‘ఇదిగో సినిమా థియేటర్లు ప్రారంభమైపోతున్నాయ్’ అనుకున్నాం. అక్టోబరు చివరికి వచ్చినా ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారైంది. కరోనా తర్వాత వ్యవస్థ ఇప్పుడిప్పుడే గాడినపడుతోందని అనుకుంటే సినిమా విడుదల మాత్రం మరింత వెనక్కిపోతోంది.
సినిమా థియేటర్లు ప్రారంభం కాకపోవడానికి సవాలక్ష కారణాలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ప్రారంభం కాకపోవడానికి ఆ నలుగురే కారణమనే మాట కూడా వినిపిస్తోంది. చిన్న నిర్మాతలు మాత్రం ఎప్పుడెప్పుడు థియేటర్లు ప్రారంభమవుతాయా అని ఎదురుచూస్తున్నారు. థియేటర్లు ప్రారంభం కాకపోవడానికి ప్రభుత్వ పరంమైనా లోపాలు ఏమీ కనిపించడం లేదు. నిర్మాతల మండలి, ఫిలింఛాంబర్ లాంటి సంస్థలు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేకపోతున్నాయి.
ఎప్పటికప్పుడు జూమ్ లో మీటింగులు నిర్వహిస్తూ అభిప్రాయాలు మాత్రం తెలుసుకుంటున్నారు. తెలంగాణలో 800 నుంచి 1000 వరకు మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. రాయలసీమలో 800 వరకూ ఉన్నాయి. ఆంధ్రాలో 2000 ఉన్నాయి. మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4000 థియేటర్లు ఉన్నాయి. దాదాపు ఏడు నెలలుగా సినిమా థియేటర్లు మూతపడి ఉన్నాయి.
వీటిలో చాలా థియేటర్లు లీజు ప్రాతిపదికన నలుగురు పెద్దల దగ్గర ఉన్నాయి. వారిలో ఒకరు డి. సురేష్ బాబు, ఇంకొకరు అల్లు అరవింద్, మరో వ్యక్తి దిల్ రాజు, అలాగే ఏషియన్ ఫిలింస్ సునీల్ నారంగ్. వీరి నలుగురి దగ్గరే చాలా థియేటర్లు ఉన్నాయి. వీరిలో ముగ్గురికి థియేటర్లు ఇప్పట్లో ప్రారంభం కావడం ఇష్టంలేదని తెలుస్తోంది. ఏకంగా సంక్రాంతి నుంచి ప్రారంభించాలన్నది వీరి ఆలోచన. కానీ చిన్న నిర్మాతలు మాత్రం ఇందుకు అంగీకరించడంలేదు. ఏమైనాసరే దీపావళి నాటికి బొమ్మ పడిపోవలసిందే అంటున్నారు. ఈ విషయంలో ఎగ్జిబిటర్లకూ, నిర్మాతలకూ, పంపిణీదారులకూ మధ్య చాలా గ్యాప్ కనిపిస్తోంది.
ఎగ్జిబిటర్ మనస్తత్వం సాధారణంగా ఎలా ఉందంటే కరెంటు బిల్లులు, రాయితీలు తీసుకోవాలని వారు అంటున్నారు. టాక్స్ మినహాయింపులు కావాలనేది ఎగ్జిబిటర్ల కండిషన్. నిర్మాత కండిషన్ మరోలా ఉంది. పది మంది పెద్ద నిర్మాతలు ఒకరకంగా ఆలోచిస్తున్నారు. మిగతావారంతా ఒక్కటే కోరుతున్నారు. వర్చువల్ ప్రింట్ ఫీజు ఉండరాదని అంటున్నారు. ఈ డిసెంబరు వరకూ ఈ ఫీజులో యాభై శాతం రాయితీ ఇచ్చారు. ఇదసలు తీసేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఫీజును 50 శాతం తగ్గిస్తున్నట్టు క్యూబ్ తెలిపింది. ఈ ఏడాది డిసెంబరు 31 వరకూ ఈ రాయితీ ఉంటుందని, కనీసం ఏడు ఆటలు ప్రదర్శిస్తేనే ఈ రాయితీ ఉంటుందని క్యూబ్ అంటోంది. ఇప్పటికే విడుదల చేసిన చిత్రాలకు డెలివరీ ఛార్జీలు చెల్లిస్తే చాలంటోంది. ఇప్పటికే కొన్ని చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యాయి. వీటిని మళ్లీ థియేటర్లలో విడుదల చేయాలని కూడా చూస్తున్నారు.
ఏమిటీ సంస్థల ప్రత్యేకత?
క్యూబ్ లాంటి సంస్థలు దాదాపు ఉచిత సదుపాయం ఇవ్వాలని మిగతా నిర్మాతలంతా కోరుతున్నారు. డిజిటల్ వచ్చాక సినిమాల ప్రదర్శనకు యు.ఎఫ్.ఒ, క్యూబ్, పీఎక్స్ డీ లాంటి పెద్ద సంస్థలు ఉన్నాయి. ఇవి కాకుండా చిన్న కంపెనీలు ఇంకో రెండున్నాయి. క్యూబ్ లో నిర్మాత అల్లు అరవింద్ కు వాటా ఉంది. యూఎఫ్ఓలో డి. సురేష్ బాబు ఓ భాగస్వామి. ఇక పీఎక్స్ డీ అనేది ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేష్ ప్రసాద్ ది. పీఎక్స్ డీ ఇక్కడి నుంచే సినిమాలను విడుదల చేస్తుంది. మిగిలివి బాంబే నుంచి లైవ్ లో సినిమాలు విడుదల చేస్తుంటాయి. క్యూబ్ మాత్రం చిప్ లాంటి వాటి ద్వారా సినిమాలు విడుదల చేస్తుంటుంది. ఇవి టీవీ బూస్టర్ లాంటివే. యూఎఫ్ ఓ మాత్రం బాంబే నుంచి నేరుగా సినిమా ప్రదర్శిస్తుంది.
ఇలా సినిమాలు విడుదల చేసినందుకు వాటికి సుమారు రూ. 10, 000 నుంచి 12,500 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఆర్డినరీ, 2k లాంటివి ఉంటాయి. దానికీ దీనికీ రూ. 2000 తేడా ఉంటుంది. ఆర్డినరీ సినిమా అయితే రూ. 9, 700 చెల్లించాలి. అంటే ఒక థియేటర్ లో ఓ సినిమాని 28 ఆటలు ప్రదర్శించినందుకు గాను ఇంతమొత్తాన్ని ఆ సంస్థలకు చెల్లించాలి. 2k ప్రసారమైతే 12వేలు చెల్లించాల్సి ఉంటుంది. ‘ఇంత మొత్తం మేం చెల్లించలేం. మినిమమ్ తీసుకోండి.. ఆ మొత్తం మేం కట్టం’ అని నిర్మాతలు అంటున్నారు.
పెద్ద ప్రొడ్యూసర్లు మాత్రం ఆ రాయితీ అడగరు. ఎందుకంటే వాళ్లు 200 కోట్లు 300 కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటారు. వాళ్లకు ఈ పది వేల రూపాయలు ఎక్కువ కాదు. పైగా ఆ మొత్తంతో నిర్మాతకు ఏ మాత్రం సంబంధం ఉండదు.. అది బయ్యర్ కట్టుకుంటాడు. చిన్న సినిమాలకు మాత్రం నిర్మాతే ఆ డబ్బు చెల్లించాలి. బయ్యర్ కట్టడు.. దానివల్లే ఇబ్బంది వస్తోంది. 2k సినిమా అంటే క్వాలిటీ బాగుంటుంది. మంచి సౌండ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని అట్మాస్ అని కూడా అంటారు. ప్రభుత్వం చెయ్యాల్సింది ఏమిటంటే ఏడు నెలల కరెంటు బిల్లు రాయితీ ప్రకటించాలి. ‘మేం కరెంటు వాడలేదు కాబట్టి పూర్తిగా రాయితీ ఇవ్వండి’ అని ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు.
పన్నుల గొడవేంటి?
పన్నుల మినహాయింపును ఎగ్జిబిటర్లు అడుగుతున్నారు. దీనికి పెద్ద హీరోలు కూడా పూనుకుని ప్రభుత్వం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకువెళ్లాలి. వినోదపు పన్ను అనేది ఆడితేనే ఉంటుంది లేకపోతే లేదు. ఇక ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ఉండనే ఉంటుంది. అది కూడా కట్టాల్సిందే. దాన్ని ఎగ్జిబిటరే కట్టుకోవాలి. అది సెంటర్ ను బట్టి, ఆ థియేటర్ పరిస్థితిని బట్టి ఉంటుంది. ఒక్కో ఊళ్లో ఒక్కో రేటు ఉంటుంది. చాలామంది నిర్మాతలు దీపావళికి థియేటర్లు ప్రారంభమవుతాయని ఆశలు పెట్టుకున్నారు. పెద్ద నిర్మాతలు మాత్రం ఇప్పట్లో ప్రారంభించడానికి ఇష్టం చూపడం లేదు. కొత్త సంవత్సరంలో అయితే బాగుంటుంది అనుకుంటున్నారు.
చిన్న వాళ్లంతా కనీసం దీపావళికైనా ప్రారంభించాలని కోరుతున్నారు. ఇప్పుడు ప్రారంభమైతే ఆడియన్స్ మళ్లీ థియేటర్లకు అలవాటు పడతారన్నది చిన్న నిర్మాతల ఆలోచన. ‘వకీల్ సాబ్’ లాంటి సినిమా వచ్చేనాటికి పూర్తగా అలవాటవుతారు కదా అనేది వీరి ఆలోచన. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా ఉన్న బల్లిపాడు బాపిరాజును ఈ విషయం పై ప్రశ్నించినప్పుడు థియేటర్లు దీపావళికి ప్రారంభం కావచ్చన్న ప్రతిపాదనలు అయితే ఉన్నాయని చెప్పారు. తను పాలకొల్లు నుంచి సినిమారంగానికి వచ్చానని, దాదాపు 35 ఏళ్లుగా సినీ పరిశ్రమనే అంటిపెట్టుకున్నానని చెప్పారు. అందరి పరిస్థితి చాలా గడ్డుగా ఉందని అన్నారు.
-హేమసుందర్ పామర్తి