A Woman Was Gang Raped In Guntur District :
వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా కూడా.. నవ్యాంధ్రప్రదేశ్ ఇప్పుడు అత్యాచారాంధ్రపదేశ్ గా మారిపోయిందని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే.. దిశ చట్టం అమలు చేస్తున్నామని జగన్ సర్కారు చెబుతున్నా.. ఏపీలో మహిళలు, యువతులు, చివరకు చిన్నారి బాలికలపై కూడా అఘాయిత్యాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. వీటిని అడ్డుకోవడం మాట అటుంచితే.. దారుణాలకు పాల్పడ్డ వారు నిశ్చింతగానే జైలు బయటకు వచ్చేసి.. యథావిధిగా తమ పనులు చేసుకుపోతున్నారు. మరోవైపు అత్యాచార బాధితుల పరామర్శకు వెళుతున్న విపక్ష నేతలను మాత్రం జగన్ సర్కారు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న వైనం కూడా విమర్శలకు దారి తీస్తోంది. మహిళలపై లైంగిక వేధింపులు జరిగితే.. తక్షణమే స్పందిస్తున్నామని చెబుతున్న పోలీసులు.. దిశ చట్టం మేరకు నిందితులపై కఠిన శిక్షలు పడేలా చేయడంలో మాత్రం విఫలం అవుతున్న వైనంపైనా విమర్శల జడివాన కురుస్తోంది.
భర్తను కొట్టి.. భార్యపై గ్యాంగ్ రేప్
మహిళలపై అంతకంతకూ పెరుగుతున్న దారుణాలను అరికట్టాలంటూ ఓ వైపు విపక్ష టీడీపీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుంటే.. విపక్ష నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడంతో పాటుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో గుంటూరు జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని మేడికొండూరు సమీపంలో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ఏపీలో కలకలం రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. సత్తెనపల్లి మండలానికి చెందిన దంపతులు బుధవారం గుంటూరులో జరిగిన ఓ వివాహానికి హాజరై బైక్ తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో వీరిని మేడికొండూరు సమంలో అడ్డగించిన దుండగులు.. భర్తను తీవ్రంగా కొట్టి భార్యను సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఫిర్యాదూ తీసుకోలేదే
ఈ దారుణానికి పాల్పడ్డ దుండగులు అక్కడి నుంచి వెళ్లిపోయాక.. బాధితులు ఎలాగోలా సత్తెనపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. అక్కడి పోలీసులు వారి నుంచి ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరించారట. ఘటన జరిగిన ప్రదేశం గుంటూరు అర్బన్ ఎస్పీ పరిధిలోకి వస్తుందని, తమ పోలీస్ స్టేషన్ గుంటూరు రూరల్ ఎస్పీ పరిధిలో ఉందని అక్కడి పోలీసులు తెలిపారట. మహిళలపై అత్యాచారాల విషయంలో ఘటన ఎక్కడ జరిగిందన్న దానితో సంబంధం లేకుండా జీరో ఎఫ్ఐఆర్ కింద బాధితుల నుంచి ముందుగా ఫిర్యాదు తీసుకుని ఆ తర్వాత సంబంధిత పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేయాలని నిబంధనలు చెబుతున్నా.. సత్తెనపల్లి పోలీసులు ఫిర్యాదు తీసుకోని వైనం కూడా ఇప్పుడు పెను కలకలమే రేపుతోంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ.. ఎట్టకేలకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సత్తెనపల్లి పొరుగు నియోజకవర్గం నరసరావుపేటలో కొన్నాళ్ల క్రితం ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని అనూష కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గురువారం బయలుదేరడానికి ముందు రోజు రాత్రి ఈ ఘటన జరగడం కలకం రేపుతోంది.
ఘటనను ఖండించిన లోకేశ్
నరసరావుపేటలో అనూష కుటుంబాన్ని పమార్శించేందుకు బయలుదేరిన నారా లోకేశ్ మేడికొండూరు గ్యాంగ్ రేప్ ఘటనను తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్ అఘాయిత్యాలకు అడ్రస్ గా మారిందని లోకేశ్ విమర్శించారు. బైక్ పై వెళ్తున్న జంటపై దాడి చేసి, మహిళపై అమానుషానికి పాల్పడటం బాధాకరమని అన్నారు. ఫిర్యాదు చేయడానికి బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్తే.. అది తమ పరిధిలోకి రాదని పోలీసులు చెప్పడం దారుణమని మండిపడ్డారు. మహిళలపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదని అన్నారు. పరామర్శకు తాను వెళ్తుంటే మాత్రం వేలాది మంది పోలీసులను రంగంలోకి దించారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను కక్షసాధింపులకు ఉపయోగించుకుంటోందని.. అందువల్లే ఇలాంటి దారుణాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Must Read ;- బరితెగింపు.. లోకేశ్ పై మ్యాన్ హ్యాండ్లింగ్