ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా స్థాపించబడిన తెలంగాణ రాష్ట్ర సమితి.. తన లక్ష్యాన్ని సాధించింది. తెలుగు నేలను రెండు రాష్ట్రాలుగా విడదీసేసి.. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా సాధించుకుని తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసుకుంది. ఫలితంగా 2014 ఎన్నికల్లో తెలంగాణలో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీఆర్ఎస్ కొత్త రాష్ట్రంతో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత వరుసగా రెండో సారి కూడా అధికార పగ్గాలను చేపట్టి రికార్డు సృష్టించింది. ప్రజలు కట్టబెట్టిన అధికారంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత సంక్షేమంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా సరికొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ సత్తా చాటుతున్నారు. సోమవారం నాడు పార్టీ 20 ఏళ్ల పండుగను ఘనంగా నిర్వహిస్తున్న కేసీఆర్.. పార్టీకి వరుసగా తొమ్మిదో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశానికే తెలంగాణ ఆదర్శం
పార్టీకి మరోమారు ఏకగ్రీవంగానే అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత కేసీఆర్ తనదైన శైలి ప్రసంగం చేశారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరే ఇతర రాష్ట్రాల్లోనూ లేవని కూడా కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రంగాల్లోనూ తెలంగాణ వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తోందని కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా దళిత బంధు పథకాన్ని ఆయన ప్రస్తావించారు. దళిత బంధును చూసిన ఇతర రాష్ట్రాల ప్రజలు తమ రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు కావాలని కోరుతున్నారని కేసీఆర్ చెప్పారు. ఈ సందర్భంగా ఏపీని ప్రస్తావించిన కేసీఆర్.. దళితబంధు పెట్టిన తర్వాత ఏపీ నుంచి వేలాది విన్నపాలు వస్తున్నాయని.. ఆంధ్రాలో కూడా పార్టీని పెట్టండి, గెలిపించుకుంటామని అంటున్నారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలు కావాలని ఆంధ్ర ప్రజలు కోరుతున్నారని చెప్పారు. ఉత్తరాంధ్రకు చెందిన వేలాది మంది కూలీలు తెలంగాణకు వచ్చి పని చేస్తున్నారన్నారు. తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలనే డిమాండ్లు పక్క రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయని కేసీఆర్ చెప్పారు. నాందేడ్, రాయచూర్ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు వచ్చాయని తెలిపారు. మనం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. దేశ విదేశాల్లో కూడా తెలంగాణ ప్రతిష్ట ఇనుమడిస్తోందని అన్నారు.