అద్దె వ్యూహాలకు కోట్లు కుమ్మరించి.. ఆలోచనలను, మాటలను కొనుక్కునే దౌర్భగ్య రోజుల్లో రాజకీయ నాయకులకు గారడి విద్యలే తప్పా.. పటిమతో కూడిన నిర్మాణాత్మకమైన ఆలోచన విధానాలు ఎక్కడ అలవడుతుంది. ‘ఒకపక్క కులాలను ఆపాదిస్తూ.. వైవాహిక జీవితాన్ని లాగి వివస్త్రను చేసి పవన్ ఇమేజ్ ను నడిబజారులో నిలపెడుతారు కొందరు పెయిడ్ పరాన్న జీవులు. ఉగ్గుపాలతో నరనరాల్లో జీర్ణించుకున్న బూతు పురాణాలను బయటకు తీసి అద్దె మాటలు, వ్యూహాలతో టీడీపీపై ప్రత్యక్ష దాడులకు దిగుతారు మరికొందరు’. ప్రజాబాహుళ్యంలో పేరు, ప్రఖ్యాతలు మచ్చుకైనా లేని, లీడర్ షిప్ క్వాలిటీలో అవలక్షణాలు విస్పష్టంగా కనిపించే నాయకులకు ఈ అద్దె వ్యూహాలు ఎప్పుడూ నిత్యావరసరమే! అందుకే రాష్ట్ర రాష్ట్ర రాజకీయాల్లో బీహార్ కంటే దారుణ పరిస్థితిని చూడాల్సి వస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీలో రాక్షస కాండను తలపించేలా రాజకీయాలు కనిపిస్తున్నాయి. పవన్ ను పేర్నినాని, పోసాని తిట్టిపోసిన నాటి నుంచి మొన్న టీడీపీ కేంద్ర కార్యాయలంపై ప్రేరేపిత ముష్కర్ల దాడి వరకు రాష్ట్రంలో జరిగింది.. ఇకమీదట జరిగేది కూడా అద్దె వ్యూహాత్మక రాజకీయాలే. తత్ఫలితంగా కుల, మతాల విద్వేషాలు అజ్యం పోసుకుని మరి రాష్ట్రాన్ని రావణకాష్టంలా తగలపెడుతున్నాయి.
ఉత్తుత్తి వ్యూ (ఊ)హకర్త పాచికలు ఏపీలో పారతాయా?
రాజకీయ అవసరతలను అవకాశంగా మల్చుకుని .. కులం కార్డులను వాడి, మతం బోర్డును చూపి ముందుకు సాగే వ్యూహకర్తల ఉత్తుత్తి ఊహలు ఇక ఏపీలో పారవని చెప్పవచ్చు. ఎన్నికలు ఏడాది ఉండగా .. సోషల్ మీడియా, మీడియా రాసే వార్తలను టీమ్ ఏర్పాటు చేసుకుని పరిస్థితులను నిశితంగా పరిశీలించి, గెలుపు ఎవరివైపు ఉంటే వారిపై దూకే బీహార్ కిషోరం.. మీరు ఇక కుల రాజకీయాలు మానితే మంచిదంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. ఉత్తర కుమారులకు వ్యూహక(ర్మ)ర్తలు అవసరం తప్పని సరే కానీ .. దార్శినికులకు అవసరం లేదని మోదీ, నితీష్ ఎప్పుడో తేల్చి చెప్పారు కూడా. మహా సముద్రంలో మునిగిన మెట్రిక్ టన్నుల బరువున్న ఓడలను సైతం పైకిలేపే జాకీలను తీసుకొచ్చినా.. ప్రజాస్వామ్యంలో పతాకస్థాయిలో పడిపోయిన కొందరి పొలిటికల్ గ్రాఫ్స్ ను మాత్రం ఒక జీవిత కాలం మొత్తంగా ట్రై చేసినా పైకి తీసుకురావడం సాధ్యం కాదన్న సత్యాన్ని ఆ మేటి వ్యూహకర్త తెలుసుకుంటే మంచిదన్న వాస్తవ ప్రచారం లేకపోలేదు. చేతలు, మాటలు అద్దెకు తెచ్చుకుని ప్రజాస్వామ్యాన్ని ప్రయోగశాలగా మార్చిన ప్రస్తుత అధికార పార్టీకీ సహస్ర శిరస్సులు తోడుగా నిలబడ్డా ఖండనే తప్ప అధికార అవకాశం ఇకమీదట ఉండదు అన్నది తేటతెల్లం.
గీతోపదేశ సారాన్ని ప్రతిపక్షాలు విస్మరిస్తే ఏలా?
గీతాచార్యుడు గీతోపదేశంలో అర్జుడుకి జీవిత పరమార్థాన్ని బోధిస్తాడు. ‘‘అర్జునా.. కౌరవులు ఎప్పుడో చచ్చారు .. నీవద్దనున్న దివ్యాస్త్రాలను కూడా ప్రయోగించాల్సిన పనిలేదు. సాధారణ బాణాలేసినా వారు చస్తారు. ఎందుకంటే ధర్మం నిలపెట్టాల్సిన స్థానంలో ఉండి .. వ్యవస్థలో అధర్మాన్ని పెంచి పోషించారు. వారికి ఈ భూమి మీద నూకలు ఎప్పుడో చెల్లాయి. ఇప్పుడు నీవు చంపకున్నా సరిగ్గా 18 రోజుల్లో వీరందరూ పరలోకానికి పలయనం చిత్తగించాల్సిందే. వారిని మరణం నుంచి భీష్ముడు, కర్ణుడు, చతురంగ బలగాలు కూడా రక్షించలేవు’’ అని అంటాడు కృష్ణభగవానుడు. నిజమే ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతుంది, ప్రత్యక్షంగా కనిపిస్తోంది కూడా ఇదే. దివంగత నేత పొలిటికల్ ట్యాగ్ లైన్, జైలు జీవితం, ప్రతిపక్షపాత్ర, పాదయాత్రలతో ప్రజాస్వామ్య పద్దతిలో అధికార పీఠాన్ని చేజిక్కించుకున్న ముఖ్యమంత్రి జగన్ .. ఆ అధికారాన్ని కట్టబెట్టిన ప్రజలకు మొహం చూపించుకోలేని పరిస్థితికి దిగజారారు. ప్రజల్లో జగన్ పై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఏర్పర్చుకున్న నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. రోజురోజుకు జగన్ తలచిన ప్రజారంజ పాలన కాస్తా .. పరిణామ క్రమంలో కంటక పాలనగా ప్రజలకు దాపురించిందని అనేక సర్వేలు, రాజకీయ, మేధావి వర్గాల నుంచి వస్తున్న విమర్శలు. నేటికి ఈ విషయాల్లో అధికార పార్టీకి చలనం లేదు… అన్నదే అతిశయోక్తి! దీని మూలంగా ప్రతిపక్షాలు ప్రత్యేకించి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకోవాలని పనిలేకుండా పోయింది. చిన్నపాటి రాజకీయ పరిజ్ఞానంతో ప్రభుత్వ వైఫల్యాలను స్ట్రాటజిక్ గా ఏకరవు పెడితే చాలు .. చచ్చి చెడున్న అచేతనావస్థ సూనామీలో కొట్టుకుపోయినట్లు కొట్టుకుపోతుంది. ఎందుకంటే ప్రభుత్వ పాలనలో జీవం లేదు కాబట్టి.
ప్రజాస్వామ్యంలో ప్రజాభిష్టానికి పాతరేస్తే ఎలా?
ప్రజాస్వామ్యంలో ప్రజాభిష్టం మేరకే విధాన పరంగా నిర్ణాయాత్మక ఆలోచనలతో పాలన ముందుకు సాగించాలి. ఈ ఆలోచన ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విస్మరించే మొదటి అంశం కూడా ఇదే. తమ పార్టీకి మైలేజ్ వచ్చే పథకాలు, వ్యక్తగత ఆలోచనలతో పుట్టుకొచ్చిన పథకాలకు అధిక ప్రయారిటీ ఇచ్చే అధికార పార్టీలు ఎన్నడూ ప్రజలకు కావల్సిందేంటి?, పడుతున్న ఇబ్బందులు, సమస్యలేమిటి? అన్న కనీస సౌకర్యాల సంగతి పట్టదన్నది వాస్తవం. ఎన్నికల ముందు సర్వేలకు కోట్లు తగలేసి, మాటలను, చేతలను చివరకు మేనిఫెస్టోను అద్దెకు తెచ్చుకుని రాజకీయాలు చేసినంత కాలం అధికారంలో ఏ పార్టీ వచ్చినా ప్రత్యేకించి ప్రజలకు ఒరిగేదేమి లేదు. ప్రాంతాభివృద్ధి, సామాజికాభివృద్ధి, విద్య-ఉపాధి, వ్యక్తిత్వ వికాశోన్నతి అన్నవి వీరి పాలనలో వక్రభాష్యలుగా అర్థం చేసుకోక తప్పదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలకు నవరత్నాలు పంచుతూ.. సంక్షేమాన్ని సమగ్రంగా అందిస్తున్నాన్న భావనలో ఉన్నాడు. పథకాల అమలు తీరు, వ్యయప్రయాసల వెచ్చింపులు ప్రజాభిష్టానికి పూర్తి భిన్నంగా సాగుతోందని ఆరోపణలు లేకపోలేదు. తద్వారా ప్రజాధనం ఒక రేంజ్ లో ద్వంసం అవుతోంది అన్న కటిక వాస్తవాలను ప్రజలు గమనిస్తునే ఉన్నారు. ఇలా ఇష్టారాజ్యంగా ప్రజాస్వామ్యానికి అడుగడుగునా పాతరేస్తుంటే చూస్తూ ఊరుకోరు .. తిరగబడతారన్న ఇంగితం చరిత్ర మనకు చెప్పలేదా? అందుకే కాబోలు ఎన్నికలకు రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ .. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి ‘పీకే’ సర్వేలు ప్రారంభించుకోవల్సి వచ్చిందని వార్తల్లో చూశాం.
రాజ్యంగ విలువలకు కట్టుబడి పాలన సాగాలి!
పీకే సర్వేలు, కోటాను కోట్ల ఖర్చు చేసి, పంచేసి ఎన్నికల్లో గెలవాలి అనుకున్న ఏ రాజకీయ పార్టీకైనా .. నిత్యం ప్రజల నుంచి ఛీత్కాకాలు, న్యాయస్థానాల చీదరింపులు, చివాట్లే తప్పక వేరొకటి ఎదరవ్వవు. ఇదే ఏపీలో సాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన, అధ్వాన రాజకీయాలు. ఇటువంటి రాజకీయాలతో సాధించేది ఏమీ లేదని, దివంగత నేత చేసిన ఆ కాస్తా మంచిని .. అనాలోచిత నిర్ణయాలతో జగన్ కావాలనే చేజేతులారా చెరుపుకుంటున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. ఏపీ పాలన రాజ్యంగ విలువలకు కట్టుబడి సాగుతుందా? అంటే లేదు అన్న వాదనలే ఉదాహరణలతో తెరపైకి వస్తున్నాయి. అవి కూడా సాక్ష్యాలతో న్యాయస్థానాల్లో రుజువవుతున్నాయి కూడా. అద్దె మాటలతో నిత్యం రెచ్చగొట్టే రచ్చ ప్రసంగాలు, కులాల కుంపట్లు పెట్టి విద్వేషాలను రాజేసేలా విమర్శలు మానుకోకుంటే భవిష్యత్తులో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తప్పదన్న హెచ్చరికలు లేకపోలేదు. వ్యూ (ఊ)హకర్త చెప్పే గుడ్డెద్దు పొకడలు కారణంగా కుల, మత విద్వేశాలు పేట్రేగిపోతున్నాయి. విద్యా, విజ్ఞానిక, సాంకేతికం రంగాల్లో శరవేగంగా ముందుకుపోతున్నా ఈ కాలం కూడా కులం, మతం, వర్గ- విభేదాలు, సామాజిక అసమానతలు, అంటరానితనం వంటి అనాగరిక చర్యలు ఇంకా మన దేశం రాజ్యమేలుతున్నాయి. వీటికి సజీవ సాక్ష్యాలే ఏపీలో ఈ మధ్య రాజుకున్న కుల విద్వేషాల రాజకీయాలు. నరనరాల్లో నిబిడికృతమయ్యి ఉన్న కుల వివక్ష దావాలనంలా మారి దహించి వేస్తున్నాయి. ఒకరేమో పవన్ ను టార్గెట్ చేసి.. పెయిడ్ ఆర్టిస్ట్ తో మరోక ఖరీదైన పెయిడ్ ఆర్టిస్టును పురికొల్పి తిట్టిస్తారు. కమ్మ,రెడ్డి, కాపులు అంటూ కుల ప్రస్తావన లేవనెత్తి, కుల విద్వేషాలను అత్యంత అద్భుతంగా రాజేసి రెచ్చగొట్టేలా దూషణలకు దిగుతున్నారు. ఎప్పటికైనా ప్రజలకు కావాల్సిందెంటో గ్రాస్ రూట్ లో తెలుసుకుని అది రాష్ట్రంలోని ప్రతి చివరింటికీ చేరెలా చేస్తేనే ఏ నాయకుడైనా చిరస్థాయిగా నిలుస్తాడన్నది అక్షర సత్యం.
Must Read ;- భాషలో తగ్గేదెలే!.. టీడీపీ అల్టీమేటం!