గాలి జనార్దన్ రెడ్డి.. ఒక్క తెలుగు నేల కాదు, ఆయన గారి కార్యక్షేత్రం కర్ణాటక కాదు.. యావత్తు దేశవ్యాప్తంగా ఏమాత్రం పరిచయం అక్కర్లేని పేరు. అక్రమ మైనింగ్ లో చేయి తిరిగిన నేతగానే కాకుండా.. బీజేపీ కర్ణాటక శాఖను కంటి చూపుతో శాసించిన నేతగా కూడా ఆయనకు పేరుంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు ఆనుకుని ఉన్న కర్నూలు జిల్లాకు చెందిన వాడిగా తనను తాను చెప్పుకునే గాలి.. జగన్ ను తనకు దేవుడిచ్చిన తమ్ముడు అంటూ సంబోధించి పెను కలకలమే రేపారు. ఉమ్మడి రాష్ట్రానికి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా.. అటు కర్ణాటకతో పాటు ఇటు ఏపీలోనే తనదైన శైలి హవాను కొనసాగించిన గాలి.. ఏపీ, కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఓబుళాపురంలో అక్రమ మైనింగ్ చేపట్టి వార్తల్లో వ్యక్తిగా మారిపోయారు. ఈ మైనింగ్ దందాతో వేలాది కోట్ల అక్రమ సంపాదనను వెనకేసుకున్న గాలి.. ఆడంబరాల్లో తనదైన మార్కును చూపించారు. రెండు, మూడేళ్ల క్రితం తన కూతురు పెళ్లిని ఎంత ఘనంగా చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్ పై బెంగళూరులో ఉన్న గాలి.. ఇప్పుడు జగన్ సొంత జిల్లా కడపకు వెళ్లేందుకు అనుమతి సంపాదించారు. ఈ నేపథ్యంలో దేవుడిచ్చిన తన తమ్ముడు జగన్ తో ఆయన భేటీ అవుతారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
బెయిల్ షరతులు ఇలా
గాలి జనార్దన్ రెడ్డికి మంజూరు చేసిన బెయిల్ నిబంధనలను ఓ మోస్తరుగా సడలిస్తూ సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఊరట లభించింది. 8 వారాల పాటు.. అంటే రమారమి రెండు నెలల పాటు ఆయన తన సొంతూరు బళ్లారితో పాటు జగన్ సొంత జిల్లా కడప, తన అక్రమ సంపాదనకు కాణాచిగా మారిన అనంతపురం జిల్లాల్లో పర్యటించేందుకు గాలికి కోర్టు అనుమతించింది. అయితే ఈ 3 ప్రాంతాలకు రాకపోకల గురించి ఆయా ప్రాంతాల జిల్లా ఎస్పీలకు సమాచారం అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేర సడలింపులు గాలికి వరమనే చెప్పాలి. ఎందుకంటే.. కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ పేరిట ఉక్కు ఫ్యాక్టరీకి గాలి జనార్దన్ రెడ్డి వైఎస్సార్ హయాంలో పునాది వేశారు. అయితే వైఎస్సార్ అకాల మరణం, ఆ తర్వాత జగన్ పై అక్రమాస్తుల కేసు, గాలిపై ఏకంగా అక్రమ మైనింగ్ కేసు.. ఆపై జగన్ తో పాటు గాలి కూడా జైలుకు వెళ్లడంతో ఈ ఫ్యాక్టరీ అటకెక్కేసిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. గాలి జనార్దన్ రెడ్డిపై ఉన్న మైనింగ్ కేసుల్లో త్వరగా విచారణ పూర్తి చేయాలంటూ హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బళ్లారి, కడప, అనంతపురంలో గాలి జనార్దన్ రెడ్డి పర్యటనలకు సంబంధించి తమకేమీ అభ్యంతరం లేదని సీబీఐ తెలపడంతోనే కోర్టు సడలింపులు ఇచ్చింది. ఈ కేసులో జనార్దన్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహాత్గీ, రంజిత్ కుమార్ లు వాదనలు వినిపించారు.
జగన్ తో భేటీ అసాధ్యమేనేమో?
కడప జిల్లాలో పర్యటనకు సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకున్న గాలి జనార్దన్ రెడ్డి.. రెండు నెలల పాటు కడపతో పాటు అనంతపురం, బళ్లారిలలో తరచూ పర్యటిస్తారని సమాచారం. బళ్లారిలో తన కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టుకునే పనిని చేపట్టనున్న గాలి.. అనంతపురం జిల్లాలో పర్యటనల ద్వారా మళ్లీ ఓబుళాపురం తరహాలో ఇంకేదైనా మైనింగ్ డెన్ ను కనిపెడతారేమో చూడాలి. ఇక కడప జిల్లాలో గాలి జరిపే పర్యటనలే అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. గాలిపై కేసులు నమోదు కానంతవరకు ఆయనతో కలిసి భేటీలు వేసిన జగన్.. గాలిపై కేసులు నమోదు కాగానే ఆయనతో దూరం పాటించారు. ఎంపీగా కొనసాగుతున్న ఓ సందర్భంలో పార్లమెంటు ఆవరణలోనే తన వద్ద మీడియా ప్రతినిధులు గాలి ప్రస్తావన తీసుకురాగానే తనదైన శైలి ఆగ్రహం వ్యక్తం చేసిన.. జగన్ తనకెవరూ అన్నల్లేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు గాలి తన వద్దకు వస్తానన్నా.. జగన్ అనుమతించే ప్రసక్తే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అక్రమాస్తుల కేసుల్లో నానాటికీ పీకల్లోతు కూరుకుపోతున్న జగన్.. గాలితో భేటీకి రెడీ అని మరో తలనొప్పి తెచ్చుకోలేరు కదా. అందుకే.. గాలి ఎంతగా అభ్యర్థించినా.. ఆయనకు జగన్ అపాయింట్ మెంట్ కాదు కదా.. తన గుమ్మం కూడా తొక్కనిచ్చే ఛాన్సే లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- జగన్ కోర్టు మెట్లెక్కాల్సిందేనా?