కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల కొండపై అన్ని విషయాల్లోనూ ఎప్పటికప్పుడు కొత్త తరహా పద్దతులు పుట్టుకువస్తుంటాయి. వెంకన్న సేవలకు దీని నుంచి మినహాయింపు. మిగిలిన అన్నింటా.. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే.. ఆ పార్టీ ప్రభుత్వం చెప్పినట్టుగా అక్కడ విధానాలు మారిపోతూ ఉంటాయి. అయితే వెంకన్న దర్శనమే మహా భాగ్యంగా అక్కడికి తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు.. ఎప్పటికప్పుడు చేస్తున్న మార్పులకు ఇట్టే అలవాటు పడిపోతూ ఉంటారు. తిరుమల వెంకన్న నైవేద్యానికి అత్యుత్తమ నాణ్యత కలిగినవే కాకుండా సంప్రదాయ సిద్ధంగా తయారైన దినుసులను వాడుతున్న వైనం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ భాగ్యాన్ని వెంకన్న భక్తులకు ఇచ్చే దిశగా టీటీడీ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అదే సంప్రదాయ పద్దతుల్లో సాగైన దినుసులతో సంప్రదాయ భోజనం. కొంత మొత్తం వసూలు చేసి రోజుకు 200 మందికి చేసి ఈ భోజనాన్ని అందించి.. దానికి వచ్చే రెస్పాన్స్ ను బట్టి సంప్రదాయ భోజనాన్ని విస్తరించాలా? వదలేయాలా? అనే నిర్ణయం తీసుకుంటామని కూడా టీటీడీ ప్రకటించింది.
మూడు రోజులకే రద్దైంది
వాస్తవానికి ఈ పథకంపై భక్తులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. తిరుమల కొండపై సంప్రదాయ భోజనం అంటే.. దాదాపుగా శ్రీవేంకటేశ్వరుడికి పెట్టే నైవేద్యంతో సమానంగా భావించారు. వెరసి ఈ పథకానికి భక్తుల నుంచి మంచి స్పందనే లభించింది. అంతేకాకుండా సంప్రదాయ భోజనం స్వీకరించిన భక్తులు కూడా దానిపై ప్రశంసలు కురిపించారు. ఆ భోజనం కోసం టీటీడీ నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించే విషయంలో భక్తుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. సంతోషంగానే ఆ మొత్తాన్ని చెల్లించారు కూడా. అయితే మూడు రోజులకే ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్టుగా టీటీడీ ప్రకటించింది. ఈ ప్రకటన టీటీడీ చైర్మన్ గా వరుసగా రెండో సారి బాధ్యతలు స్వీకరించిన వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డే స్వయంగా వెలువడింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలకమండలి లేనప్పుడు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని, అందుకే దీనిని రద్దు చేస్తున్నామని కూడా వైవీ చెప్పుకొచ్చారు.
పాలకవర్గం లేకుంటే తీసుకోవద్దా?
వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే పాలక మండలి ఉన్నా.. అధికారుల సూచనలు, సలహాలతోనే పాలక మండలి చైర్మన్ నిర్ణయాలు ప్రకటిస్తారు. పాలనలో ఏమాత్రం అనుభవం లేని వైవీ సుబ్బారెడ్డి లాంటి వారు టీటీడీ వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమేనా? అంతేకాకుండా తిరుమల కొండపై ఏ నిర్ణయం తీసుకున్నా.. అధికారులు ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు కూడా. అయితే పాలకమండలి లేనప్పుడు అధికారులు సంప్రదాయ భోజనాన్ని ప్రవేశపెట్టారని, అందుకే ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కు తీసుకుంటున్నామని వైవీ చెప్పారు. ఇక తన వాదనను సమర్థించుకునే దిశగా వైవీ చాలానే చెప్పారు. ఈ నిర్ణయంపై వైవీ ఎమంటారంటే.. ‘‘సంప్రదాయ భోజనంపై ప్రశంసలు కురిసినప్పటికీ, డబ్బులు తీసుకోవాలని నిర్ణయించడంపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వచ్చాయి. ఈ విషయమై అధికారులతో చర్చించా. పాలకమండలి లేనప్పుడే ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామి వారి ప్రసాదంగానే భోజనం అందించాలని, డబ్బులు వసూలు చేయకూడదని నిర్ణయించాం’’ అని వైవీ చెప్పుకొచ్చారు.
Must Read ;- టీడీపీకి దమ్ముంది.. మరి వైసీపీ మాటేంటో?