గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చాన్నాళ్ల తర్వాత ప్రగతి భవన్ బయట సమావేశం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పేరిట టీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో మంగళవారం మధ్యాహ్నం కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీకి పార్టీ అధినేత హోదాలో స్వయంగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నిన్నటి దాకా హైదరాబాద్ బయట జరిగే పర్యటనలు, ఆ పర్యటనల్లో భాగంగా జరిగే బహిరంగ సభలకు మాత్రమే కేసీఆర్ ప్రగతి భవన్ ను దాటి వచ్చేవారు. ఇవి మినహా అటు ప్రభుత్వ అధికారులతో జరిగే సమావేశాలైనా, పార్టీ సంబంధింత సమావేశాలైనా ప్రగతి భవన్ లోనే నిర్వహిస్తూ వచ్చిన కేసీఆర్.. ప్రగతి భవన్ ను వీడేది లేదన్నట్టుగా సాగారు. అయితే మంగళవారం నాడు పార్టీ సమావేశం పేరిట కేసీఆర్ ప్రగతి భవన్ ను దాటి తెలంగాణ భవన్ కు రావడానికి తామే కారణమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే.. రేవంత్ దెబ్బకు కేసీఆర్ ప్రగతి భవన్ బయటకు వచ్చారన్న మాట.
తెలంగాణ భవన్ కు కేసీఆర్
హుజూరాబాద్ ఉప ఎన్నికను పురస్కరించుకుని ఇప్పటికే పలుమార్లు ప్రగతి భవన్ వేదికగానే సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. పార్టీలోకి చేరిన నేతలను కూడా ప్రగతి భవన్ కే పిలిపించుకుని పార్టీ కండువాలు కప్పారు. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికను టార్గెట్ చేసుకుని ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ యమా స్పీడుతో కదులుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం కూడా ప్రగతి భవన్ లోనే పార్టీ సమావేశాన్ని నిర్వహించిన కేసీఆర్.. మంగళవారం నాడు మాత్రం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేయించారు. ఈ భేటీకి స్వయంగా కేసీఆర్ హాజరు కావడంతో పాటుగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను కూడా ఆహ్వానించారు. ఈ భేటీలో పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటుగా రాష్ట్రంలో దళిత బంధు అమలుపై పార్టీకి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారట. అంతేకాకుండా హుజూరాబాద్ లో విపక్షాలు అనుసరిస్తున్న వ్యూహాలు.. వాటికి విరుగుడుగా పార్టీ ఎలాంటి కార్యక్రమాలను నిర్వహించాలన్న విషయంపైనా కేసీఆర్ కీలక చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం.
సీఎం దత్తత గ్రామంలో రేవంత్
కేసీఆర్ తెలంగాణ భవన్ కు వచ్చిన సమయంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. కేసీఆర్ దత్తత గ్రామమైన మూడు చింతలపల్లెలో గిరిజన, దళిత దీక్షకు దిగారు. హైదరాబాద్ నుంచి భారీ అనుచర గణంతో మూడు చింతలపల్లెకు చేరుకున్న రేవంత్.. అక్కడ 24 గంటల పాటు దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకు పార్టీ కీలక నేతలంతా దాదాపుగా హాజరయ్యారనే చెప్పాలి. అదే సమయంలో భారీగా పార్టీ శ్రేణులు కూడా ఈ దీక్షకు హాజరయ్యాయి. ఈ సందర్భంగా దీక్షకు కూర్చునే ముందు పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్ కీలక ప్రసంగం చేశారు. కేసీఆర్ సర్కారు విధానాలపై తనదైన శైలి విమర్శలు గుప్పించిన రేవంత్.. ప్రగతి భవన్ వేదికగానే కేసీఆర్ సాగిస్తున్న పాలనను తూర్పారబట్టారు. ఏనాడూ ప్రగతి భవన్ ను దాటి బయటకు రాని కేసీఆర్.. ఈనాడు కాంగ్రెస్ కు పెరుగుతున్న జనాదరణకు భయపడి తొలిసారిగా తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వెరసి తమ దెబ్బకు దిమ్మతిరిగిన కేసీఆర్.. ఎట్టకేలకు ప్రగతి భవన్ నుంచి బయటకు రాక తప్పలేదని రేవంత్ తేల్చేశారు. అటు టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు ఇటు రేవంత్ దీక్షలో కాంగ్రస్ చేసిన వ్యాఖ్యలన్నీ కీలకమైనవే అయినా.. కేసీఆర్ ను ప్రగతి భవన్ బయటకు వచ్చేలా చేశామన్న రేవంత్ కామెంట్లు వైరల్ గా మారాయి.
Must Read ;- ఒకే రోజు 500 కోట్లు, ఓ చైర్మన్ గిరీ