సంపూర్ణ మద్యపాన నిషేదం హామీతో అక్కచెల్లెమ్మలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న జగన్ మోహన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని పూర్తిగా విస్మరించారు.ప్రైవేట్ మద్యంతో ఏపీలోని మహిళలు తాళిబొట్లు తాకట్టు పెట్టుకోవాల్సి వస్తోందని.. తాను అధికారంలోకి రాగానే రాష్ట్రంలో మద్య నిషేదం చేస్తా అని చెప్పి నేడు జగన్ సర్కార్ అదే మద్యాన్ని ప్రభుత్వ పరం చేసి అధిక ధరలకు విక్రయిస్తోంది. దీంతో ఎన్నికల హామీ అయిన మద్యపాన నిషేదం గాలి మాటే అనే చర్చ రాష్ట్రంలో కొనసాగుతోంది. కాగా తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో వందల సంఖ్యలో బార్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ అధికారులు నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.
ఏపీలో కొత్తగా మరో 840 బార్లు ఏర్పాటు చేసేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ-వేలం ద్వారా వీటిని వేలం వేయనున్నట్లుగా తెలుస్తోంది.దీనికి సంబంధించి ఎక్సైజ్ శాఖ తాజాగా ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచి 31 ఆగస్టు 2025 వరకు బార్లకు అనుమతినిస్తూ లైసెన్సులు మంజూరు కానున్నాయి.
ఈరోజు నుంచి ఈ నెల 27వ తేదీ వరకు బర్లకు సంబంధించి దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండనున్నాయి. దరఖాస్తు చేసుకునే వారు ఆన్‌లైన్‌లో తమ పేర్లు నమోదు చేసుకుని ప్రాసెసింగ్ ఫీజుతో పాటు నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. నాన్ రిఫండబుల్ దరఖాస్తు ఫీజును మాత్రం ఈ నెల 28వ తేదీ వరకు చెల్లించొచ్చని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తులు సమర్పించేందుకు జోన్ల వారీగా తేదీలు నిర్ణయించారు. రాష్ట్రంలో అత్యధికంగా విశాఖపట్టణంలో 128 బార్లు కొత్తగా ఏర్పాటు కానుండగా, ఆ తర్వాతి స్థానంలో విజయవాడ (110), గుంటూరు (67), నెల్లూరు (35) ఉన్నాయి.
మొత్తానికి పాదయాత్రలో జగన్ ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ గాలికి కొట్టుకుపోగా, తాజాగా రాష్ట్రంలో వందల సంఖ్యలో ఏర్పాటు కానున్న బార్లతో మద్యం ఏరులై పారనుంది.