అతను ఆవేశంలో తీవ్రవాది…
ఆ ఆవేశంలో ఆలోచన ఉండదు… మనసులో ఉన్నది బయటకు కక్కేయడమే.
ఇజం అంటారుగానీ ఆయన చెప్పేదే నిజం
ఈతరం మనిషి మాత్రం కాదు… ఆయన లెక్క ఎవరికీ తెలియదు…
ప్రశ్నించడమే పరమావధి అంటాడు… ఆయన్నిప్రశ్నిస్తే మాత్రం అభిమానులు తట్టుుకోలేరు- ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. సెప్టెంబరు 2 ఆయన పుట్టిన రోజు…. అభిమానులకు అది పండుగ రోజు.
పాతికేళ్లు వెనక్కి వెళితే…
అతను జనానికి పరిచయమై అప్పుడే పాతికేళ్లు అయ్యింది. ఆ పాతికేళ్లు వెనక్కి వెళితే అతనెవరో ఎవరికీ తెలియదు. అకస్మాత్తుగా గోడల మీద ఓ పోస్టర్… దాని మీద అతని ఫొటో. పేరు చెప్పకుండా మనకో పజిల్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ మరో పోస్టర్… ‘ఎస్ ఈ అబ్బాయే కళ్యాణ్’ అని ప్రకటించారు. సినిమా రంగానికి మరో వారసుడు వస్తున్నాడని అందరికీ అర్థమైంది. మెగాస్టార్ చిరంజీవికి మరో వారసుడు అని అంతా అనకున్నారు. కానీ ఆ సమయంలో చిరంజీవి సినిమాలకు దూరంగా ఉన్నారు.
‘హిట్లర్’ సినిమాకు ముందు అంటే 1994-97 మధ్య చిరంజీవి సినిమాలకు గ్యాప్ వచ్చింది. 1996 అక్టోబరు 11న అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి విడుదలైంది. సాహసం ఆయన ఊపిరి అని తొలి సినిమాలోనే అర్థమైంది. తొలి సినిమాలోనే రియల్ స్టంట్లు చేసేశారు. ‘తొలిప్రేమ’లోనూ జీవించేశారు. కళ్యాణ్ గా ప్రేక్షకులకు పరిచయమైన ఆ అబ్బాయి ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గా మారి వరుస హిట్లతో దూసుకుపోయాడు…. ఇప్పుడు పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు.
వర్తమానంలోకి వస్తే…
#పవనిజం హ్యాజ్ టాగ్ ఓ దశలో వైరల్ అయ్యింది. ఏమిటి పవన్ లో ప్రత్యేకత. ఆయన లోపలి మనిషి బయటికి తెలియదు… ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన ఇంట్రావర్ట్. చిరంజీవిలో ఉండే లౌక్యం లేదు… ముక్కుసూటి తనంతో తిక్క మనిషి అని పేరు తెచ్చుకున్నారు. ఏదో చెయ్యాలన్న తపన… ఏదో కావాలన్న ఆరాటం…. ఈ లక్షణాలే ఆయనను రాజకీయాల వైపు నడిపించాయేమో. ఆయన ఆలోచనల్లో అంత తీవ్రత ఉండబట్టే చెగువేరాకు అభిమాని అయ్యాడు. పాతికేళ్ల సినీ జీవితాన్ని కూడా కాలదన్నుకున్నాడు.
‘వకీల్ సాబ్’తో పాతిక సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. అన్నయ్య చిరంజీవి 26 ఆగస్టు 2008న ‘ప్రజా రాజ్యం’ పార్టీని స్థాపించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఆ పార్టీ యువనేతగానూ ఎదిగారు. సినిమాలు చేస్తూనే ఉన్నా రాజకీయాల వైపు మనసు మళ్లుతూనే ఉంది. 2014 మార్చి 14 న ‘జనసేన’ ఆవిర్భావానికి అది కారణమైంది. ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. పదవుల్ని ఆశించకుండా తెలుగుదేశం పార్టీకి, భారతీయ జనతా పార్టీకి మద్దతిచ్చి ప్రచారం చేశారు.
2019 ఎన్నికల్లో నేరుగా ప్రజాక్షేత్రంలోకి దిగారు. బీఎస్పీ, వామపక్ష పార్టీలతో కలిసి ఏపీలో పోటీచేసినా జనసేన పార్టీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. రాజకీయాల్లోకి ఆయన ఏం బావుకున్నారు అనంటే ఏమీ లేదనే సమాధానమే వస్తుంది. అయినా పట్టువదలని విక్రామార్కుడిలా పోరాడుతూనే ఉన్నారు. పవన్ ఎన్నికల ప్రచారంలో ఉన్నప్పుడు ఆయన సభలకు జనం పోటెత్తినా అవి ఓట్ల రూపంలో మారలేదు. ఆ కారణంగానే జనసేనకు తాను ఎదుర్కొన్న తొలి ఎన్నికలే అగ్ని పరీక్షగా మారాయి. ఇలాంటి పరీక్షలు మనకు తెలిసిన పవన్ కళ్యాణ్ కు కొత్తకాదు.
ఎక్కడ తప్పు జరిగింది?
పవన్ కళ్యాణ్ సినిమా జీవితాన్నిగాని, రాజకీయ జీవితాన్నిగాని పరిశీలిస్తే ఆయన కొంతకాలం సినిమాలు చేసుకోవడమే మేలేమో అనిపిస్తుంది. సరైన సమయంలో సరైన నిర్ణయం అనేది రాజకీయాల పరంగా అన్నదమ్ములిద్దరిలోనూ జరగలేదు. సినిమా జీవితం నల్లేరు మీద బండి నడకలా సాగితే రాజకీయ జీవితంలో మాత్రం ఆటుపోట్లు తప్పలేదు. అనర్హులతో కూడా మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది. ‘వ్యక్తుల ప్రైవేట్ జీవితం వారి వారి సొంతం. పబ్లిక్‌లోకి వస్తే మాత్రం ఏమైనా అంటాం’ అని శ్రీశ్రీ. అన్నట్లుగానే ఆయనపై విమర్శలు సంధించారు. మొండిఘటం కాబట్టి ఇంకా అలానే నిలబడగలిగారు… ఇకముందు కూడా అలానే నిలబడతారనే నమ్మకం ఆయన అభిమానుల్లోనూ ఉంది.
చెగువేరానే స్ఫూర్తి
ఒకనొక దశలో ఆయన పీపుల్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థను స్థాపించారు. అది కాస్తా వివాదానికి దారితీయడంతో ఆ కథ అక్కడితోనే ముగిసిపోయింది. ఆయనలోని ఈ తరహా ఆలోచనలకు మూల కారణం చెగువేరా ప్రభావమే. ‘ప్రపంచంలో అరాచకం, దోపిడీ, నిరంకుశత్వం ఉన్న వ్యవస్థల వల్ల ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నప్పుడు.. నువ్వు ఆ దేశపు మనిషివి కానప్పటికీ.. నీకు వ్యక్తిగతంగా ఏమి జరగనప్పటికీ.. నువ్వు పెరిగిన దేశపు, సమాజపు హద్దులను చెరిపేసి ప్రపంచ పీడిత ప్రజలకి అండగా నిలబడాలి అనే విషయాన్ని నేను చేగువేరా జీవితం నుంచి నేర్చుకున్నా’ అంటారు పవన్.
‘జీవితం అంతిమ క్షణాల వరకూ తాను నమ్మిన సిద్ధాంతంతోనే నడిచి చూపించిన విశ్వనరుడు చేగువేరా’ అంటూ ఓ సందర్భంలో కీర్తించారు.‘అందుకేనేమో దశాబ్దాల క్రితం, ఎక్కడో దక్షిణ అమెరికాలోని అర్జెంటీనాలో పుట్టి పెరిగి, క్యూబా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలలో పోరాటాలు చేసిన చేగువేరా చిత్రం ఉత్తరాంధ్రలోని ఓ మూలకి విసిరినట్టుండే ఇచ్ఛాపురంలో స్వేచ్ఛామాత గుడికి వెళ్లే వీధికి ఎదురుగా ఒక మాదిగ మహనీయుడి చెప్పుల దుకాణంపైన నాకు దర్శనమిచ్చింది’ అని కూడా పేర్కొన్నారు.
అభిమానులందరికీ పవన్ కావాలి… పవన్ కు మాత్రం చెగువేరా కావాలి. ఇప్ముడిది ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రమే అనుకుందాం. మున్ముందు ఏ ‘పవర్’ దిశగా ఆయన అడుగులు పడతాయో చూడాలి. ఆయన రాజకీయ జీవితానికి త్వరలోనే ‘శుభం’ కార్డు పడాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం.
– హేమసుందర్ పామర్తి