ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అసామాన్యుడిగా మారతారని ఎవరు మాత్రం ఊహించగలరు. రాష్ట్ర రాజకీయాలనే కాదు దేశ రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. చంద్రబాబునాయుడు తొలిసారి ముఖ్యమంత్రి అయి నేటికి 25 ఏళ్లు. ఆ సందర్భంగా ‘ది లియో న్యూస్’ ప్రత్యేక కథనం.
చంద్రబాబునాయుడు ఒక విలక్షణ రాజకీయ నాయకుడు. తెలుగురాష్ట్ర రాజకీయాలను ఒంటిచేత్తో నడిపిస్తూనే దేశరాజకీయాలను కూడా శాసించిన వ్యక్తి. ఆయన పెద్దగా చరిష్మా ఉన్న నాయకుడు కాదు.. కానీ పార్టీని తిరుగులేని రీతిలో అదుపులో ఉంచుకున్నారు. రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాకపోయినా.. సమర్థ నేతగా, సమర్థ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు.
రాష్ట్ర రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తూనే కేంద్రంలో కూడా వీపీ సింగ్ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్రను పోషించగలిగారు. ఎన్టీఆర్ తరువాత టీడీపీని అన్నీ తానై నడిపి చక్రం తిప్పారు చంద్రబాబు. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంద్రప్రదేశ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటివరకు రాష్ట్ర పరిస్థితి ఒక ఎత్తు అయితే బాబు జమానాలో పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి, సంప్రదాయ పద్ధతులను పక్కన పెట్టిన ఆయన టెక్నాలజీని ఉపయోగించుకుంటూ రాష్ట్రాన్ని అన్నీ రంగాలలో అభివృద్ధి దిశగా నడిపారు.
సీఎంగా తనదైన ముద్ర
కష్టపడే తత్వంతో దాదాపు 20 గంటల పాటు ఆయన ప్రభుత్వ కార్యకలాపాలతో మునిగి తేలారు. ఇదే సమయంలో అధ్యక్షుడిగా పార్టీని కూడా సమన్వయం చేస్తూ ముందుకు సాగారు. రాజకీయ నాయకులు అంటే ఎక్కడో ఉంటారనే ఉద్దేశాన్ని పోగొట్టి ప్రజలతో మమేకమవుతూనే కార్యక్రమాలు చేపట్టారు. ‘ప్రజల వద్దకు పాలన’ అనే కార్యక్రమానికి ఆయనే శ్రీకారం చుట్టారు. దీని ద్వారా ప్రజలకు ఎంతో లబ్ది చేకూరింది. జన్మభూమి, శ్రమదానం, క్లీన్ & గ్రీన్ లాంటి కార్యక్రమాలను రూపకల్పన చేసి వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారు. అన్నీ ప్రాంతాలను అభివృద్ధి చేయాలంటే రోడ్ల నిర్మాణాలను చేపట్టాలని నిర్ణయం తీసుకున్న ఆయన సరళీకృత విధానాలను అమలు చేశాడు. వరల్డ్ బ్యాంకు నిధుల ద్వారా గ్రామాలలో సిమెంట్ రోడ్లను, హైవేలను, స్టేట్ హైవేలను పూర్తి చేశారు.
స్వయానా ఎకనామిక్స్ విద్యార్థి కావడంతో ‘గ్లోబలైజేషన్’, ‘లిబరేజేషన్’ విధానాలను సమర్థంగా వాడుకొని ఐటీని డెవలప్ చేశారు. ఐటీ రాష్త్రంలో అభివృద్ధి చెందడానికి కారణం చంద్రబాబేనని ప్రతిపక్షాలు కూడా ఒప్పుకుంటున్న నిజం. ఐటీ అభివృద్ధి చెందడానికి అనేక దేశాలలో పర్యటనలు చేశారు. ఇదే సమయంలో ఆయా దేశాల ప్రభుత్వ పని తీరును ఆయన పరిగణనలోకి తీసుకునేవారు. జనాభా రద్దీతో రోడ్లపై ప్రయాణం కష్టమనే ఉద్దేశంతో ఫ్లై ఓవర్స్ కూడా ఆయన డిజైన్ చేశారు. భద్రత విషయంలో కఠినంగా ఉండే ఆయన రౌడీయిజం, తీవ్రవాదంపై ఉక్కుపాదం మోపారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయాలతోనే ఇతర ప్రాంతాల వారు హైదరాబాద్ కు వలస వచ్చారు.
ప్రభుత్వ పథకాలతో పారదర్శకత కోసం ఈ-సేవ లాంటి సంస్థను ఏర్పాటు చేశారు. ఒకే చోట అన్నీ రకాల ప్రభుత్వ సేవలు అందుతుండటంతో బాటు డిజిటలైజేషన్ కావడంతో అవినీతి తగ్గింది. దళారీ వ్యవస్థను రూపుమాపేందుకు ‘రైతు బజార్’ వ్యవస్థకు రూపకల్పన చేశారు. ఇది ఎంత మేలు చేసిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. రైతులే డైరెక్ట్ గా తాము పండించిన కూరగాయలను వారే ఇప్పటికీ అమ్ముకుంటున్నారు. ఇదే సమయంలో కేంద్రంలో దేవెగౌడ, ఐకే గుజ్రాల్, వాజ్ పాయ్ ప్రభుత్వాల ఏర్పాటులో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.

ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాష్ట్ర రాజకీయాలకు మాత్రమే ఆయన పరిమిత మయ్యారు. 2004లో జరిగిన ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నా ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీ నాయకులకు ఆదర్శంగా నిలిచారు. 2009లో తిరిగి ఓటమి చెందిన తరువాత టీడీపీ పని ఫినిష్ అని ప్రచారం జరుగుతున్నా వెరవక పార్టీని నడిపారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏర్పడ్డ నవ్యాంధ్ర ప్రదేశ్ కు దిశా నిర్దేశం చేయాలంటే చంద్రబాబు కావాలని ప్రజలు ఆయనను 2014లో తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించారు. విభజనతో నష్టపోయిన ఏపీని అభివృద్ధితో బాటు సంక్షేమ పథకాలతో ముందుకు నడిపారు.
2000 సంవత్సరంలోనే విజన్-2020ని బాబు డిజైన్ చేశారంటే ఆయన ముందుచూపునకు నిదర్శనం. క్రైసిస్ మేనేజిమెంట్ లో చంద్రబాబుకు ఎదురే లేదని చెప్పక తప్పదు. హుద్-హుద్ తుపాను సమయంలో పూర్తిగా నాశనమైన వైజాగ్ ను తిరిగి కొత్తగా నిర్మించాడని ఇతర పార్టీల నాయకులే చెప్పే విధంగా ఆయన సిద్ధం చేశాడు. సంక్షోభ సమయంలోనే కష్టపడీ ఫలితాలు తేవడంలో ఆయనను మించిన వారు లేరు. విజన్ 2020ని డిజైన్ చేసిన చంద్రబాబు ఇప్పుడు అధికారంలో ఉంటె కరోనా కట్టడిలో తన మార్క్ చూపించేవారని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
మరకలు తప్పలేదు
ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తూనే ఉండటం చంద్రబాబు రాజకీయ జీవితంలో ఓ మాయని మచ్చ. అలాగే 18 గంటల పాటు కష్టపడే తత్వం ఉన్న తనలాగే అధికారులు కూడా పనిచేయాలని కోరుకోవడం ఆయన మైనస్. జన్మభూమి, శ్రమదానం లాంటి పథకాల రూపకల్పన చేసి అధికారులను పరుగులు పెట్టించారు. దీంతో వారు ఆయనకు వ్యతిరేకంగా పని చేశారు. ‘నేను నిద్రపోను- మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనేది ఆయన నినాదంగా అప్పట్లో ప్రచారం అయింది. ప్రతి విషయాన్ని విడమరిచి అధికారులకు చెప్పాలనే ఉద్దేశంతో ఆయన చేసే సుదీర్ఘ ప్రసంగాలపై పార్టీ నాయకులే విమర్శలు చేసేవారంటే పరిస్థితి తీవ్రత తెలుస్తోంది. అధికారంలో ఉన్న సమయంలో పని పని తప్ప పార్టీని పట్టించుకోరనే మరకలు చంద్రబాబు మీద ఉన్నాయి.
సంపదను సృష్టించడమే కాకుండా రాష్ట్ర సర్వతోముఖాభి వృద్ధికి పాటుపడ్డ ముఖ్యమంత్రిగా చంద్రబాబు చరిత్రలో నిలిచిపోతారు. వందలాది ఇంజినీరింగ్ కాలేజీల స్థాపన చేయడమే గాక వారికి ఐటీ ఉద్యోగాలు వచ్చేలా చేసిన ఘనత ఆయన సొంతం. ఓటమిని ఒప్పుకోని చంద్రబాబు ఓ ఫీనిక్స్ పక్షి లాంటివారు. చివరి నిమిషం వరకు పోరాడుతారని విపక్షాల నాయకులే ప్రశంసలు కురిపిస్తుంటారు.










