ఏపీలో సీఎం జగన్ పాలన రెండున్నరేళ్లు పూర్తి చేసుకుంది. ఈ రెండున్నరేళ్ల కాలంలోనే జగన్ పాలనపై జనంలో విపరీతమైన వ్యతిరేకత మొదలైపోయింది. ఆ వ్యతిరేకత మాట నిజమేనన్నట్లుగా వైసీపీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. అలా వైసీపీని వీడిన వాళ్లంతా విపక్ష టీడీపీలో చేరిపోతున్నారు. ఈ తరహా పరిణాలు దాదాపుగా అన్ని జిల్లాల్లో చోటుచేసుకుంటున్నా.. గురువారం నాడు మంగళగిరి పరిధిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం కేంద్రంగా ఓ కీలక ఘటన చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవకర్గ పరిధిలోని పామూరుకు చెందిన వైసీపీ కీలక నేత బి.మాల్యాద్రి చౌదరి (బీఎంసీ) తన అనుచర వర్గంతో టీడీపీలో చేరిపోయారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. కనిగిరి టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, బాలవీరాంజనేయ స్వామి, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, కందుల నారాయణ రెడ్డి, ముత్తమల అశోక్ రెడ్డిలు తరలిరాగా.. వంద కార్లతో ప్రకాశం జిల్లా నుంచి బయలుదేరిన బీఎంసీ అనుచరులు అమరావతి చేరుకుని ఆ వెంటనే టీడీపీలో చేరిపోయారు.
ఆ ఇద్దరితో రెడ్ల మంతనాలు
ప్రకాశం జిల్లా విపక్ష టీడీపీకి కంచుకోట కిందే లెక్క. వైసీపీ అధినేత జగన్ బాబాయి వైవీ సుబ్బారెడ్డి, మామ బాలినేని శ్రీనివాసరెడ్డిలు ఈ జిల్లాకు చెందినా.. మొన్నటి ఎన్నికల్లో జిల్లాలోని మొత్తం 12 అసెంబ్లీ స్థానాల్లో నాలుగు సీట్లను టీడీపీ చేజిక్కించుకోవడమే ఇందుకు నిదర్శనం. జిల్లాలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ఉగ్రనరసింహారెడ్డి, ముత్తమల అశోక్ రెడ్డిలు ఓటమిపాలైనా.. జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా తమతైన శైలి చర్యలు ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో వైసీపీకి చెందిన అసంతృప్త నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ఉగ్ర, ముత్తమల.. టీడీపీలోకి ఆయా నేతలను రప్పించే దిశగా మంతనాలు సాగిస్తున్నారు. ఈ మంతనాలు ఫలిస్తున్నాయి కూడా. ఇందులో భాగంగానే కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పామూరుకు చెందిన వైసీపీ కీలక నేత బి.మాల్యాద్రి చౌదరి తన అనుచర వర్గంతో కలిసి గురువారం నాడు టీడీపీలో చేరిపోయారు. చూడ్డానికి మాల్యాద్రి ఓ చోటామోటా నేతగానే కనిపించినా.. తనతో పాటు ఏకంగా 500 మంది వైసీపీ నేతలను టీడీపీలోకి తీసుకొచ్చారంటే.. ఆయన స్థాయి ఏమిటో ఇట్టే అర్థం కాక మానదు. అంతేకాకుండా బీఎంసీ టీడీపీలో చేరిన కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించింది.
అసంతృప్తిలో కీలక రెడ్లు
ప్రకాశం జిల్లాకు చెందిన రెండు ఎంపీ సీట్లను కూడా మొన్నటి ఎన్నికల్లో వైసీపీనే గెలుచుకుంది. ఒంగోలు నుంచి సీనియర్ రాజకీయవేత్త మాగుంట శ్రీనివాసులు రెడ్డి, నెల్లూరు (ఈ నియోజకవర్గ పరిధిలో ప్రకాశం జిల్లాకు చెందిన అసెంబ్లీ సెగ్మెంట్లూ ఉన్నాయి) నుంచి ఆదాల ప్రభాకరరెడ్డి విజయం సాధించారు. మాగుంటతో పాటుగా ఆదాల కూడా సీనియర్ రాజకీయవేత్తే. అయితే వీరిద్దరికీ లోక్ సభలో పార్టీ నుంచి ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు. పార్లమెంటరీ పార్టీ ఉప నేతగా యువ నేత మార్గాని భరత్ (రాజమహేంద్రవరం ఎంపీ), ప్యానెల్ స్పీకర్ గా పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి (రాజంపేట ఎంపీ)లను ఎంపిక చేసిన జగన్.. మాగుంట, ఆదాలను అసలు పట్టించుకోలేదనే చెప్పాలి. ఇక జగన్ సర్కారు అవలంబించిన మద్యం పాలసీ కారణంగా మాగుంట తన డిస్టిలరీలన్నింటినీ మూసేసుకోవాల్సి వచ్చింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వెళితే.. తన పరిస్థితి మరింత మెరుగవుతుందని ఆశించిన మాగుంటకు రాజకీయంగా ప్రాధాన్యం దక్కకపోవడంతో పాటుగా ఆయన వ్యాపారం కూడా భారీగానే దెబ్బ తినిపోయింది. దీంతో మాగుంట ఇప్పుడు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఆదాల పరిస్థితి కూడా ఇందుకేమీ భిన్నంగా లేదు. ఇక జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కందుకూరు నుంచి గెలుపొందిన మానుగుంట మహీధర రెడ్డి, మార్కాపురం నుంచి కుందూరు నాగార్జున రెడ్డిలు కూడా అసంతృప్తిలోనే ఉన్నారు. వైఎస్సార్ హయాంలో మంత్రిగా వ్యవహరించిన మహీధర్ రెడ్డికి జగన్ ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు. దీంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలంతా వైసీపీ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారనే చెప్పాలి. వీరంతా ఉగ్ర, ముత్తమలలతో భేటీకి ఎదురు చూస్తున్నట్లుగా సమాచారం. ఇదే జరిగితే.. అతి త్వరలోనే జిల్లాలోని రెడ్డి సామాజిక వర్గం నేతలంతా వైసీపీని వీడి టీడీపీలో చేరిపోవడం ఖాయమనే చెప్పాలి.
Must Read ;- ‘ఆత్మ సాక్షి’గా వైసీపీ గల్లంతే!