ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో హోం మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తున్న మేకతోటి సుచరిత ఇప్పుడు నిజంగానే పీకల్లోతు కష్టాల్లో చిక్కుకున్నారు. ఈ పరిణామం సీఎం జగన్ కు అనుకోకుండానే దొరికిన అస్త్రంగా పరిణమించిందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆమె.. గుంటూరు జిల్లాకు చెందిన ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానం ప్రత్తిపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను క్రిస్టియన్ ను అని ఆమె చెప్పేశారట. ఈ వీడియోను ఆధారం చేసుకుని ఓ సంస్థ ఆమె ఎస్సీ కాదని, ఆమెపై అనర్హత వేటు వేయడంతో పాటుగా ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ సంస్థ నేరుగా జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ కమిషన్.. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టాలంటూ గుంటూరు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా.. ఈ విచారణను వారంలోగా పూర్తి చేసి నివేదిక అందించాలని కూడా ఆ కమిషన్ ఆదేశించిందట. ఈ పరిణామంతో మేకతోటి నిజంగానే చిక్కుల్లో పడ్డారని చెప్పాలి.
జగన్ పట్టింకునే ఛాన్సే లేదు
గుంటూరు కలెక్టర్ విచారణలో ఆరోపణలు నిజమని తేలతాయా? లేదంటే.. ఆరోపణలు అబద్ధమని తేలుతుందా? అన్నది పక్కనపెడితే.. ఈ పరిణామం సీఎం జగనకు అందివచ్చిన అవకాశంగానే విశ్లేషణలు సాగుతున్నాయి. ఎందుకంటే.. త్వరలోనే జగన్ తన మంత్రివర్గంలోని దాదాపుగా అందరు మినిస్టర్లను తొలగించి.. కొత్త వారితో తన కేబినెట్ పునర్వవస్థీకరించే ఏర్పాట్లలో ఉన్నారు. ఇప్పుడున్న మంత్రులను తప్పించడానికి గల కారణాలను చెప్పక తప్పదు. ఇలాంటి నేపథ్యంలో ఏకంగా క్రిస్టియన్ అంటే.. బీసీ సీ కేటగిరికి చెందినవారై ఉండి కూడా ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం నుంచి ఎలా పోటీ చేస్తారన్నది అందరినోటా వినిపిస్తున్న ప్రశ్న. ఒకవేళ విచారణలో మేకతోటి ఎస్సీ కాదని తేలితే.. ఆమె తనకు తానుగానే మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సిందే. అంతేకాకుండా ఆ తర్వాత కూడా చట్టపరంగా శిక్ష కూడా ఎదుర్కోక తప్పదు. ఇదే జరిగితే.. జగన్‌కు అంతకంటే కావాల్సింది ఏముంది? తన ప్రమేయం లేకుండా ఓ మంత్రి తన కేబినెట్ నుంచి బయటకు వెళ్లిపోయినట్లే కదా. అందుకే.. ఈ వ్యవహారంలో జగన్ ఎంతమాత్రం కలగజేసుకోరన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఈ వివాదం నుంచి మేకతోటి ఎలా బయటపడతారో చూడాలి.
Must Read ;- ఏపీ హోం మంత్రి సుచరిత కాదు.. మరెవరు?