నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిని పురిట్లోనే చంపేస్తూ జగన్ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానుల ప్రతిపాదనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఎప్పుడో తన అభిప్రాయాన్ని చెప్పేశారు. మూడు రాజధానుల ప్రతిపాదనకు తనతో పాటు తన పార్టీ కూడా వ్యతిరేకమేనని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగానే చెప్పేశారు. అంతేకాకుండా శాసనమండలిలో తన పార్టీ సభ్యుల చేత మూడు రాజధానుల బిల్లును తిప్పి పంపేలా చేశారు. ఇక అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రాజధాని రైతులు చేస్తున్న దీక్షలకు కూడా చంద్రబాబు కుటుంబ సమేతంగా మద్దతు పలికారు. వెరసి మూడు రాజధానుల ప్రతిపాదనపై చంద్రబాబు ఎప్పుడో తన నిర్ణయాన్ని చెప్పినట్టే లెక్క. అయితే ఈ విషయం వైసీపీ నేతలకు, జగన్ మంత్రులకు గుర్తుందో, లేదో గానీ.. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాత్రం దీనిని మరిచిపోయారనే చెప్పాలి. ఎందుకంటే..పరిపాలనా రాజధానిగా విశాఖపై చంద్రబాబు తన వైఖరిని వెల్లడించాలని తాజాగా సోమవారం డిమాండ్ చేసి తన జ్ఞాపకశక్తిపై తానే సెటైర్లు వేసుకున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కేంద్రం వైఖరితో రచ్చరచ్చ
ఏపీ రాజధానిగా మొన్నటిదాకా అమరావతిని గుర్తించిన కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు.. తాజాగా జగన్ చెప్పినట్టుగానే.. ఇప్పుడు ఏపీ రాజధానిగా విశాఖను గుర్తిస్తున్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ.. ఏపీ రాజధానిగా అమరావతిని కాకుండా విశాఖ పేరును ప్రస్తావించింది. అయితే దీనిపై ఎవరేమన్నారో తెలియదు గానీ.. మూడు రోజులకే ఆ సమాధానాన్ని సవరిస్తూ.. ఏపీకి రెఫరల్ రాజధానిగా మాత్రమే విశాఖను పరిగణించాలని కేంద్రం కోరింది. దీంతో ఏపీలోని అధికార, విపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలంతా అయోమయంలో పడిపోయారు. కేంద్రం వైఖరి ఎవరికి అనుకూలంగా ఉందోనన్న విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య రచ్చరచ్చ జరుగుతోంది.
అవంతి ఏమంటారంటే..?
ఇలాంటి నేపథ్యంలో అసలు విశాఖ అభివృద్ధి ఎవరి పుణ్యమన్న విషయాన్ని తెర మీదకు తీసొకొచ్చిన టీడీపీ.. ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేసింది. ఈ సవాల్ కు వైసీపీ స్సందించకుండానే.. విశాఖ అభివృద్దిపై చర్చకు తాను సిద్ధంగా లేనని ప్రకటించింది. అయినా కూడా టీడీపీ ప్రజలకు వాస్తవాలు తెలియాలన్న బావనతో పార్టీ కార్యాయంలో సమావేశాన్ని నిర్వహించింది. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి అవంతి శ్రీనివాస్ లైన్ లోకి వచ్చారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసేందుకే తాను మూడు రాజధానుల ప్రతిపాదనను తీసుకొచ్చామని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా తమ ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల ప్రతిపాదనపై చంద్రబాబు తన వైఖరిని చెప్పాలని అవంతి డిమాండ్ చేశారు. అంతేకాకుండా విశాఖను పరిపాలనా రాజధానిగా చేయాలన్న తమ నిర్ణయంపై చంద్రబాబు తన వైఖరిని వెల్లడించాలని కోరారు. మరి ఎప్పుడో తన వైఖరిని చెప్పిన చంద్రబాబును ఇప్పుడు తన వైఖరి చెప్పాలనడం ఏ తరహా రాజకీయమో తెలియడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- కేంద్రం ఆటలా?.. జగన్ ఆడిస్తున్నారా?