వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సాగుతున్న ఏపీ పాలన... అయిన వారికి అకుల్లో, కాని వారికి కంచాల్లో అన్న చందంగా సాగుతోంది. జీ హుజూర్ అనే వారికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్న జగన్.. తన మాటకు సవరణలు చెబుతున్న వారిని మాత్రం శంకరగిరి మాన్యాలకు పంపుతున్నారు. ఏడాదిన్నర పాలనలో ఈ తరహా జగన్ పాలనకు ఎన్నెన్నో ఉదాహరణలు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని చెప్పాలి.
ఎదురు చెపితే..
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తనకు, తన పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న భావనతో సీనియర్ ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగించిన జగన్… సీఎంఓలో తాను నియమించుకున్న కీలక అధికారి ప్రవీణ్ ప్రకాశ్‌కు ఎదురు చెప్పారన్న ఒకే ఒక్క కారణంతో ఎల్వీని సీఎస్ పదవి నుంచి పీకి పారేశారు. అంతేకాకుండా సీఎస్ గా పనిచేసి విధి నిర్వహణలో సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న ఎల్వీని అత్యంత అప్రధాన్య పోస్టు అయిన మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి బదిలీ చేసి… పదవీ విరమణ సమయంలో ఎల్వీని తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారన్న వాదనలు వినిపించాయి.
అనుకూలంగా పని చేస్తే..
ఆ తర్వాత ఎల్వీ ప్లేస్‌లో ఎక్కడో ఢిల్లీలో కేంద్ర సర్వీసుల్లో పని చేస్తున్న మరో సీనియర్ ఐఏఎస్ అధికారిణి నీలం సాహ్నిని ఆగమేఘాలపై రప్పించిన జగన్… ఆమెకు సీఎస్ కుర్చీని అప్పగించారు. ఆ తర్వాత జగన్ చెప్పిన ప్రతి పనికి ముందూ వెనుకా చూసుకోకుండా… ఏకంగా కోర్టుల చేత, ఎన్నికల సంఘం చేత చీవాట్లు తినేందుకు కూడా సిద్ధపడిన సాహ్నికి ఏకంగా ఆరు నెలల పాటు ఎక్స్‌టెన్షన్ ఇప్పించుకున్న జగన్… ఇప్పుడు ఆ పదవీ కాలం కూడా ముగిసిపోయిన నేపథ్యంలో ఆమెను ఏకంగా సీఎం ముఖ్య సలహాదారు పదవిలో నియమించుకున్నారు. సీఎస్‌గా నీలం సాహ్ని పదవీ విరమణ చేసిన మరుక్షణంలోనే ఆమెను తనకు ముఖ్య సలహాదారుగా నియమించుకున్న జగన్.. తనకు అనుకూలంగా పనిచేసే అధికారుల పట్ల ఎంత సానుకూలంగా వ్యవహరిస్తారో ఇట్టే అర్థం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- తాడేపల్లి కోటలోకి.. పాత కేసుల్లోని ‘జగన్ దళం’!
అనుయాయులకు అందలం
ఇక తాను అధికారంలోకి రాగానే… తన తండ్రి హయాంలో తనకు, తన అనుయాయులకు అయిన కాడికి సాయం చేసేసి… అందుకు నిబంధనలను కూడా తుంగలో తొక్కేసి అడ్డంగా బుక్కై జైలుకు వెళ్లి వచ్చిన ఐఏఎస్ శ్రీలక్ష్మిని ఏకంగా తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్‌కు మార్పించుకున్నారు. ఇందు కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుతో ఏడాదిన్నరగా పోరాటం చేసిన జగన్.. ఇటీవలే ఎట్టకేలకు ఆమెను ఏపీ కేడర్‌కు రప్పించుకున్నారు. తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్‌కు వచ్చిన నాలుగైదు రోజుల్లోనే ఆమెకు అత్యంత ప్రాధాన్యం కలిగిన పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టును అప్పగించేసిన జగన్… భవిష్యత్తులో ఆమెకు మరింత మేర కీలక బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. నవరత్నాలకు సంబంధించి ఓ పర్యవేక్షణాధికారి పోస్టును క్రియేట్ చేసి ఆ పోస్టును శ్రీలక్ష్మీకే ఇస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఆయన నిర్ణయాలను ప్రశ్నిస్తే..
ఇక ఆదిలో తనకు అత్యంత విశ్వాసపాత్రుడిగా భావించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్‌కు జగన్ తొలుత కీలక బాధ్యతలే అప్పగించారు. కాలక్రమంలో జగన్ తీసుకుంటున్న పలు వివాదాస్పద నిర్ణయాలను ప్రశ్నించడం, వాటికి సవరణలు చెబుతున్న పీవీ రమేశ్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన జగన్… ఆయన అధికారాలకు కత్తెర వేశారు. అంతే కాకుండా పొమ్మనకుండానే పొగబెట్టిన చందంగా పీవీ రమేశ్‌ను అడుగడుగునా అవమానపరిచేలా వ్యవహరించారన్న వాదనలూ లేకపోలేదు. ఈ క్రమంలో జగన్ మనసును అర్థం చేసుకున్న పీవీ రమేశ్ … తాను పదవి నుంచి వెళ్లిపోతున్నాననంటూ నేరుగా జగన్‌కే సందేశం పంపగా… బెస్ట్ ఆఫ్ లక్ అంటూ జగన్ తిరుగు సందేశం పంపి.. తన ఆలోచనకు వ్యతిరేకంగా పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారు.
వ్యతిరేకులకు అనుకూలురైతే..
ఇక టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు అనుకూలంగా వ్యవహరిస్తారని పేరున్న చాలా మంది ఐఏఎస్ అధికారులకు చాలా కాలంగా పోస్టింగ్‌లు ఇవ్వకుండా వెయిటింగ్‌లోనే పెట్టేసిన జగన్… ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావును ఏకంగా సస్పెండ్ చేసిన తీరు కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. తనకు అనుకూలంగా పనిచేసేవారిని అందలం ఎక్కిస్తున్న జగన్… తనకు వ్యతిరేకంగా పనిచేసే వారితో పాటు తన వ్యతిరేకులకు అనుకూలురుగా ముద్ర పడిన వారి పట్ల ఎలా వ్యవహరిస్తున్నారన్న విషయంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోందని చెప్పాలి. మొత్తంగా జగన్ పాలనలో కీలక బాధ్యతలు దక్కించుకోవాలంటే… జగన్ చెప్పినట్టల్లా నడుచుకోవడంతో పాటు ఏమాత్రం ఎదురు సమాధానం చెప్పకుండా అన్నింటికీ జీ హుజూర్ అంటూ సాగాల్సిందేనన్న వాదనలు వినిపిస్తున్నాయి
Also Read ;- ఐఏఎస్ మళ్లీ చదువుకుని రావాలట.. జగన్ జమానాలో ఎన్నెన్ని వింతలో!