ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో ఏపీకి కొత్త సీఎస్‌గా ఎవరికి అవకాశం దొరుకుతుంది? అన్న అంశంపై ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేసింది. సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు అర్హత కలిగిన అధికారుల జాబితా పెద్దగానే ఉన్నా.. ఒకరిద్దరికి మాత్రమే అవకాశాలు దక్కనున్నాయన్న వాదనలు కూడ అమితాసక్తి రేకెత్తిస్తోంది. ఆ ఒకరిద్దరిలో కూడా వైఎస్సార్ హయాంలో వెలుగు చూసిన గనుల కుంభకోణంలో ఏకంగా జైలు జీవితం గడిపి తన కెరీర్ నే ప్రమాదంలోకి నెట్టేసుకున్న మహిళా ఐఏఎస్ వై.శ్రీలక్ష్మికి పదవి దక్కే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటూ కొత్త విశ్లేషణలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా నెల రోజుల తర్వాత కొత్త సీఎస్‌గా పదవీ బాధ్యతలు ఎవరికి దఖలు పడతాయన్న దానిపై చర్చోపచర్చలు మొదలయ్యాయి.
సాహ్నీ భర్తకు ఛాన్స్ దక్కేనా?
దాస్ కంటే ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం ఏపీ ఎన్నికల కమిషనర్‌గా పనిచేస్తున్న నీలం సాహ్నీ భర్త అజయ్ సాహ్నీ.. ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. 1984 బ్యాచ్ కు చెందిన అజయ్ ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. నీలం మాదిరే.. సీఎస్ పోస్టిస్తామంటే మరోమారు రాష్ట్ర సర్వీసులకు వచ్చేందుకు ఆయన సుముఖంగానే ఉన్నారు. అజయ్ తర్వాతి ప్లేసులో 1985 బ్యాచ్ కు చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం, సమీర్ శర్మలున్నా.. వీరి పట్ల జగన్ అంతగా ఆసక్తి చూపడం లేదు. ఇక 1986 బ్యాచ్ కు చెందిన సతీష్ చంద్ర కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే చంద్రబాబు సీఎంగా ఉండగా.. కీలకంగా వ్యవహరించారన్న భావనతో జగన్ ఈయనను చాలా కాలం పక్కనపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత సతీష్ కు కీలక పోస్టింగ్ ఇచ్చిన జగన్ అందరినీ ఆశ్చర్యంలో ముంచేశారు. అంటే.. సతీష్ పై ఉన్న వ్యతిరేక భావనను జగన్ తొలగించుకున్నట్టే కదా. విధి నిర్వహణలో సత్తా కలిగిన అధికారిగా పేరున్న సతీష్ కు సీఎస్ గా అవకాశం ఇస్తే.. జగన్ ఓ రేంజి మైలేజీని దక్కించుకుంటారని చెప్పాలి.
జవహర్‌కే చాన్సులెక్కువ
సతీష్ చంద్ర తర్వాత స్థానాల్లో 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నీరబ్ కుమార్ ప్రసాద్, 1988 బ్యాచ్ కు చెందిన వై. శ్రీలక్ష్మి, పూనం మాలకొండయ్యలతో పాటు 1990 బ్యాచ్ కు చెందిన జవహర్ రెడ్డి ఉన్నారు. జాబితాలో తొలి స్థానంలోని అజయ్ సాహ్నికి జగన్ ఓకే చెబితే సరేసరి.. లేదంటే జగన్ చూపు జవహర్ రెడ్డిపైనే ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జవహర్ రెడ్డిని కూడా కాదనుకుని తాను పట్టుబట్టి మరీ తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్ కు రప్పించుకున్న వై.శ్రీలక్ష్మికి గనుక జగన్ అవకాశం ఇస్తే.. అది ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలన వార్తగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే.. జగన్ కేసుల మాదిరే బళ్లారి అక్రమ మైనింగ్ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీలక్ష్మి చాలా కాలం పాటు జైల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. జగన్, సాయిరెడ్డిలకు త్వరగానే బెయిల్ దక్కినా.. శ్రీలక్ష్మి మాత్రం బెయిల్ కోసం చాలా కాలం పాటు వేచి చూడాల్సి వచ్చింది. భర్త సీనియర్ ఐపీఎస్ అధికారి అయినా కూడా శ్రీలక్ష్మీ కటకటాల్లోనే మగ్గిపోయారు. చివరకు తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురైన ఆమెకు కోర్టు మానవతా దృక్పథంతోనే బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత జగన్ ఏపీకి సీఎం అయిన వెంటనే.. ఆయనతో శ్రీలక్ష్మి భేటీ కావడం, ఆమెను ఏపీ కేడర్ కు తీసుకునేందుకు జగన్ ఆసక్తి చూపడం, అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఓకే అనడం.. ఏడాది తర్వాత అయినా కేంద్రం కూడా ఓకే అనడం అలా వరుసగా జరిగిపోయాయి. ఇప్పుడు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి ఏపీ కేడర్ కు వచ్చీ రాగానే రెండు సార్లు ప్రమోషన్లు దక్కాయి. ఈ పరిణామ క్రమాన్ని జాగ్రత్తగా గమనిస్తే.. జగన్ ఛాయిస్ శ్రీలక్ష్మే అయితే మాత్రం ఆ రచ్చ మామూలుగా ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్ ఆఫర్ ను ఈ టాప్ కాప్ రిజెక్ట్ చేశారా?