకు వాట్సప్ వాడడం మానేస్తే పోతుంది కదా అనుకున్నారు చాలామంది. దాని ప్రభావమే వాట్సప్‌కి బదులుగా వేరేవి వాడడం మొదలుపెట్టారు. అందులో సిగ్నల్ బాగా లాభపడిందనే చెప్పాలి.
ఏదేమైనా.. చివరికి వాట్సప్ తన నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. ఇక్కడ వాయిదా వేయడం కంటే, ప్రజలకు స్పష్టత ఇవ్వడం చాలా ముఖ్యం. అసలు అప్‌డేట్ ఎందుకు? ఫేస్ బుక్‌లో ఎలాంటి సమాచారం పంచుకోబోతున్నారు? వాట్సప్ భద్రత విషయాలపై స్పష్టత ఇవ్వకపోతే.. ఇంతకు మించి వాట్సప్ ఎదుర్కోవలసి వస్తుంది.