వరద ముంపు ప్రాంతాల్లో ప్రజాగ్రహం తీర్చేందుకు టీఆర్ఎస్ సర్కార్ నగదు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాల్లో తక్షణ సాయం కింద పదివేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించింది. గత నాలుగు రోజులుగా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తృతంగా చేపట్టింది. నగదు పంపిణీపై భారీగా ప్రచార ఆర్భాటం చేసింది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీనిపైనే ప్రచారం చేసింది టీఆర్ఎస్ కేడర్. దీంతో వరద ముంపు ప్రాంతాల ప్రజలు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పథకం కేవలం హైదరాబాద్ వరకే సర్కార్ పరిమితం చేయడంతో వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో ప్రజల మెప్పుపొందేందుకు ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి.
ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు
వరదల కారణంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇబ్బందులు పడ్డ ప్రజలు టీఆర్ఎస్ నేతలు కనిపిస్తే అడ్డుకునే పరిస్థితి తలెత్తింది. కొన్ని ప్రాంతాల్లో దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో ప్రజల కోపం తగ్గించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నగదు పంపిణీ చేపట్టారు. అయితే నగరంలో అనేక చెరువులు అలుగు పారడంతో పెద్ద ఎత్తున కాలనీలు నీట మునిగాయి. వేల ఇళ్లు ఇప్పటికీ నీళ్ళలోనే మగ్గుతున్నాయి. ఎప్పుడు నీరు ఖాళీ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ప్రభుత్వ సాయం కోసం ధీనంగా ఎదురు చూస్తున్నారు. వరదలు వచ్చి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వ ప్రతినిధి తమ వద్దకు రాలేదని .. ఓట్ల కోసం వచ్చిన నేతలు ఇప్పుడు జాడ లేకుండా పోయారని చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సాయం చేస్తోందని సోషల్ మీడియాలో, పేపర్లలో , టీవీలలోచూస్తున్నాం తప్పితే తమ వద్దకు ఇప్పటి వరకు ఎవరూ రాలేదంటున్నారు. సాయం చేయక పోయినా తాము ఉన్నామా , పోయామా అని చూసేందుకు కూడా రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కట్టు బట్టలతో పరుగులు తీశాం
వరదల కారణంగా ఒక ఫ్లోర్ వరకు ఇళ్లు నీట మునిగాయని.. ప్రాణాలు కాపాడుకునేందుకు కట్టు బట్టలతో పరుగులు తీసామని .. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా తడిసి పాడై పోయాయంటున్నారు కొందరు బాధితులు. ఇప్పటికీ నీరు ఇళ్లలోనే ఉండటంతో వాటిని బటయకుతీసే పరిస్థితి లేదని.. ఈ నీరు ఎన్నాళ్ళు ఉంటుందో, తమ వస్తువులు ఎప్పుడు బయటకు వస్తాయో తెలియడం లేదంటున్నారు. ఇక ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా పాడై పోయాయని… వేల రూపాయలతో కొన్నవి ఇప్పుడు చెత్త బుట్ట పాలు చేయాల్సి వచ్చిందంటున్నారు . అనేక కాలనీల ప్రజలు ప్రభుత్వం తమను ఆదుకుంటుందని ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాయం ప్రకటించినా అది తమవరకు చేరుతుందా లేదా అన్న అనుమానాన్ని చాలామంది వరద బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి కాలనీలకు చేరుకుని బాధితులకు సాయం చేయాలని ఆశిద్దాం. లేదంటే ఇప్పటికే టీఆర్ఎస్ సర్కార్ ను తిట్టిపోస్తున్న ప్రజలు.. .రానున్న గ్రేటర్ ఎన్నికల్లో తమ ఓటు తో గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.










