ఏపీలో ఇప్పుడు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడినా.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అప్పుల గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పరిమితికి మించి అప్పులు చేసిన జగన్ సర్కారు.. కొత్తగా అప్పుల కోసం నానా పాట్లు పడుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సకల విన్యాసాలు ప్రదర్శించిన జగన్ సర్కారు.. తాజాగా కేంద్రం పెట్టిన నిబంధనల అమలు కోసం ఏకంగా కేంద్ర ప్రభుత్వాన్నే తనఖా పెట్టే యత్నం చేసింది. ఇప్పటికే మద్యంపై 20 ఏళ్ల వరకూ వచ్చే ఆదాయాన్ని ష్యూరిటీగా పెట్టేసిన జగన్ సర్కారు.. రూ.50 వేల కోట్ట మేర అప్పులు చేసింది. తాజాగా మునిసిపాలిటీల్లో పెంచిన పన్నులను కూడా ష్యూరిటీగా పెట్టేసి.. ఆ మేర అప్పులు తీసుకున్నదన్న ఆరోపణలూ కలకలం రేపుతున్నాయి. రాష్ట్రం పరిధిలోని అన్ని రకాల ఆదాయాలను కుదువ పెట్టేసి మరీ అప్పులు తెచ్చేసిన జగన్ సర్కారుకు.. ఇక కొత్త అప్పుల కోసం తనఖా పెట్టేందుకు రాష్ట్రంలో ఏదీ మిగల్లేదు. ఈ నేపథ్యంలో కేంద్రం విడుదల చేసే గ్రాంట్లను కూడా కుదువ పెట్టేసి అప్పులు తెచ్చేందుకు బరి తెగించిన వైనం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఈ కథ విచిత్రమైనదే
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఇతరత్రా పథకాలను ఆయా రాష్ట్రాలే అమలు చేయాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే కదా. అయితే కేంద్ర ప్రాయోజిత పథకానికి కేంద్రం నుంచి సగం మేర నిధులు రాష్ట్రాలకు విడుదలైతే.. మిగిలిన సగాన్ని ఆయా రాష్ట్రాలే జమ చేసి మొత్తం నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇలా కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి మోదీ సర్కారు నుంచి ఏపీకి రూ.26 వేల కోట్లు రాగా.. వాటికి తమ వంతుగా జమ చేయాల్సిన నిధులను జగన్ సర్కారు జమ చేయకపోగా.. కేంద్రం పంపిన నిధులను దారి మళ్లించేసింది. కేంద్రం నిధులను తన పథకాలకు వాడేసుకుంది. చాలా ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన కేంద్రం.. తాము విడుదల చేసిన నిధులతో పాటుగా మీరు జమ చేయాల్సిన నిధులను తక్షణమే ప్రత్యేక ఖాతాలను తెరిచి జమ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అసలే ఏపీ అప్పుల్లో కూరుకుపోతున్న వైనంపై కేంద్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ఆదేశాలను పాటించకపోతే ఇబ్బంది వస్తుందని జగన్ సర్కారు భయపడింది. వెంటనే తాము ఖర్చు చేసిన కేంద్రం నిధులతో పాటు తమ వాటా నిధులను అప్పుగా ఇవ్వాలంటూ బ్యాంకులను ఆశ్రయించిందట. మరి ష్యూరిటీ మాటేమిటంటే.. కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులనే ష్యూరిటీగా పెట్టుకోమని జగన్ సర్కారు చెప్పడంతో బ్యాంకులు ఖంగు తిన్నాయట. ఇలా కేంద్రం నిధులను ష్యూరిటీగా పెట్టుకుని అప్పులు ఇచ్చే స్తోమత తమకు లేదని, తాము ఈ విషయంలో ఎలాంటి సహకారం అందించలేమని బ్యాంకులు జగన్ సర్కారు ముఖం మీదే చెప్పేశాయట.
బుగ్గన చిర్రుబుర్రులు
ఓ వైపు కేంద్రం తాను విడుదల చేసిన నిధులతో పాటు మీ వాటా నిధులను కూడా ఖాతాల్లో చూపించాల్సందేనంటూ హుకుం జారీ చేయడం, అప్పుల కోసం వెళితే బ్యాంకులు చేతులెత్తేయడంతో జగన్ సర్కారుకు ఏమీ చేయాలో పాలుపోవడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. తనదైన శైలిలో మాయలు చేసి ఇసుక ఆదాయం, మద్యం అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని చూపితే అప్పు ఇచ్చారు కదా.. ఇప్పుడు కేంద్రం ఇచ్చే నిధులను తనఖా పెట్టుకుని అప్పు ఇవ్వమంటే ఎందుకు ఇవ్వరంటూ జగన్ సర్కారులోని పెద్దలు నొసలు చిట్లిస్తున్నారట. ఈ విషయంలో బ్యాంకుల తీరుపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ రెడ్డి అయితే గుర్రుగా ఉన్నారట. ఎప్పుడో వచ్చే ఆదాయాన్ని చూసి అప్పులిచ్చినప్పుడు.. ఏటా రెగ్యులర్‌గా కేంద్రం నుంచి విడుదలయ్యే నిధులను తనఖా పెట్టుకోమంటే ఎందుకు పెట్టుకోరు? అంటూ బుగ్గన బ్యాంకులపై చిర్రుబుర్రులాడుతున్నారట.
Must Read ;- బుగ్గన వచ్చారు.. బుర్ర కథలు తెచ్చారు